logo

వామ్మో.. శావల్యాపురం స్టేషన్‌

మండల కేంద్రం శావల్యాపురం పరిధిలో 15 పంచాయతీలు, ఎనిమిది శివారు గ్రామాలున్నాయి. అన్నీ 10 కి.మీ దూరానికి మించి లేవు. రాజకీయ చైతన్యం మెండుగా ఉన్న ఇక్కడ పోలీసులు ఏ మాత్రం పొరపాట్లకు తావిచ్చినా, ఏమరుపాటుగా ఉన్నా మూల్యం చెల్లించక తప్పదు. 2014 ఎన్నికల్లో

Published : 23 Jan 2022 01:41 IST

పోలీసు అధికారులకు అర్ధాంతర బదిలీలు

వినుకొండ, శావల్యాపురం, న్యూస్‌టుడే మండల కేంద్రం శావల్యాపురం పరిధిలో 15 పంచాయతీలు, ఎనిమిది శివారు గ్రామాలున్నాయి. అన్నీ 10 కి.మీ దూరానికి మించి లేవు. రాజకీయ చైతన్యం మెండుగా ఉన్న ఇక్కడ పోలీసులు ఏ మాత్రం పొరపాట్లకు తావిచ్చినా, ఏమరుపాటుగా ఉన్నా మూల్యం చెల్లించక తప్పదు. 2014 ఎన్నికల్లో అప్పటి ఎస్‌ఐ గల్లా రవికృష్ణ వేల్పూరులో తెదేపా కార్యకర్తలతో వివాదం చోటుచేసుకుంది. దాని పర్యవసనంగా ఫలితాలు వచ్చిన వెంటనే ఆయనను వీఆర్‌కు పంపించారు. ఆ తర్వాత వచ్చిన ఎస్‌ఐ ఓ కేసు విషయంలో వ్యవహరించిన తీరుపై కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో ఉన్నతాధికారులు పక్కన పెట్టారు. తదుపరి పని చేసిన ఎస్‌ఐ 12 నెలల్లో స్టేషన్‌ అభివృద్ధి పేరుతో వసూళ్లు చేశారన్న ఆరోపణలపై ఆయనను అక్కడ నుంచి వెనక్కి పిలిచారు. ఆయన స్థానంలో వచ్చిన ఎస్‌ఐ ప్రత్యర్థుల ఎదుట అవమానించారని మతుకుమల్లికి చెందిన దంపతులిద్దరూ మనస్తాపంతో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించడంతో ఆయన్నీ వీఆర్‌కు పంపించారు. ఆ తర్వాత వచ్చిన ఎస్‌ఐ మన్మథరావు రెండు, మూడు నెలలకే బదిలీపై వెళ్లారు. 2019 ఎన్నిక వేళ బాధ్యతలు స్వీకరించిన చెన్నకేశవులు ఆ ప్రక్రియ పూర్తికాగానే మరోచోటుకు వెళ్లగా, ఆయన స్థానంలో వచ్చిన కత్తి స్వర్ణలత ఏడాదిన్నర కాలం పని చేశారు. ఆమె స్థానంలో వచ్చిన దాసరి శివనాగరాజు ఏడాదిలోనే బదిలీకాగా, ప్రస్తుతం పని చేస్తున్న లోకేశ్వరరావు జడ్పీటీసీ ఎన్నికల తర్వాత పది రోజులు సెలవుపై వెళ్లారు. ఈలోపు ఇన్‌ఛార్జిగా బండ్లమోటు ఎస్‌ఐ రవీంద్రారెడ్డి ఉండగా రైతు నరేంద్రపై హత్యాయత్నం కేసు నమోదు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశ కావడంతో సెలవులో ఉన్న ఎస్‌ఐ తిరిగి విధుల్లో చేరడం గమనార్హం.

జడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా తమకు సహకరించలేదని అధికార పార్టీ ఆగ్రహనికి గురైన నలుగురు పోలీస్‌ సిబ్బందిని కొంత కాలం ఇతర ప్రాంతాల్లో విధులకు పంపించారు. కొద్దిరోజుల తర్వాత తిరిగి వచ్చిన వారిలో ముగ్గురు సొంతంగా బదిలీ చేయించుకొని వెళ్లగా, ప్రస్తుతం స్టేషన్‌ సిబ్బంది కొరత ఎదుర్కొంటుంది. అవసరమైనప్పుడు ఇతర స్టేషన్ల నుంచి పిలిపిస్తున్నారు. ఇవన్నీ అవలోకం చేసుకున్న అధికారులు వాస్తు దోషమేమోనన్న అనుమానంతో రెండు రోజుల నుంచి స్టేషన్‌లో మార్పులు చేస్తున్నారు. ప్రధాన గేటుకు ఎదురుగా మరో ఒక చిన్న గేటు, స్టేషన్‌ గ్రిల్‌కు మరో కిటికీ ఏర్పాటు చేశారు. పోలీసులైనా ఇబ్బందులెదురైనప్పుడు ఇటువంటివి చేయక తప్పదు మరీ.

జిల్లాకు మారుమూలగానున్న శావల్యాపురం స్టేషన్‌లో విధులంటే పోలీసు అధికారులు హడలిపోతున్నారు. తొమ్మిదేళ్ల వ్యవధిలో పూర్తికాలం రెండేళ్ల పాటు ఉద్యోగం చేసినవారు లేరంటే అతిశయోక్తికాదు. రాజకీయ ఒత్తిళ్లతో కొందరు, స్వీయ తప్పిదాలతో మరికొందరు అర్ధంతరంగా బదిలీపై వెళ్లినవారు ఎక్కువ మంది ఉన్నారు. తాజాగా ఈ స్టేషన్‌ పరిధిలోనే రైతుపై హత్యాయత్నం కేసు నమోదు, అరెస్టు నేపథ్యంలో సీఐ అశోక్‌కుమార్‌ సస్పెన్షన్‌కు గురికావడం చర్చనీయాంశమైంది. శావల్యాపురం స్టేషన్‌ అంటే పోలీసు అధికారులే వామ్మో అంటున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని