logo

ఓటీఎస్‌కు ఉద్యోగుల సమ్మె దెబ్బ!

ప్రభుత్వ రుణంతో ఇళ్లు నిర్మించుకున్న లబ్ధిదారులు జగనన్న శాశ్వత గృహ హక్కు పథకంలో వన్‌ టైం సెటిల్‌మెంట్‌ (ఓటీఎస్‌)ని వినియోగించుకోవడం ద్వారా గృహాలు సొంతం చేసుకోవచ్చని ప్రభుత్వం చెపుతోంది.

Published : 25 Jan 2022 01:40 IST

జిల్లాపరిషత్తు(గుంటూరు), న్యూస్‌టుడే: ప్రభుత్వ రుణంతో ఇళ్లు నిర్మించుకున్న లబ్ధిదారులు జగనన్న శాశ్వత గృహ హక్కు పథకంలో వన్‌ టైం సెటిల్‌మెంట్‌ (ఓటీఎస్‌)ని వినియోగించుకోవడం ద్వారా గృహాలు సొంతం చేసుకోవచ్చని ప్రభుత్వం చెపుతోంది. దీని కోసం లబ్ధిదారులకు అవగాహన కల్పించి నిర్ణయించిన మేరకు నగదు చెల్లించాలని అధికారులు, సిబ్బందికి లక్ష్యాలను నిర్ణయించి నగదు వసూళ్లు చేపట్టింది. జిల్లాలో మొత్తం 3,57.905 మంది లబ్ధిదారుల నుంచి రూ.390.65 కోట్లను సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికి 99,389 మంది రూ.25 కోట్లను చెల్లించారు. వీరి పేరిట ఇళ్లు బదిలీ చేస్తూ గృహ హక్కు పత్రాలను గ్రామ, వార్డు సచివాలయాల కార్యదర్శులు రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. మరో 2,58,516 మంది నుంచి ఓటీఎస్‌ వసూళ్ల కోసం జిల్లా గృహనిర్మాణ సంస్థ అధికారులు, ఎంపీడీవోలు, తహసీల్దార్లు, గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది, వాలంటీర్లకు రోజు వారీ, వారం చొప్పున లక్ష్యాన్ని నిర్ణయించి పంపుతున్నారు. ఓటీఎస్‌ స్వచ్ఛందమేనని ప్రభుత్వం ప్రకటించినా ఆచరణలో మాత్రం అధికారులు, ఉద్యోగులను లబ్ధిదారుల వద్దకు పంపించి నగదు చెల్లించేలా ఒత్తిళ్లు చేస్తున్నారు. 
25 నుంచి ఆందోళనల నేపథ్యంలో.. 
రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 11వ పీఆర్‌సీలో తమకు అన్యాయం జరిగిందని, వేతనాలు తగ్గనున్నాయని ఉద్యోగ సంఘాలు ఆందోళనకు పిలుపు ఇచ్చాయి. ఈనెల 25 నుంచి సెలవులు పెట్టి నిరసన కార్యక్రమాల్లో ఉద్యోగులు పాల్గొననున్నారు. దీంతో ఓటీఎస్‌కు రాంరాం అనే పరిస్థితి నెలకొంది. ఫిబ్రవరి 7 నుంచి నిరవధిక సమ్మెలోకి వెళతామని ప్రకటించిన దృష్ట్యా ఓటీఎస్‌ కూడా తాత్కాలికంగా నిలిచిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల సంఘాలు సమ్మెకు మద్దతు ప్రకటించాయి. జిల్లా గృహనిర్మాణ సంస్థకు ఇంజినీరింగ్‌ అసిస్టెంట్లు 408 మందిని డిప్యుటేషన్‌పై నియమించారు. వీరు జిల్లాలో వైఎస్‌ఆర్‌ జగనన్న కాలనీల్లో నిరుపేదలకు మంజూరు చేసిన గృహాలను లబ్ధిదారులతో నిర్మాణాలు చేయించడంలో సహకారం అందజేస్తున్నారు. ఇప్పుడు వీరు కూడా ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొంటే నిర్మాణాల పనులు కూడా తాత్కాలికంగా ఆగిపోనున్నాయి. జిల్లా గృహనిర్మాణ సంస్థ అధికారులు ఉద్యోగులను బలవంతంగా విధుల్లోకి హాజరుకావాలని చెప్పే పరిస్థితి లేదు. మంగళవారం వ్యక్తిగతంగా సెలవులు పెట్టి ఆందోళనలో పాల్గొనేందుకు ఉద్యోగులు సిద్ధమయ్యారు. ప్రభుత్వం, ఉద్యోగ సంఘాల మధ్య చర్చలు జరిగి ఈ సమస్యకు పరిష్కారం లభించే వరకు ఓటీఎస్, గృహాల నిర్మాణాలు నిలిచిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని