logo

‘వైకాపా ప్రభుత్వంపై తిరుగుబాటు మొదలు’

ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న వైకాపా ప్రభుత్వం పట్ల అన్ని వర్గాల్లో తిరుగుబాటు ప్రారంభమైందని, తెదేపా పట్ల ఆదరణ ప్రజల్లో రోజురోజుకీ పెరుగుతుందని తెదేపా నేతలు కోవెలమూడి రవీంద్ర, జూలకంటి బ్రహ్మరెడ్డి పేర్కొన్నారు. ఇటీవల దారుణ హత్యకు

Published : 25 Jan 2022 01:40 IST


చంద్రయ్య కుటుంబానికి ప్రవాసాంధ్రులు అందజేసిన రూ.6,60,000
నగదును బ్రహ్మారెడ్డికి అందజేస్తున్న రవీంద్ర, తెదేపా నేతలు

గుంటూరు, న్యూస్‌టుడే: ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న వైకాపా ప్రభుత్వం పట్ల అన్ని వర్గాల్లో తిరుగుబాటు ప్రారంభమైందని, తెదేపా పట్ల ఆదరణ ప్రజల్లో రోజురోజుకీ పెరుగుతుందని తెదేపా నేతలు కోవెలమూడి రవీంద్ర, జూలకంటి బ్రహ్మరెడ్డి పేర్కొన్నారు. ఇటీవల దారుణ హత్యకు గురైన చంద్రయ్య కుటుంబానికి గుంటూరుకు చెందిన ప్రవాస భారతీయులు అందజేసిన రూ.6.60 లక్షల ఆర్థిక సాయాన్ని సూరపనేని నిఖిల్‌ తండ్రి శ్రీధర్‌ .. గుంటూరు పశ్చిమ తెదేపా ఇన్‌ఛార్జి కోవెలమూడి రవీంద్ర చేతుల మీదుగా మాచర్ల ఇన్‌ఛార్జి జూలకంటి బ్రహ్మారెడ్డికి సోమవారం అందజేశారు. రవీంద్ర మాట్లాడుతూ గుంటూరుకు చెందిన ప్రవాస భారతీయులు చింతమనేని సుధీర్‌, సూరపనేని నిఖిల్‌ కలసి డల్లాస్‌ నుంచి రూ.5 లక్షలు, యార్లగడ్డ రవి, అనిల్‌లు రూ.1.60 లక్షలు ఇచ్చారు. పార్టీ కోసం శ్రమించే చంద్రయ్య కుటుంబానికి తామంతా అండగా ఉంటాం. ఒకరిని హత్య చేస్తే 100 మంది కార్యకర్తలు నాయకులుగా తయారవుతారు. హత్యా రాజకీయాల వల్ల సాధించేది ఏమీ లేదు. ఇలా మనుషుల ప్రాణాలు తీసిన వారు ఏదో ఒక రోజున శిక్ష అనుభవిస్తారు’.. అని ధ్వజమెత్తారు. బ్రహ్మారెడ్డి మాట్లాడుతూ ‘వైకాపా నేతలు పోలీసుల్ని, ప్రభుత్వ యంత్రాంగాన్ని అడ్డుపెట్టుకుని విర్రవీగుతున్నారు. కార్యకర్తలు ఎప్పుడైతే స్వచ్ఛందంగా ముందుకొచ్చి తెదేపా జెండాను భుజానికి ఎత్తుకుని తిరుగుతున్నారో.. అప్పటి నుంచి వైకాపా నాయకులకు భయం పట్టుకుంది. స్థానిక ఎమ్మెల్యే అధికారాన్ని అడ్డుపెట్టుకుని తెదేపా నాయకులు, కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టిస్తున్నారు’.. అని మండిపడ్డారు. కార్యక్రమంలో తెదేపా నాయకులు దాసరి రాజామాస్టర్‌, సుఖవాసి శ్రీనివాసరావు, కొమ్మినేని కోటేశ్వరరావు, దామచర్ల శ్రీనివాసరావు, కనపర్తి శ్రీనివాసరావు, మానం శ్రీనివాసరావు, ఉప్పల రామారావు తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని