logo

ర్యాంకుల పంట  పండిస్తున్నారు 

వ్యవసాయ విద్యలోనూ తామేమి తక్కువ కాదని అమ్మాయిలు నిరూపిస్తున్నారు. కష్టపడి చదివి జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షల్లో అత్యుత్తమ ర్యాంకులు సాధించి భళా అనిపిస్తున్నారు. ఏజీ ఎమ్మెస్సీలో ప్రవేశం కోసం భారత వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసీఏఆర్‌) నిర్వహించిన ఏఐఈఈఏపీజీ పరీక్షలో ఫిజికల్‌ సైన్సెస్‌ విభాగంలో

Updated : 07 Dec 2021 06:34 IST

జాతీయ స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ
వ్యవసాయ విద్యలో రాణిస్తున్న విద్యార్థినులు

బాపట్ల, న్యూస్‌టుడే  వ్యవసాయ విద్యలోనూ తామేమి తక్కువ కాదని అమ్మాయిలు నిరూపిస్తున్నారు. కష్టపడి చదివి జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షల్లో అత్యుత్తమ ర్యాంకులు సాధించి భళా అనిపిస్తున్నారు. ఏజీ ఎమ్మెస్సీలో ప్రవేశం కోసం భారత వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసీఏఆర్‌) నిర్వహించిన ఏఐఈఈఏపీజీ పరీక్షలో ఫిజికల్‌ సైన్సెస్‌ విభాగంలో బాపట్లకు చెందిన విద్యార్థిని ఆలపాటి నైమిషా జాతీయ స్థాయిలో ప్రథమ ర్యాంకు కైవసం చేసుకుని సత్తా చాటింది. మరో విద్యార్థిని ఈరే విద్యామాధురి పదో ర్యాంకు సాధించి మెరిసింది. వ్యవసాయ ఇంజినీరింగ్‌ పీహెచ్‌డీ ప్రవేశ పరీక్షలో విద్యార్థిని నాగవరపు అనూష అఖిల భారత స్థాయిలో 26వ ర్యాంకు కైవసం చేసుకుని తల్లిదండ్రులకు గర్వకారణంగా నిలిచింది. వీరు కొత్త దిల్లీలోని ప్రతిష్ఠాత్మక అఖిల భారత వ్యవసాయ పరిశోధనా సంస్థ(ఐఏఆర్‌ఐ)లో ఎమ్మెస్సీ సీటు సంపాదించారు. భవిష్యత్తులో శాస్త్రవేత్తగా ఎదిగి.. వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సవాళ్లకు పరిష్కార మార్గాలు చూపి.. అన్నదాతల ఆదాయం పెంచి సాగును లాభసాటిగా తీర్చిదిద్దుతామని విద్యార్థినులు చెబుతున్నారు.

యాంత్రీకరణ కొత్త పుంతలు తొక్కించాలని..
బాపట్లకు చెందిన నాగవరపు అనూష తండ్రి నాగవరపు కృష్ణమూర్తి వ్యాపారి. బాపట్ల వ్యవసాయ ఇంజినీరింగ్‌ కళాశాలలో ఏజీ బీటెక్‌ను 90 శాతం మార్కులతో పూర్తి చేసింది. ప్రస్తుతం ఎంటెక్‌ చదవుతోంది. ఏజీ ఎంటెక్‌లోనూ 9 జీపీఏ సాధించింది. ఏజీ ఇంజినీరింగ్‌ పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశం కోసం జాతీయ స్థాయిలో నిర్వహించిన ప్రవేశ పరీక్షలో ప్రతిభ చాటి జాతీయ స్థాయిలో 26వ ర్యాంకు సాధించింది. కోర్సు పూర్తి చేసి శాస్త్రవేత్తగా ఎదిగి చిన్న, సన్నకారు రైతులు అన్ని పంటల సాగుకు ఉపయోగించేలా ఆధునిక యంత్ర పరికరాలు రూపొందించి.. వ్యవసాయ యాంత్రీకరణనను కొత్త పుంతలు తొక్కిస్తానని అనూష తెలిపింది.

సాగులో సవాళ్లను స్వయంగా చూసి..
విశాఖ జిల్లా తాళ్లపాళేనికి చెందిన ఈరే విద్యామాధురి తండ్రి నూకరాజు రైతు. తల్లి గంగాయమ్మ గృహిణి. రైతు బిడ్డగా పంటల సాగులో  ఎదుర్కొంటున్న సమస్యలు స్వయంగా చూసింది. బాపట్ల వ్యవసాయ కళాశాలలో ఏజీ బీఎస్సీ నాలుగేళ్ల కోర్సులో కష్టపడి చదివింది. క్షేత్రస్థాయికి వెళ్లి పంట భూముల్లో రైతులతో కలిసి పనిచేసింది. ఏజీ బీఎస్సీలో 8.22 జీపీఏ సాధించింది. పీజీ పరీక్షలో ఎంటమాలజీ, నెమటాలజీ విభాగంలో జాతీయ స్థాయిలో పదో ర్యాంకు కైవసం చేసుకుని సత్తా చాటింది. జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలోషిప్‌కు ఎంపికైంది. పీజీ అనంతరం శాస్త్రవేత్తగా ఎదిగి తెగుళ్లు, పురుగులను సమర్థంగా తట్టుకునేలా కొత్త వంగడాలు అభివృద్ద్ధి చేస్తానని విద్యామాధురి తెలిపింది. 


పాఠశాల స్థాయి నుంచి ప్రతిభ
బాపట్లకు చెందిన   ఆలపాటి నైమిషా పాఠశాల దశ నుంచే ప్రతిభావంతురాలైన విద్యార్థినిగా పేరు తెచ్చుకుంది. తల్లి సురేఖ తెలుగు ఉపాధ్యాయిని, తండ్రి వెంకటేశ్వర్లు వాణిజ్య శాస్త్ర అధ్యాపకుడు. నైమిషా ఇంటర్‌ బైపీసీలో 991 మార్కులు సాధించి రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలిచింది. వ్యవసాయ  విద్యపై మక్కువతో బాపట్ల ఏజీ కళాశాలలో బీఎస్సీ కోర్సులో చేరింది. రైతులతో కలిసి పొలాల్లో పనిచేసి వరి, వేరుశనగ, కూరగాయల పంటల్లో సమగ్ర  పోషక యాజమాన్య, సస్యరక్షణ పద్ధతులు అవలంబించడం ద్వారా అధిక దిగుబడులు సాధించేలా ప్రోత్సహించింది. ఏజీ బీఎస్సీలో జీపీఏ 9.41 సాధించి ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఉత్తమ విద్యార్థినిగా పురస్కారం అందుకుంది. పీజీ ప్రవేశ పరీక్షలో అత్యధిక మార్కులు సాధించి    ఫిజికల్‌ సైన్సెస్‌ విభాగంలో ప్రథమ ర్యాంకు కైవసం చేసుకుంది. ఐసీఏఆర్‌ నుంచి జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలోషిప్‌కు ఎంపికైంది. ప్రతినెలా రూ.12,640 ప్రతిభా ఉపకార వేతనం అందుకోనుంది. దేశంలో అగ్రగామి సంస్థ ఐఏఆర్‌ఐలో ఏజీ ఎమ్మెస్సీ కోర్సులో సీటు సంపాదించింది. పీజీ, పీహెచ్‌డీ పూర్తి చేసి మృత్తికా శాస్త్రం, వ్యవసాయ ఇంజినీరింగ్‌లో శాస్త్రవేత్తగా ఎదిగి వ్యవసాయ రంగాభివృద్ధికి కృషి చేస్తానని నైమిషా పేర్కొంది.

అన్నదాతకు అండగా నాబార్డు
వట్టిచెరుకూరు, న్యూస్‌టుడే: రైతులు తమ పంట ఉత్పత్తులు నిల్వ చేసుకునేందుకు అవసరమైన గిడ్డంగులు, శీతల గిడ్డంగుల నిర్మాణానికి కేంద్రం బ్యాంకు రుణాలపై మూడు శాతం రాయితీ ఇస్తుందని ఏపీ నాబార్డు చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ సుధీర్‌కుమార్‌ జన్నావర్‌ అన్నారు. ఆయన సోమవారం రైతునేస్తం ఫౌండేషన్‌ ఛైర్మన్‌ యడ్లపల్లి వెంకటేశ్వరరావుతో కలిసి కొర్నెపాడులోని రైతు శిక్షణ కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల ద్వారా విరివిగా రుణాలు ఇవ్వడం జరుగుతోందన్నారు. విజయవాడలో 31 నుంచి వచ్చే ఏడాది జనవరి 9 వరకు అమరావతి మేళా పేరుతో వ్యవసాయ ఉత్పత్తుల ప్రదర్శన ఉంటుందన్నారు. మేళాలో కర్షకులు స్టాల్స్‌ ఏర్పాటు చేసుకొని తమ పంటలు, ఉప ఉత్పత్తులను ప్రదర్శించుకోవచ్చన్నారు. ప్రకృతి, సేంద్రియ వ్యవసాయంతో పండించిన కారం, పసుపులకు మార్కెట్‌లో మంచి గిరాకీ ఉంటుందన్నారు. అంతకుముందు వెంకటేశ్వరరావు ఆయనకు శిక్షణ కేంద్రంలో పెంచుతున్న 28 రకాల గోవులను చూపించి వాటి ప్రాముఖ్యతను వివరించారు. సుధీర్‌కుమార్‌ వెంట గుంటూరు ఏజీఎం కేఆర్‌డీ కార్తిక్, జీఎంలు నగేష్‌కుమార్, రమేష్‌బాబు, కృష్ణా జిల్లా ఏజీఎం విజయ్‌ తురిమెళ్ల తదితరులున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు