logo

అడ్డగోలు దోపిడీ

జిల్లాలో రబీ సీజన్‌లో సాగు చేసిన జొన్న, మొక్కజొన్న, మినుము, పెసర పంటలకు ప్రస్తుతం యూరియా అందించాలి. ఈక్రమంలో కొందరు వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టించి అధిక ధరకు అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు. జిల్లాలో అవసరాలకు సరిపడ యూరియా అందుబాటులో

Published : 21 Jan 2022 05:47 IST

యూరియా కావాలంటే కాంప్లెక్స్‌ ఎరువులు కొనాల్సిందే..

 

కృత్రిమ కొరత సృష్టించి అధిక ధరకు అమ్మకాలు

ఈనాడు, గుంటూరు జిల్లాలో రబీ సీజన్‌లో సాగు చేసిన జొన్న, మొక్కజొన్న, మినుము, పెసర పంటలకు ప్రస్తుతం యూరియా అందించాలి. ఈక్రమంలో కొందరు వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టించి అధిక ధరకు అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు. జిల్లాలో అవసరాలకు సరిపడ యూరియా అందుబాటులో ఉన్నా నిల్వలు నిండుకున్నాయని ప్రచారం చేసి రైతులకు కాంప్లెక్స్‌ ఎరువులు అంటగడుతున్నారు. జనవరి నెలలో జిల్లాకు 20525 టన్నులు యూరియా సరఫరా కావాల్సి ఉంది. ఈమేరకు యూరియా సరఫరా అవుతోంది. ఇప్పటికే 7 వేల టన్నుల పైగా రాగా వారంలో మిగిలిన యూరియా సరఫరాకు కంపెనీలు ప్రణాళిక ఇచ్చాయి. జిల్లాకు వచ్చిన యూరియాలో 50శాతం మార్క్‌ఫెడ్‌ ద్వారా రైతుభరోసా కేంద్రాలు, ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు, డీసీఎంఎస్‌లకు సరఫరా చేసి రైతులకు అందిస్తున్నారు. ఆర్బీకేల్లో యూరియా బస్తా రూ.266.50 ధరకి విక్రయిస్తున్న నేపథ్యంలో ప్రైవేటు వ్యాపారులు అధిక ధరకు అమ్మలేని పరిస్థితి ఏర్పడింది. ప్రైవేటు డీలర్లకు ఆయా కంపెనీలు రవాణా ఛార్జీలు ఇవ్వకపోవడంతో ఎమ్మార్పీకి విక్రయిస్తే గిట్టుబాటు కాదని ధర పెంచి బస్తా రూ.350కు అమ్ముతున్నారు. రైతులు ఎవరైనా ప్రశ్నిస్తే రవాణా ఛార్జీలు, ఎత్తుడు, దించుడు కూలీ, గోదాముల అద్దె తదితర ఖర్చులుంటాయని చెబుతున్నారు. ఈక్రమంలో కొరత ఉందని కొందరు ప్రచారం చేసి లబ్ధి పొందుతున్నారు. కొందరు రైతులు యూరియా కొరత ఏర్పడుతుందన్న భావనతో రైతుభరోసా కేంద్రాల నుంచి భవిష్యత్తు అసవరాలకు కూడా కొనుగోలు చేసి నిల్వ చేసుకుంటున్నారు. దీనివల్ల అందరికీ ఒకేసారి సరఫరా చేయడానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రైతులు ఆందోళన చెందకుండా వదంతులు పట్టించుకోకుండా అవసరాల మేరకు తీసుకెళ్తే కృత్రిమ కొరతకు అడ్డుకట్ట పడుతుందని వ్యవసాయశాఖ వర్గాలు చెబుతున్నాయి.

వందల టన్నుల నిల్వలు: జిల్లాలో టోకు వ్యాపారులు, ప్రైవేటు డీలర్ల వద్ద 35వేల టన్నుల యూరియా నిల్వలు ఉన్నాయి. కంపెనీ గోదాముల్లో 1300 టన్నుల నిల్వలు ఉన్నాయి. మార్క్‌ఫెడ్‌ వద్ద 3వేల టన్నుల యూరియా నిల్వ ఉంది. శుక్రవారం 3200 టన్నుల యూరియా జిల్లాకు రానుంది. నెలాఖరులోపు మరో 10వేల టన్నుల సరఫరా కానుంది. గుంటూరు, తెనాలి డివిజన్‌లో అవసరాలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో మార్క్‌ఫెడ్‌ వద్ద గుంటూరు, తెనాలి గోదాముల్లో ఉన్న యూరియా నిల్వలను సరఫరా చేశారు. అవసరాన్ని బట్టి నరసరావుపేట నుంచి కూడా డెల్టాకు సరఫరా చేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం ఉన్న నిల్వలు సరఫరా చేసి నెలాఖరులో వచ్చే కొత్త సరకును బఫర్‌ నిల్వ కింద ఉంచుకోనున్నారు.

కాంప్లెక్స్‌ ఎరువులు అంటగడుతున్నారు

23 ఎకరాల్లో సాగు చేస్తున్నాను. ఇందులో 19 ఎకరాలు మొక్కజొన్న, 3 ఎకరాలు మినుము సాగుచేశాను. యూరియా కోసం వారం రోజులుగా తిరుగుతున్నాను. దుకాణాల్లో అందుబాటులో లేదు. ప్రైవేటు వ్యాపారులు కాంప్లెక్స్‌ ఎరువులు కొనుగోలు చేస్తే ఆధార్‌కార్డు మీద 5 బస్తాలు ఇస్తామన్నారు. యూరియా కావాలంటే కాంప్లెక్స్‌ ఎరువులు కొనుగోలు చేయాలని షరతు పెడుతున్నారు. - సాంబశివరావు, దొప్పలపూడి గ్రామం, పొన్నూరు మండలం

అవసరాల మేరకు నిల్వలు ఉన్నాయి

జిల్లాలో జనవరి నెలలో 20125 టన్నుల యూరియా అవసరం ఉంది. ఇందుకు అనుగుణంగా ఆయా కంపెనీలు సరఫరా చేస్తున్నాయి. ఈనెలాఖరుకు 22120 టన్నుల సరఫరాకు కంపెనీలు ప్రణాళిక ఇచ్చాయి. జిల్లాలో పాత నిల్వలు కూడా ఉన్నాయి. రైతుభరోసా కేంద్రాల నుంచి ప్రతిపాదన పెట్టిన వెంటనే మార్క్‌ఫెడ్‌ నుంచి సరఫరా చేస్తున్నాం. రైతుభరోసా కేంద్రాల్లో ఎమ్మార్పీకి యూరియా విక్రయిస్తున్నాం. కొందరు వ్యాపారులు చేస్తున్న ప్రచారాన్ని రైతులు నమ్మకుండా ఆర్బీకేల్లో కొనుగోలు చేయాలి. రైతుల అవసరాల మేరకు యూరియా ఇవ్వడానికి సరిపడ నిల్వలు ఉన్నాయి.

- ఎం.విజయభారతి, సంయుక్త సంచాలకులు, వ్యవసాయశాఖ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని