logo

మదినిండా దేశభక్తి .. తనువంతా ధైర్యశక్తి

సాధారణంగా ఎవరైనా తమ పిల్లలను ఐఏఎస్‌ చదివించాలనో.. డాక్టర్‌ను చేయాలనో లేదా సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ను చేసి విదేశాలకు పంపాలనో ఆలోచిస్తారు. కానీ, ఆ రెండు గ్రామాల్లో ప్రతి కుటుంబం తమ పిల్లలను

Published : 15 Jan 2022 00:57 IST

 చందోలు, బావాజీపాలెంలో ఇంటింటా సైనికులు 
 నేడు ఆర్మీ డే


ఉన్నతాధికారులతో బావాజీపాలెం గ్రామ సైనికుల బృంద చిత్రం

చందోలు (పిట్టలవానిపాలెం), బావాజీపాలెం (నిజాంపట్నం), న్యూస్‌టుడే  సాధారణంగా ఎవరైనా తమ పిల్లలను ఐఏఎస్‌ చదివించాలనో.. డాక్టర్‌ను చేయాలనో లేదా సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ను చేసి విదేశాలకు పంపాలనో ఆలోచిస్తారు. కానీ, ఆ రెండు గ్రామాల్లో ప్రతి కుటుంబం తమ పిల్లలను భారత సైన్యంలోకి పంపేందుకే ఇష్టపడుతుంది. దేశ సేవకు మించిన సేవ మరొకటి లేదంటారు అక్కడి పెద్దలు. మగ బిడ్డ జన్మిస్తే ఆర్మీలో చేర్చుతారు. ఆడపిల్ల పుడితే సైనికులకే ఇచ్చి పెళ్లి చేస్తారు!. ఈ రెండు గ్రామాల్లో ఇంటికి ఇద్దరు ముగ్గురు చొప్పున దేశ సరిహద్దులో పహారా కాస్తున్నారు. రెండో ప్రపంచ యుద్ధంలోనూ పలువురు పాల్గొన్నారు. ఇలా.. నిజాంపట్నం మండలం బావాజీపాలెం.. పిట్టలవానిపాలెం చందోలు సైనికుల గ్రామాలుగా ప్రసిద్ధి చెందాయి.

ఇతర ఉద్యోగావకాశాలు ఉన్నా..
ఈ రెండు గ్రామాలకు చెందిన యువకులు తాము ఎన్నో ఉద్యోగావకాశాలు పొందే వీలున్నా.. సంకల్ప బలంతో పాటు గ్రామంలో ఆర్మీలో చేరిన పెద్దలను స్ఫూర్తిగా తీసుకుని సైన్యం బాట పడుతున్నారు. దేశ సరిహద్దుల్లో దట్టమైన అడవులు.. చిన్నప్పటి నుంచి తమతోపాటే పెరిగిన దేశభక్తితో అనేక మంది సైన్యంలో చేరి సేవలందిస్తున్నారు. కుటుంబాన్ని వదిలి మంచుతో కూడిన కొండలు.. పర్వతాలు వంటి చోట్ల కంటిపై కునుకు లేకుండా తమ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

నా కుటుంబమంతా ఆర్మీలోనే..
నేను సైన్యంలో పనిచేశాను. పనిచేస్తున్న సమయంలోనే నా ఇద్దరి కుమారులను కూడా చేర్పించాను. వారితోపాటు నాకు ముగ్గురు కుమార్తెలున్నారు. ఆర్మీలో పనిచేసే వారిని ఎంపికచేసి వివాహాలు జరిపించా. మా కుటుంబమంతా ఆర్మీలోనే పనిచేశారు. ప్రస్తుతం చేస్తున్నారు. నా కుటుంబం దేశమాతకు సేవలందిస్తున్నందుకు గర్వపడతాను.
-మహమ్మద్‌ ఇబ్రహీం, మాజీ సైనికుడు, బావాజీపాలెం

తాత స్ఫూర్తితో ఆర్మీలో చేరా...
డిగ్రీ వరకు చదివాను. మా తాత ఆర్మీలో పనిచేశారు. ఆయన స్ఫూర్తితో రక్షణ రంగం ఎంచుకున్నా. 2002లో సైనికునిగా చేరి సుబేదార్‌గా పనిచేస్తున్నా. మీరట్, నాసిక్, మంగుళూరు, కశ్మీర్‌లో పనిచేశా. ప్రస్తుతం దిల్లీలో విధులు నిర్వర్తిస్తున్నా.
- అబ్దుల్‌ నయీమ్, చందోలు

పెద్దలను ఆదర్శంగా తీసుకుని..
మా గ్రామంలో ఇంటికి ఇద్దరు ముగ్గురు సైనికులున్నారు. నేను దేశంలోని పలు సరిహద్దుల్లో పనిచేశాను.  అక్బర్‌ అనే వ్యక్తి సైన్యంలో పనిచేయకపోయినా తన ఐదుగురు మగ పిల్లలనూ ఆర్మీలోనే చేర్పించారు. గతంలో పనిచేసిన వారిని ఆదర్శంగా తీసుకుని నేటి యువకులు సైన్యంలో చేరి దేశ సేవ చేస్తున్నారు.
-అమానుల్లాఖాన్, మాజీ సైనికుడు, బావాజీపాలెం

చందోలు గ్రామ వాసిగా గర్విస్తున్నా : అంజుమ్, చందోలు
ప్రస్తుతం మీరట్‌లో ఆర్మీ ఇంజినీర్‌గా పనిచేస్తున్నా. నేను చేయాలంటే ఎన్నో ఉద్యోగాలు ఉన్నాయి. కానీ, గ్రామంలోని పెద్దలు చాలామంది సైన్యంలో సేవలందించి మంచి పేరు తెచ్చుకున్నారు. అందుకే దేశ రక్షణకే మొగ్గు చూపాను. మనదేశం కోసం తల్లిదండ్రులు, మాజీ సైనికులు చెప్పే మాటలు నన్ను ప్రభావితం చేశాయి. 2006లో ఆర్మీలో చేరాను.

ఏడు తరాలుగా... : మక్బుల్, చందోలు
సైన్యంలో పనిచేస్తూ ఇటీవలనే విరమణ పొందాను. మా ఇంట్లో ఏడుతరాలుగా ఆర్మీలో పనిచేసిన వారున్నారు. 1890లోనే మా వంశం వారు ఆర్మీలో చేశారు. అప్పటి నుంచి వరుసగా ఎవరో ఒకరూ పనిచేస్తూనే ఉన్నారు. మా తమ్ముడు, అన్నయ్య కూడా సైన్యంలోనే ఉన్నారు. దేశసేవకు మా కుటుంబం అంకితమైనందుకు సంతోషంగా ఉంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని