logo

అవగాహనతో సైబర్‌ నేరాల నియంత్రణ

నిరంతర అధ్యయనం, అవగాహనతోనే సైబర్‌ నేరాల నియంత్రణ, సమగ్ర దర్యాప్తు సాధ్యమవుతాయని అదనపు డీజీపీ(ట్రైనింగ్స్‌) ఎన్‌.సంజయ్‌ అన్నారు. డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లా ఒంగోలులోని

Published : 22 Jan 2022 02:12 IST

ఒంగోలు నేరవిభాగం, న్యూస్‌టుడే: నిరంతర అధ్యయనం, అవగాహనతోనే సైబర్‌ నేరాల నియంత్రణ, సమగ్ర దర్యాప్తు సాధ్యమవుతాయని అదనపు డీజీపీ(ట్రైనింగ్స్‌) ఎన్‌.సంజయ్‌ అన్నారు. డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లా ఒంగోలులోని పోలీసు శిక్షణ కళాశాల(పీటీసీ)లో సెంటర్‌ ఫర్‌ రీసెర్చ్‌ ఆన్‌ సైబర్‌ ఇంటెలిజెన్స్‌, డిజిటల్‌ ఫోరెన్సిక్‌(సీఆర్‌సీఐడీఎఫ్‌) ఆధ్వర్యంలో రెండు రోజుల కార్యశాల ఏర్పాటు చేశారు. తొలుత అదనపు డీజీపీ(ట్రైనింగ్స్‌) ఎన్‌.సంజయ్‌, టెక్నికల్‌ సర్వీసెస్‌ డీఐజీ జి.పాలరాజు వీక్షణ ద్వారా అమరావతి నుంచి ఈ కార్యక్రమాన్ని శుక్రవారం ప్రారంభించారు. పెరుగుతున్న సైబర్‌ నేరాల కట్టడి, మరింత సమర్థ దర్యాప్తు కోసం రాష్ట్రవ్యాప్తంగా ఎంపిక చేసిన అధికారులకు శిక్షణ ఇస్తున్నట్టు తెలిపారు. దిల్లీకి చెందిన సీఆర్‌సీఐడీఎఫ్‌ సంస్థతో ఒప్పందం కుదర్చుకుని ఈ కార్యశాల నిర్వహిస్తున్నట్టు చెప్పారు. రాష్ట్రంలో అతిత్వరలో అత్యాధునిక సైబర్‌ ల్యాబ్‌ ఏర్పాటు కానుందని, ప్రతి జిల్లాకు సైబర్‌ టూల్స్‌ను అందుబాటులోకి తెస్తామని వివరించారు. ఎస్పీ మలికా గార్గ్‌ మాట్లాడుతూ.. సైబర్‌ నేరాలు రోజు రోజుకీ కొత్తరూపు సంతరించుకుంటున్నాయని అన్నారు. ప్రభుత్వ పథకాలు, ఆధార్‌ కార్డులు, కొవిడ్‌ వ్యాక్సిన్‌ పేరుతో, ఓటీపీ, కేవైసీ, ఆన్‌లైన్‌ మోసాలు చోటుచేసుకుంటున్నాయని.. మహిళలపై వేధింపులు పెరిగాయన్నారు. శిక్షణతో సైబర్‌ నేరాలకు ముకుతాడు వేయొచ్చని చెప్పారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రంలోని 13 జిల్లాలు, కమిషనరేట్ల నుంచి 115 మంది అధికారులు, సాంకేతిక నిపుణులు హాజరయ్యారు. పీటీసీ ప్రిన్సిపల్‌ ఎ.ఆర్‌.దామోదర్‌, వైస్‌ ప్రిన్సిపల్‌ కె.జె.ఎం.చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని