logo

పదం పడుతూ..కదం తొక్కుతూ..

ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీ తమకొద్దంటూ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, ఒప్పంద ఉద్యోగులు సెలవు పెట్టి మరీ వచ్చి రోడ్డెక్కి ప్రదర్శనగా కలెక్టరేట్‌కు వచ్చారు. కలెక్టరేట్‌ ఎదుట గంటల పాటు బైఠాయించి తమ సమస్యలపై నినదించారు. పీఆర్సీతో తమకు మంచి చేకూరుతుందని

Published : 26 Jan 2022 02:05 IST

 పీఆర్సీకి వ్యతిరేకంగా గుంటూరులో భారీ ర్యాలీ

నడిరోడ్డుపై బైఠాయించి నినదించిన ఉద్యోగులు

పీఆర్సీకి వ్యతిరేకంగా నినదిస్తూ కలెక్టరేట్‌కు ప్రదర్శనగా వెళ్తున్న ఉద్యోగులు

 

కలెక్టరేట్‌ (గుంటూరు), న్యూస్‌టుడే ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీ తమకొద్దంటూ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, ఒప్పంద ఉద్యోగులు సెలవు పెట్టి మరీ వచ్చి రోడ్డెక్కి ప్రదర్శనగా కలెక్టరేట్‌కు వచ్చారు. కలెక్టరేట్‌ ఎదుట గంటల పాటు బైఠాయించి తమ సమస్యలపై నినదించారు. పీఆర్సీతో తమకు మంచి చేకూరుతుందని భావించామని, ఇప్పుడు వెనక్కి కట్టే పరిస్థితి ఉందని, ఇటువంటి పీఆర్సీ ఉత్తర్వులను వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. గుంటూరు నగరంలో మంగళవారం పీఆర్సీ సాధన సమితి ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన ర్యాలీ, ధర్నాలో పెద్దఎత్తున ఉద్యోగులు తరలివచ్చారు.

ర్యాలీ సాగిందిలా...: పీఆర్సీ సాధన సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీ గుంటూరు వెంకటేశ్వర విజ్ఞాన మందిరం నుంచి 10.30 గంటలకు ప్రారంభమైంది. ఉపాధ్యాయులు వారి సంఘాల వారీగా వచ్చి ర్యాలీలో పాల్గొన్నారు. పంచాయతీ కార్యదర్శుల సంఘం, రెవెన్యూ సర్వీసెస్‌ అసోసియేషన్‌, వీఆర్‌వోల సంఘం తదితర సంఘాలన్నీ కూడా వారి వారి బ్యానర్లతో ర్యాలీలో కలిసి నినాదాలు చేసుకుంటూ కలెక్టర్‌ కార్యాలయం ఎదురుగా జరిగే ధర్నా ప్రాంగణానికి చేరుకున్నారు. రోడ్డుపైనే బైఠాయించి ఉద్యోగులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలను చేస్తూ, పలు పాటలను పాడారు. మరికొందరు ఉద్యోగులు వారి పిల్లలతో సహా ధర్నాలో పాల్గొని సమితి జెండాలతో నినాదాలు చేశారు. ర్యాలీలో పాల్గొన్న ఏపీ ఎన్జీవోల సంఘం జిల్లా అధ్యక్షుడు ఘంటసాల శ్రీనివాసరావు అస్వస్థతకు గురయ్యారు. కొత్త పీఆర్సీ రద్దు చేయాలంటూ చేపట్టిన ర్యాలీ, ధర్నా కార్యక్రమానికి వేలాదిగా ఉద్యోగ సంఘాల నాయకులు తరలివచ్చారని సంఘాల నాయకులు తెలిపారు.

ద్విచక్ర వాహనాలపై నగర వీధుల్లో ర్యాలీ

ప్రస్తుత జీవోలన్నీ రద్దుచేయాలి

రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల కోసం సంక్షేమ పథకాలు అమలు చేయాలి. అదే సందర్భంలో ఉద్యోగుల సంక్షేమం గాలికొదిలేస్తామంటే కుదరదు.. పీఆర్‌సీ ఇతర డిమాండ్‌లపై రాజకీయ నిర్ణయం ఉద్యోగులకు అనుకూలంగా తీసుకోవాలి. పీఆర్‌సీపై ప్రస్తుత జీవోలన్నీ రద్దు చేయాలి. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు గత అక్టోబరు 2న ప్రొబేషన్‌ డిక్లేర్‌ చేయాల్సి ఉన్నా చేయలేదు. ముఖ్యమంత్రి ఎందుకు ఇంత మొండి వైఖరితో ఉన్నారో అర్థం కావడంలేదు. - కె.ఎస్‌.లక్ష్మణరావు, ఎమ్మెల్సీ

కలెక్టరేట్‌ ఎదుట రహదారిపై బైఠాయింపు

కోతల పీఆర్సీ

రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది కోతల పీఆర్సీ. దీనిపై ఉద్యోగులు ఎంత కసితో రగిలిపోతున్నారో ర్యాలీని చూస్తేనే అర్థమవుతోంది. కొత్త పీఆర్సీతో ప్రభుత్వానికి రూ.10,460 కోట్లు నష్టమని చెబుతున్నందున.. తమకు పాత జీతాలను ఇస్తూ.. డీఏలు విడుదల చేయాలని కోరుతున్నాం. ఎవరైనా పీఆర్సీ ఇచ్చారంటే ఆశగా జీతాలు పెరిగాయనుకుంటాం. కానీ ఈసారి తగ్గించే పీఆర్సీని చూస్తున్నాం. - చాంద్‌బాషా, ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు

మాబోటి వారికి అన్యాయం

రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న పీఆర్సీ ఫిట్‌మెంట్‌ ఇతర నిర్ణయాలతో ఉద్యోగులకే కాకుండా విశ్రాంత ఉద్యోగులకు తీవ్ర అన్యాయం జరిగింది. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఉద్యోగ, ఉపాధ్యాయుల జీతాలు పెరిగేలా పీఆర్సీ ఉండాలి కానీ భారం మోపేలా ఉండకూడదు. ఉద్యోగులు, పెన్షనర్ల న్యాయమైన సమస్యలు పరిష్కారమయ్యే వరకు ఆందోళనలు కొనసాగుతాయి. - వెంకటేశ్వరరావు, పింఛనుదారుల సంఘం నాయకులు

కలెక్టరేట్‌లోకి వెళ్తున్న ఉప సభాపతి కోన రఘుపతి వాహనానికి దారి ఇస్తూ..

నిరసన తెలిపే హక్కును కోల్పోయాం

సంస్థ నుంచి ప్రభుత్వంలోకి చేరిన తర్వాత ఆర్టీసీ ఉద్యోగులుగా తాము నిరసనలు తెలిపే హక్కును కోల్పోయాం. గతంలో సంస్థ ఆధ్వర్యంలో ఉండగా, సొంతంగా ఉన్న పథకాలను సైతం కోల్పోవాల్సి వచ్చింది. ప్రభుత్వం ఇచ్చే హెల్త్‌ కార్డుతో సరైన వైద్యం పొందలేని పరిస్థితి వచ్చింది. పీఆర్సీలో ఆర్టీసీ ఉద్యోగుల ప్రస్తావనే లేకపోవడం బాధాకరం. - రవిశంకర్‌, ఆర్టీసీ ఉద్యోగ సంఘం నాయకులు

భారీ ఎత్తున హాజరైన ఉద్యోగినులు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని