logo

చిట్టీల పేరిట రూ.50 కోట్లకు టోకరా

గుంటూరు జిల్లా మంగళగిరి నగరంలోని ఆత్మకూరులో వందలాది మంది నుంచి రూ.50 కోట్ల వరకు చిట్టీలు కట్టించుకున్న వడ్డీ వ్యాపారి పరారవడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. మంగళగిరి గ్రామీణ పోలీసుల కథనం.. ఆత్మకూరులో వడ్డీ వ్యాపారి

Published : 09 Dec 2021 00:51 IST

మంగళగిరి గ్రామీణ పోలీస్‌స్టేషన్‌ వద్ద బాధితులు

మంగళగిరి, న్యూస్‌టుడే: గుంటూరు జిల్లా మంగళగిరి నగరంలోని ఆత్మకూరులో వందలాది మంది నుంచి రూ.50 కోట్ల వరకు చిట్టీలు కట్టించుకున్న వడ్డీ వ్యాపారి పరారవడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. మంగళగిరి గ్రామీణ పోలీసుల కథనం.. ఆత్మకూరులో వడ్డీ వ్యాపారి పుట్టా వెంకటేశ్వరరావు కొన్నేళ్లుగా ప్రైవేటు చిట్టీలు నిర్వహిస్తున్నాడు. తన వద్ద చిట్టీలు కట్టిన వారితోనే డబ్బు తీసుకొని వడ్డీ వ్యాపారం చేస్తున్నారు. గతంలో ప్రభుత్వ రంగ సంస్థలో పనిచేసిన ఆయన చిట్టీలు, వడ్డీ వ్యాపారం లాభదాయకంగా ఉండడంతో ఆ ఉద్యోగం వదిలేశాడు. పెద్ద ఎత్తున ఆస్తులు సమకూర్చుకున్నాడు. చిట్టీల పేరిట ఒక్కొక్కరి నుంచి రూ.10 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు నగదు తీసుకొని వడ్డీలకు తిప్పుతూ, వచ్చిన కిస్తీని నెలవారీగా చిట్టీకి జమ చేస్తున్నట్లు నమ్మించాడు. అధిక ఆదాయం వస్తుందన్న ఆశతో కొందరు ప్రభుత్వ ఉద్యోగులూ అతడికి పెద్ద మొత్తంలో చిట్టీలు కట్టారు. కొద్ది రోజులుగా సొమ్ము కోసం చిట్టీ సభ్యులు ఒత్తిడి పెంచడంతో వెంకటేశ్వరరావు ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులతో కనిపించకుండా వెళ్లిపోయాడు. లబోదిబోమంటూ పెద్ద సంఖ్యలో బాధితులు పోలీస్‌స్టేషన్‌ వద్దకు చేరుకొని గ్రామీణ ఎస్సై లోకేశ్‌కి గోడు వినిపించారు.

30 ఏళ్లుగా చిట్టీలు వేశా

వెంకటేశ్వరరావు 30 ఏళ్లుగా నాకు తెలుసు. చిట్టీలు వేస్తూ వచ్చిన డబ్బు ఆయనకే వడ్డీకి ఇచ్చాం. ఇల్లు కట్టుకుందామని ఆ సొమ్ము దాచుకున్నాం. నెల రోజులుగా డబ్బు అడుగుతుంటే, ఇస్తానంటూ తిప్పుతున్నాడు. అతడికి విజయవాడ, ఆత్మకూరులో ఆస్తులున్నాయి. అతడు, కొడుకు శివరామకృష్ణ కలిసి ఉన్న ఆస్తులన్నీ అమ్మేసుకొని ఏం లేనట్టు చూపుతూ మోసం చేస్తున్నారు.  - రమాదేవి, బాధితురాలు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని