logo

మిర్చి ధరలు ఆశాజనకం

మిర్చి ధరలు ఆశాజనకంగా ఉన్నాయి. గత వారం హెచ్చు తగ్గులుగా ఉన్నా.. ఈ వారం మాత్రం అన్ని రకాల ధరలు పెరిగాయని వ్యాపారవర్గాలు పేర్కొంటున్నాయి. గత వారం యార్డుకు వరుసగా నాలుగు రోజులు సంక్రాంతి సెలవులు వచ్చినా చాలా తక్కువగా బస్తాలు వచ్చాయి.

Published : 25 Jan 2022 01:40 IST


మిర్చి యార్డులో బస్తాలు

మిర్చియార్డు, న్యూస్‌టుడే: మిర్చి ధరలు ఆశాజనకంగా ఉన్నాయి. గత వారం హెచ్చు తగ్గులుగా ఉన్నా.. ఈ వారం మాత్రం అన్ని రకాల ధరలు పెరిగాయని వ్యాపారవర్గాలు పేర్కొంటున్నాయి. గత వారం యార్డుకు వరుసగా నాలుగు రోజులు సంక్రాంతి సెలవులు వచ్చినా చాలా తక్కువగా బస్తాలు వచ్చాయి. ఈ వారం రెట్టింపు సరకు వచ్చింది. గత సోమవారం 40,333 బస్తాలను మాత్రమే యార్డుకు రైతులు తరలించారు. ఈ వారం 94,235 బస్తాలు వచ్చాయి. ఈనామ్‌ ద్వారా 85,350 బస్తాలు విక్రయాలు జరిగాయి. అమ్మకాలు ముగిసే సమయానికి యార్డులో 34,532 బస్తాలు నిల్వ ఉన్నాయి. ఈ ఏడాది సీజన్‌ ప్రారంభమయ్యాక ఈ స్థాయిలో యార్డుకు సరకు రావడం ఇదే ప్రథమం.

రూ.1000 పైగానే పెరిగిన ధర...
మిర్చి ధర గత వారంతో పోలిస్తే రూ.1000 పైగానే పెరిగింది. కర్నూలు జిల్లా నుంచే కాకుండా తెలంగాణలోని ఖమ్మం జిల్లా నుంచి ఈ వారం రైతులు గుంటూరు మిర్చియార్డుకు బస్తాలు తరలించారు. అక్కడ ధరలు అంత ఆశాజనకంగా లేకపోవడంతో ఇక్కడకు తరలించారని వ్యాపారులు, అధికారులు పేర్కొంటున్నారు. రాబోయే రోజుల్లో ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుండటంతో స్టాకిస్టులు కొనుగోలు చేసి నిల్వ చేస్తున్నారంటున్నారు. ఈ వారం నాణ్యత కలిగిన మిర్చి రావడంతో పాటు ఎగుమతుల ఆర్డర్లు కూడా బాగుండటం ధరలు పెరిగేందుకు కారణమంటున్నారు. నాన్‌ ఏసీ కామన్‌ వెరైటీ ధరలు గత వారంతో పోలిస్తే పెరిగాయి. 334, నెంబర్‌ 5, 273, 341, 4884, సూపర్‌ 10 రకాల మిర్చి సగటు ధర ఇంతకుముందు రూ.7,000 నుంచి రూ.16,500 ఉండగా. ప్రస్తుతం రూ.7,000 నుంచి రూ.17,800కు చేరింది. ఈ రకాలపై సగటున రూ.1,300 వరకు ధర పెరిగింది. నాన్‌ ఏసీ స్పెషల్‌ వెరైటీ తేజ రకం గతంలో రూ.7,000 నుంచి రూ.16,000 ఉండగా, ఈ వారం రూ.17,000కు చేరుకుంది. బాడిగ రకాల మిర్చి ధర గత వారం రూ.7,300 నుంచి రూ.16,000 ఉండగా.. ప్రస్తుతం రూ.17,500కు చేరింది. రూ.1,500 మేర బాడిగ రకం మిర్చి ధర పెరిగింది. తాలు ధరల్లో మార్పు లేదు. తాలు మిర్చికి రూ.4,000 నుంచి రూ.9,000 ధర లభించింది. ఏసీ కామన్‌ వెరైటీ 334, నెంబర్‌ 5, 341 రకాల మిర్చి సగటు ధర రూ.9,500 నుంచి రూ.15,200 ఉండగా.. ఈ వారం రూ.17,000కు చేరుకుంది. ఏసీ స్పెషల్‌ వెరైటీ తేజ గత వారం రూ.9,000 నుంచి రూ.15,500 ఉండగా.. ఈసారి రూ.16,800కు చేరింది. బాడిగ గతంలో రూ.7,000 నుంచి రూ.16,500 ఉండగా, ఈ వారం రూ.17,000కు పెరిగింది. గత వారం బస్తాలు తక్కువగా రావడంతో సాయంత్రం 5 గంటలకే తూకాలు పూర్తవగా.. ఈ వారం సరకు అధికంగా రావడంతో రాత్రి 9 గంటల వరకు కొనసాగాయని వ్యాపారులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని