logo

భాషించి..స్నేహించి

 తెలుగు మాధ్యమంలో చదువుతున్న విద్యార్థులకు ఇంగ్లిష్‌ అంటే సహజంగానే భయం ఉంటుంది. ఎవరితోనైనా మాట్లాడాలంటే వామ్మో తమవల్ల కాదంటారు. కానీ, నగరం మండలం పెద్దవరం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఎనిమిది దేశాల విద్యార్థులతో సంభాషిస్తున్నారు.

Published : 23 Jan 2022 01:41 IST

విదేశీ విద్యార్థులతో పెద్దవరం విద్యార్థుల మిత్రబంధం

ఆంగ్లంపై భయం పోగొట్టేందుకు ఉపాధ్యాయుని కృషి


పెద్దవరం విద్యార్థులతో మాట్లాడుతున్న రష్యా విద్యార్థులు

పెద్దవరం (నగరం), న్యూస్‌టుడే తెలుగు మాధ్యమంలో చదువుతున్న విద్యార్థులకు ఇంగ్లిష్‌ అంటే సహజంగానే భయం ఉంటుంది. ఎవరితోనైనా మాట్లాడాలంటే వామ్మో తమవల్ల కాదంటారు. కానీ, నగరం మండలం పెద్దవరం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఎనిమిది దేశాల విద్యార్థులతో సంభాషిస్తున్నారు. సాంకేతికత సద్వినియోగం చేసుకొంటూ వారితో స్నేహం చేస్తున్నారు. ఆంగ్ల ఉపాధ్యాయుడు ఉల్లంగుంట వెంకటేశ్వరరావు కృషితో వియత్నాం, ఆస్ట్రేలియా, స్పెయిన్‌, రష్యా, ఇంగ్లాండ్‌, గ్రీస్‌, పోర్చుగల్‌ తదితర ఎనిమిది దేశాలకు చెందిన విద్యార్థులతో తరచూ మాట్లాడుతున్నారు. స్కైప్‌ మాధ్యమం ద్వారా విదేశీ ఉపాధ్యాయులతో సైతం పలు అంశాలపై ముఖాముఖిగా చర్చిస్తున్నారు. అక్కడి ఉపాధ్యాయులు, విద్యార్థులు డాక్యుమెంటరీ వీడియో ద్వారా ఆయా దేశాల్లోని విద్యావిధానం, ఉద్యోగ అవకాశాలు, ప్రపంచ ప్రసిద్ధిగాంచిన పరిశ్రమలు, చారిత్రక ప్రదేశాలు, ముఖ్యమైన పట్టణాలు, నదులతో పాటు ముఖ్యమైన వ్యక్తులను చూపిస్తున్నారు. అలాగే, భారత విద్యా విధానం, ఇక్కడి పాఠశాలల్లో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, క్రీడలు, తెలుగు పండగలు, సంస్కృతి సంప్రదాయాల ప్రాముఖ్యాన్ని విదేశీ విద్యార్థులకు వీడియోల ద్వారా వివరిస్తున్నారు.. మన విద్యార్థులు.

ఆసక్తి గమనించి..: ఆంగ్లంపై విద్యార్థుల ఆసక్తి గమనించిన ఉపాధ్యాయుడు వెంకటేశ్వరరావు విదేశీ విద్యార్థులతో ముఖాముఖిగా మాట్లాడిద్దామని యోచన చేశారు. సామాజిక మాధ్యమాల ద్వారా విదేశీయులను సంప్రదించారు. 8 దేశాల నుంచి స్కైప్‌ ద్వారా మాట్లాడేందుకు ఉత్తర ప్రత్యుత్తరాలు నడిచాయి. గ్రామాల్లో అంతర్జాల సౌకర్యాలు లేక మొదట్లో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి. ప్రధానోపాధ్యాయుడు విచారపు శ్రీనివాసరావు చొరవ తీసుకొని సమస్య పరిష్కరించారు. దీంతో రష్యా, స్పెయిన్‌, వియత్నాం, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌ దేశ విద్యార్థులతో ముఖాముఖిగా సంభాషించారు. విదేశీ ఉపాధ్యాయులు, విద్యార్థులతో సంభాషించిన విద్యార్థులు తమ అభిప్రాయాలు ‘న్యూస్‌టుడే’తో పంచుకున్నారు.

అర్థమయ్యేలా వివరించారు

ఆంగ్లంలో మాట్లాడాలంటే మొదట్లో భయమేసింది. అక్కడ పనిచేస్తున్న ఉపాధ్యాయిని, విద్యార్థులు మాట్లాడుతుంటే అలా చూస్తూ ఉండిపోయాను. ఇంగ్లిషు మాట్లాడే విధానం ఇబ్బందిగా ఉన్నా ఒకట్రెండు పర్యాయాలు అర్థమయ్యేలా వివరించారు. వారితో మాట్లాడం చాలా సరదా అనిపించింది.

- బండి రూపశ్రీ, 8వ తరగతి

ఎన్నో విషయాలు చెప్పారు

మనకు ఆరు సబ్జెక్టులు ఉంటే వారికి మొత్తం పది సబ్జెక్టులు ఉంటాయంట. సంగీతం, నాట్యం, క్రీడలు ఇవి కూడా వారికి సబ్జెక్టులేనని చెప్పారు. విదేశీ విద్యార్థులతో సంభాషించాలంటే ఏదోలా అనిపించింది. ఒకరిని ఒకరు చూసుకుంటూ మాట్లాడుకోవడం వల్ల బిడియం పోయింది. ఆ దేశంలోని తరగతి గదులు, విద్యావిధానం విద్యార్థుల మాటల్లో తెలుసుకోవడం చాలా ఆసక్తి అనిపించింది. - వీరంకి యుగంధరి, 9వ తరగతి

పట్టు పెంచాలని..

విద్యార్థుల్లో కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ (భావ వ్యక్తీకరణ నైపుణ్యాలు) అభివృద్ధి చేసేందుకు నా వంతు కృషి చేస్తున్నాను. ఉన్నత చదువులు, ఉద్యోగాలు సాధించాలంటే విద్యార్థులకు ఆంగ్ల భాషపై పట్టు ఉండి తీరాలి. విదేశీ విద్యార్థులతో సంభాషించే ప్రయత్నంలో మన విద్యార్థులు స్వయంగా ఆంగ్లంలో ప్రశ్నలు తయారు చేసుకోవడం, వారితో ఏమేం సంభాషించాలో ముందుగా సంసిద్ధులు కావడం నాకెంతో సంతృప్తినిచ్చింది. - ఉల్లంగుంట వెంకటేశ్వరరావు, ఆంగ్ల ఉపాధ్యాయుడు


స్పెయిన్‌ ఉపాధ్యాయిని పిలార్‌ గ్రేసియాతో సంభాషణ..

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు