logo

రోడ్డు ప్రమాదంలో ఇద్దరి దుర్మరణం

రాత్రివేళలో ఎదురెదురుగా రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరొకరు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన నారాయణపేట జిల్లా నర్వలో చోటుచేసుకొంది. ఎస్సై విజయ్‌భాస్కర్‌ కథనం ప్రకారం..

Published : 15 Jan 2022 00:57 IST

నర్వ, న్యూస్‌టుడే : రాత్రివేళలో ఎదురెదురుగా రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరొకరు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన నారాయణపేట జిల్లా నర్వలో చోటుచేసుకొంది. ఎస్సై విజయ్‌భాస్కర్‌ కథనం ప్రకారం.. గుంటూరు జిల్లా మంగళంపాడు గ్రామానికి చెందిన షేక్‌ జిలానీ (48), షేక్‌ మహబూబ్‌ (33) సమీప బంధువులు. రాతిగోడల ఆలయం నిర్మాణంలో నైపుణ్యం ఉండటంతో నర్వ మండలం రాంపూర్‌ శివారులో ఓ ఆలయ నిర్మాణం కోసం ఇటీవల తీసుకొచ్చారు. ఆలయం దగ్గరే ఉంటూ పనులు చేస్తున్నారు. గురువారం రాత్రి నర్వకు వెళ్లి వంట సరకులు తీసుకొని ద్విచక్ర వాహనంపై తిరిగి వస్తుండగా.. లంకాల  గ్రామానికి చెందిన నరేందర్‌ ఎదురుగా ద్విచక్ర వాహనంపై వేగంగా వస్తూ.. బొప్పాయితోట వద్ద ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో వాహనం నడుపుతున్న జిలానీ అక్కడికక్కడే దుర్మరణం చెందగా.. తీవ్ర గాయాలైన శేక్‌ మహబూబ్‌ మహబూబ్‌నగర్‌ జనరల్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. బంధువులకు సమాచారం ఇవ్వడంతో శుక్రవారం వచ్చి, పోలీసులకు ఫిర్యాదు చేశారు. షేక్‌ మహబూబ్‌ భార్య షేక్‌ నూర్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. 
ట్రాక్టర్‌ ట్రక్కును ఢీకొని మరో యువకుడు..
నరసరావుపేట పట్టణం: ద్విచక్ర వాహనంపై వెళుతూ ఆగి ఉన్న ట్రాక్టర్‌ ట్రక్కును ఢీకొట్టడంతో యువకుడు మృతిచెందాడు. ఈ సంఘటన గురువారం అర్ధరాత్రి జరిగింది. గ్రామీణ పోలీసుల కథనం ప్రకారం.. రొంపిచర్ల మండలం అన్నవరానికి చెందిన తిరువీధుల అనిల్‌(20) రాజునగర్‌ సమీపంలో జరిగిన ప్రమాదంలో మృతిచెందాడు. అనిల్‌ నరసరావుపేట వచ్చి తిరిగి గ్రామానికి వెళుతున్న సమయంలో వాహనం అదుపు తప్పి ట్రక్కును ఢీకొట్టింది. ప్రమాదంలో అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసులు వచ్చి మృతదేహాన్ని ఏరియా ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించి కేసు నమోదు చేశామని గ్రామీణ పోలీసులు తెలిపారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని