logo

కలెక్టర్‌ ఆదేశించినా.. కేసు కట్టలేదు

ఆన్‌లైన్‌లో రెవెన్యూ రికార్డుల్లో మార్పులు చేసి మాచవరం మండలంలో ప్రభుత్వ భూములను ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేసిన బాధ్యులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌ ఆదేశించి రెండు నెలలు గడిచినా ఇప్పటికీ అమలుకాలేదు.

Published : 09 Dec 2021 00:51 IST

భూమాయ బాధ్యులపై చర్యలకు మీనమేషాలు

ఈనాడు, గుంటూరు

ఆన్‌లైన్‌లో రెవెన్యూ రికార్డుల్లో మార్పులు చేసి మాచవరం మండలంలో ప్రభుత్వ భూములను ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేసిన బాధ్యులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌ ఆదేశించి రెండు నెలలు గడిచినా ఇప్పటికీ అమలుకాలేదు. మాచవరం తహశీల్దారు పుల్లారావు సంబంధిత ధ్రువపత్రాలు పోలీసులకు ఇచ్చి కేసు నమోదుచేయాలని కోరినా, తాము అడిగిన విధంగా పత్రాలు లేవని పోలీసులు కేసు నమోదు చేయలేదు. రెవెన్యూ, పోలీసు శాఖల నడుమ సమన్వయలోపంతో కలెక్టర్‌ ఆదేశాలు నేటికీ అమలుకు నోచుకోలేదు. క్రిమినల్‌ కేసు నమోదైతే విచారణలో వాస్తవాలు వెలుగులోకి వస్తే, తామంతా ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుందని బాధ్యులంతా ఓ ప్రజాప్రతినిధిని ఆశ్రయించడంతో కేసు నమోదులో జాప్యం జరుగుతోందన్న ప్రచారం జరుగుతోంది. ఇందులో గ్రామస్థాయి కీలకనేతల ప్రమేయం ఉండటంతో వారంతా బాధ్యులను రక్షించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.

రెండు నెలలైనా నిర్లక్ష్యం: మాచవరం మండలంలో ఆన్‌లైన్‌లో రికార్డుల్లో మార్పులు చేసి అక్రమాలకు పాల్పడిన వైనాన్ని సెప్టెంబరు 14న ‘ఈనాడు’ వెలుగులోకి తెచ్చింది. దీనికి స్పందించిన కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌ పులిచింతల ప్రత్యేక కలెక్టర్‌ వినాయకాన్ని ప్రాథమిక విచారణ చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ప్రత్యేక కలెక్టర్‌ విచారణలో మాచవరం మండలంలోని పిల్లుట్ల, తాడుట్ల, చెన్నాయపాలెం, వేమవరం, పిన్నెల్లి, ఆకురాజుపల్లి గ్రామాల్లో 457.53 ఎకరాలు ప్రభుత్వ భూమి అనర్హులకు ధారాదత్తం చేసినట్లు గుర్తించారు. ఈమొత్తం వ్యవహారంలో అప్పట్లో పనిచేసిన తహశీల్దారు లెవీ, పొరుగు సేవల కింద పనిచేస్తున్న కంప్యూటర్‌ అపరేటర్లు కె.అన్వేష్‌, ఎం.విజయరాజు కీలకపాత్ర పోషించడంతోపాటు ఆయా గ్రామాల రెవెన్యూ అధికారుల ఉదాసీనత ఉన్నట్లు విచారణ నివేదికలో పేర్కొన్నారు. కంప్యూటర్‌ ఆపరేటర్లు ఇద్దరిని ఉద్యోగాల నుంచి తొలగించడంతోపాటు బ్లాక్‌లిస్టులో పెట్టి క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. గ్రామ రెవెన్యూ అధికారులు జి.కోటేశ్వరరావు, టి.లక్ష్మినారాయణ, బి.రామారావు, ఎస్‌కే.అబ్దుల్‌నబీ, ఎం.పుల్లయ్యను క్రమశిక్షణా చర్యల్లో భాగంగా వారు పనిచేస్తున్న గ్రామాల నుంచి బదిలీ చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. విశ్రాంత తహశీల్దారు జి.లెవీ మాచవరం ఇన్‌ఛార్జి తహశీల్దారుగా చేసిన కాలంలో రికార్డుల్లో చేసిన అక్రమాలపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శికి నివేదిక పంపారు. వీఆర్వోలను ఇప్పటికే బదిలీ చేశారు. అయితే ఆన్‌లైన్‌లో రెవెన్యూ రికార్డుల్లో అక్రమాల వ్యవహారంలో కీలకపాత్ర పోషించిన పొరుగు సేవల ఉద్యోగులపై క్రిమినల్‌ కేసులు పెట్టాలని మాచవరం తహశీల్దారును కలెక్టర్‌ ఆదేశించి రెండు నెలలు పూర్తయినా అమలు చేయలేదు. ఈ విషయమై మాచవరం ఎస్సై కోటయ్యను వివరణ కోరగా తహశీల్దారు ఫిర్యాదుతో పాటు ఇచ్చిన అన్ని పత్రాల్లోనూ విచారణాధికారి ధ్రువీకరించి ఇస్తే కేసు నమోదు చేస్తామని, ఈ విషయాన్ని రెవెన్యూవారికి తెలియజేసినా ఇప్పటికీ ఇవ్వలేదన్నారు. మాచవరం తహశీల్దారు పుల్లారావు మాట్లాడుతూ విచారణాధికారి నివేదికను ధ్రువీకరిస్తూ ప్రత్యేక కలెక్టర్‌ సంతకాలు చేసిన పత్రాలు అందించామని, అడంగల్‌, 1బీ పత్రాలను కూడా ధ్రువీకరించి ఇవ్వాలని చెప్పడంతో జాప్యం జరిగిందన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని