logo
Published : 09/12/2021 00:51 IST

ధర రూ.999..అమ్మేది 1500

నల్లబజారులో జొన్న విత్తనాలు

ఈనాడు, గుంటూరు

కృష్ణా పశ్చిమడెల్టాలో మాగాణి వరి పంట తర్వాత రెండోపంటకు నీటి లభ్యతపై స్పష్టత ఉండటంతో జొన్న, మొక్కజొన్న సాగుకు రైతులు మొగ్గుచూపుతున్నారు. జొన్న విత్తనాలకు అనూహ్యంగా గిరాకీ ఏర్పడింది. ప్రధానంగా ఓ కంపెనీ విత్తనాలకు గరిష్ఠ చిల్లర ధర (ఎమ్మార్పీ) కంటే ఒక విత్తన సంచిపై రూ.500 అదనంగా వసూలు చేస్తున్నారు. మూడు కిలోల విత్తన సంచికి వ్యాపారులు బిల్లు రూ.999లకే ఇస్తున్నా రూ.1500లు తీసుకుంటున్నారు. జొన్న విత్తన మార్కెట్‌లో ఒక ప్రముఖ కంపెనీ గుత్తాధిపత్యం కొనసాగుతోంది. ఈక్రమంలో కంపెనీ అమ్మకం అధికారి చేతివాటం ప్రదర్శించి వారికి నచ్చిన డీలర్లకే సరఫరా చేస్తున్నారు. సీీజన్‌ ప్రారంభం నుంచి విత్తనాలకు డిమాండ్‌ ఉందని ప్రచారం చేసిన కంపెనీ ప్రతినిధులు సొమ్ము చేసుకుంటున్నారు. అవసరాల దృష్ట్యా రైతులు వ్యాపారులు చెప్పినంత ఇచ్చి కొనుగోలు చేస్తున్నారు.

కృత్రిమ కొరత సృష్టించి.. దోచేసి..

జిల్లాలో గిరాకీ ఉన్న విత్తనాలను నగరంలోని ముగ్గురు వ్యాపారులు ముందే పసిగట్టి సొమ్ము చేసుకుంటున్నారు. వీరు విత్తన వ్యాపారంలో త్రిమూర్తులుగా పేరు సంపాదించారు. మార్కెట్‌లో డిమాండ్‌ ఉన్న మిర్చి, కూరగాయలు, జొన్న, మొక్కజొన్న సంకర విత్తనాల కంపెనీలను వీరు ఆకర్షిస్తారు. జిల్లాలో సింహభాగం వ్యాపారం ఈ ముగ్గురిదే కావడంతో కంపెనీలు కూడా వీరికే సరఫరా చేస్తున్నాయి. మార్కెఫట్‌లో కృత్రిమ కొరత సృష్టించి వంగడాలు విక్రయించడంలో సిద్ధహస్తులు. వీరికి జిల్లా వ్యాప్తంగా చిల్లర వర్తకులతో అనుబంధంగా ఉన్నారు. వీరికి వచ్చిన సరకు దాచిపెట్టి కొద్ది కొద్దిగా మార్కెఫట్‌లోకి వదులుతూ విపరీతమైన డిమాండ్‌ ఉందని ప్రచారం చేస్తారు. తెలిసిన రైతులకు నేరుగా ఎమ్మార్పీ కంటే ఎక్కువగా అమ్ముతూ విత్తనం దొరకడం గగనం అనుకునేలా చేస్తారు. కొనుగోలు చేసిన రైతులు ఎవరికంట పడకుండా గ్రామాలకు వెళ్లిపోవాలని చెబుతారు. కొందరికి బిల్లు కూడా వెంటనే ఇవ్వకుండా తర్వాత ఇస్తామని చెప్పి మళ్లీ పంపుతారు. ఇలా డిమాండ్‌ మిర్చి విత్తనాలు ఏటా అమ్మడం వారికి కొట్టిన పిండి. ఇదే బాటలో జొన్న విత్తనాలకు కూడా కృత్రిమ కొరత సృష్టించి మార్కెట్‌ను ప్రభావితం చేస్తున్నారు. వ్యవసాయశాఖకు సరకు రాలేదని చెబుతూనే తెర వెనుక అమ్మకాలు షురూ చేస్తున్నారు. దుకాణంలో ప్రదర్శించే నిల్వబోర్డులో కూడా నిల్వలు ఉన్నట్లు నమోదు చేయరు. కంపెనీ ప్రతినిధులు సరకు సరఫరా చేసే క్రమంలో వ్యవసాయశాఖకు సమాచారం ఇవ్వాలి. ఇది కూడా అమలుకాకుండా త్రిమూర్తులు అడ్డుకుంటున్నట్లు సమాచారం.

డెల్టాలో ఆ ముగ్గురు...

కృష్ణా పశ్చిమ డెల్టాలో జొన్న ఎక్కువగా సాగు చేస్తారు. ఈప్రాంతంలో తెనాలి పట్టణంలో ఒకరు, దుగ్గిరాల, కొల్లిపర మండలాల్లో ఒక్కొక్కరు చొప్పున టోకు జొన్న విత్తన వ్యాపారాన్ని చేస్తున్నారు. డిమాండ్‌ ఉన్న కంపెనీ విత్తనాలు వీరికి మాత్రమే సరఫరా అవుతున్నాయి. జొన్న విత్తన అమ్మకాల్లో గుత్తాధిపత్యం సాధించి తాము చెప్పిన ధరకే విక్రయించడం గమనార్హం. ఈసారి వరి కోతలు మొదలుకాక ముందే విత్తనాలు రైతులకు విక్రయిస్తున్నారు. తాము ముందస్తుగా రూ.లక్షలు సొమ్ము చెల్లించి విత్తనాలు తీసుకువస్తున్నామని చెబుతున్నారు. అమ్ముతున్న విషయం బయటకు రాకుండా సహకరించాలని రైతులను కోరడం గమనార్హం. వీరికి సరఫరా చేసే కంపెనీ ప్రతినిధి కూడా సొమ్ము చెల్లించినవారికే ఎక్కువ సరఫరా చేశారన్న ఆరోపణలున్నాయి. ఈ విషయమై వ్యవసాయశాఖ సంయుక్త సంచాలకులు విజయభారతిని వివరణ కోరగా క్షేత్రస్థాయిలో యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి గరిష్ఠ చిల్లర ధరకు మించి అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

Read latest Guntur News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని