
మాట్లాడుతున్న జడ్పీ ఛైర్‌పర్సన్ కత్తెర హెని క్రిస్టినా,చిత్రంలో జేసీ రాజకుమారి
జిల్లాపరిషత్తు (గుంటూరు), న్యూస్‌టుడే : కలసి పని చేసి జిల్లాను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్దామని జిల్లా పరిషత్తు ఛైర్‌పర్సన్ కత్తెర హెని క్రిస్టినా అన్నారు. బుధవారం జడ్పీ సమావేశ మందిరంలో అభివృద్ధి పథకాలు, సంక్షేమ కార్యక్రమాలపై ఎంపీడీఓలతో సమీక్ష సమావేశాన్ని ఛైర్‌పర్సన్ నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ జిల్లాలో అభివృద్ధి పనులు పెండింగ్‌లో లేకుండా త్వరితంగా పూర్తి చేయాలన్నారు. నవరత్నాల కార్యక్రమాల్లో అర్హులైన పేదలకు ప్రభుత్వ పథకాలు అందేలా చూడాలన్నారు. జిల్లా సంయుక్త కలెక్టరు రాజకుమారి మాట్లాడుతూ స్థానిక సంస్థల ప్రతినిధులను సమన్వయం చేసుకుని అధికారులు పనులు చేయాలని సూచించారు. జడ్పీ సీఈఓ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఈ నెల 18 లోపు మండల పరిషత్తుల బడ్జెట్లను రూపొందించి జడ్పీలో సమర్పించాలన్నారు. విధులకు ఆలస్యంగా హాజరైనా, గైర్హాజరైనా ఛైర్‌పర్సన్ చర్యలు తీసుకుంటారన్నారు. నవరత్నాలు, స్వచ్ఛ సంకల్పం, ఉపాధి హామీ పథకం, ఓటీస్ అమలుపై సమీక్షించారు. సమావేశంలో డీపీఓ కేశవరెడ్డి, జడ్పీ ఇన్‌ఛార్జి డిప్యూటీ సీఈఓ మోహనరావు, ఎంపీడీఓలు, జడ్పీ సిబ్బంది పాల్గొన్నారు.