బాపట్ల - చీరాల రహదారి విస్తరణతో అభివృద్ధి
కేంద్రమంత్రికి సీఎం లేఖ రాశారన్న ఉప సభాపతి
విస్తరించనున్న రహదారి ఇదే..
బాపట్ల, న్యూస్‌టుడే : బాపట్ల పట్టణంలో మార్కెట్ యార్డు నుంచి ఇంజినీరింగ్ కళాశాల వరకు ఉన్న ప్రస్తుతం ఉన్న మార్గాన్ని నాలుగు వరుసల రహదారిగా అభివృద్ధి చేస్తే తీర ప్రాంతానికి గొప్ప వరమవుతుందని ఉప సభాపతి కోన రఘుపతి అన్నారు. బుధవారం ఆయన బాపట్లలో మాట్లాడుతూ చీరాల- బాపట్ల రహదారిని నాలుగు వరుసలుగా విస్తరించాలని కోరుతూ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి సీఎం వైఎస్ జగన్ లేఖ రాశారన్నారు. విస్తరణ పనులు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో చేపట్టాలని, దీని కోసం రూ.75 కోట్లు మంజూరు చేయాలని కోరారు. త్వరలో బాపట్ల కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు కానున్న నేపథ్యంలో ఈ రోడ్డు విస్తరణ అత్యవసరమని సీఎం లేఖలో పేర్కొన్నట్లు ఉప సభాపతి కోన రఘుపతి తెలిపారు. మూడు దశాబ్దాల పాటు ట్రాఫిక్ సమస్య ఉండదన్నారు. బాపట్ల పట్టణం నుంచి నగరం దిశగా ఎదగటానికి అడుగులు పడతాయని పేర్కొన్నారు. రహదారి విస్తరణ పనులకు అందరూ సహకరించాలని కోరారు. రహదారి విస్తరణపై ఇప్పటికే ఎన్‌హెచ్, పురపాలక అధికారులు సర్వే చేసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పంపించారు. భూసేకరణ వ్యయం రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది. నాలుగు వరుసల రహదారి నిర్మాణానికి అయ్యే వ్యయాన్ని కేంద్రం ఇవ్వనుంది. మార్కెట్ యార్డు నుంచి డీఎంపల్లి వద్ద వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం వరకు ఎనభై అడుగులు, అక్కడి నుంచి ఇంజినీరింగ్ కళాశాల వరకు వంద అడుగుల వెడల్పున రహదారి విస్తరించాలని ప్రతిపాదనల్లో పేర్కొన్నారు. రహదారికి రెండు వైపులా సిమెంటు మురుగు కాలువలు, ఫుట్‌పాత్‌లు, సెంట్రల్ లైటింగ్ నిర్మాణ పనులు చేపట్టనున్నారు. ప్రధానంగా పాత బస్టాండ్ నుంచి శ్రీనివాస సినిమా హాలు వరకు భూసేకరణ చేపట్టాల్సి ఉంటుంది. భూసేకరణలో నివాస, వాణిజ్య కట్టడాలు తొలగించాల్సి ఉంది.