logo

పేకాట క్లబ్‌లపై ఉన్న శ్రద్ధ పరిపాలనపై లేదు

వైకాపా ప్రభుత్వం పేకాట క్లబ్‌లు, మద్యం దుకాణాలు, సినిమా టిక్కెట్లు, మాంసం దుకాణాల నిర్వహణపై చూపుతున్న శ్రద్ధ పరిపాలనపై చూపడం లేదని భాజపా జాతీయ కార్యవర్గ సభ్యుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. కర్నూలు జిల్లా ఆత్మకూరులో భాజపా నేత శ్రీకాంత్‌రెడ్డిపై జరిగిన దాడి

Published : 23 Jan 2022 01:41 IST

భాజపా జాతీయ కార్యవర్గ సభ్యుడు కన్నా లక్ష్మీనారాయణ

గుంటూరు, న్యూస్‌టుడే : వైకాపా ప్రభుత్వం పేకాట క్లబ్‌లు, మద్యం దుకాణాలు, సినిమా టిక్కెట్లు, మాంసం దుకాణాల నిర్వహణపై చూపుతున్న శ్రద్ధ పరిపాలనపై చూపడం లేదని భాజపా జాతీయ కార్యవర్గ సభ్యుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. కర్నూలు జిల్లా ఆత్మకూరులో భాజపా నేత శ్రీకాంత్‌రెడ్డిపై జరిగిన దాడి ఘటనను నిరసిస్తూ కర్నూలులో చేపట్టిన నిరసన సభలో గుంటూరు నుంచి ఆయన వర్చవల్‌ విధానంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో హిందువులకు, దేవాలయాలకు రక్షణ కరవైందని, హిందూ సమాజాన్ని పూర్తిగా నాశనం చేయడానికి జగన్‌ ప్రభుత్వం కంకణం కట్టుకుందన్నారు. హిందువులు అధికంగా ఉండే ప్రాంతంలో వారి అభిప్రాయాలకు వ్యతిరేకంగా అనుమతి లేకుండా మసీదు నిర్మాణం చేపట్టారన్నారు. దానిపై మాట్లాడేందుకు వెళ్లిన శ్రీకాంత్‌రెడ్డిపై తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్‌ చేశారన్నారు. ఆయనను విడుదల చేసే వరకు ఆందోళన కొనసాగుతుందన్నారు. రాష్ట్రంలో జగన్‌మోహన్‌రెడ్డి ప్రైవేటు లిమిటెడ్‌ కంపెనీ తప్ప మరొకటి ఉండకూడదని భావిస్తున్నారన్నారు. ఫ్యాక్షనిస్ట్‌ భావాలు కలిగిన వ్యక్తి ముఖ్యమంత్రి అయితే వ్యవస్థలన్నీ ఎలా నిర్వీర్యం అవుతాయో జగన్‌ పాలనే నిదర్శనమన్నారు. వారం రోజుల్లో సీపీఎస్‌ రద్దు చేస్తానని ఉద్యోగులను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన జగన్‌ నేడు వారిని రోడ్డున పడేశారన్నారు. జగన్‌ ఆడుతున్న మోసపూరిత నాటకాన్ని ఉద్యోగులు గమనించే రోడ్డు ఎక్కారని అభిప్రాయపడ్డారు. ఉద్యోగుల ఉద్యమానికి భాజపా అండగా ఉంటుందన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని