logo

నీ శౌర్యo..అమరం

 దేశ సరిహద్దులో వీరోచితంగా పోరాడుతూ ఉగ్రమూకల తూటాలకు బలైన తెలుగు తేజం జస్వంత్‌రెడ్డికి అత్యున్నత శౌర్యచక్ర పురస్కారం దక్కింది. తీవ్రవాదుల ఏరివేత కార్యక్రమంలో ముందుండి నడిపించిన జస్వంత్‌ 23 ఏళ్లకే వీరమరణం పొందడంతో, యువ జవాను త్యాగానికి గుర్తుగా కేంద్రం

Published : 26 Jan 2022 02:05 IST

వీర జవాను జస్వంత్‌రెడ్డికి శౌర్యచక్ర పురస్కారం

బాపట్ల, న్యూస్‌టుడే దేశ సరిహద్దులో వీరోచితంగా పోరాడుతూ ఉగ్రమూకల తూటాలకు బలైన తెలుగు తేజం జస్వంత్‌రెడ్డికి అత్యున్నత శౌర్యచక్ర పురస్కారం దక్కింది. తీవ్రవాదుల ఏరివేత కార్యక్రమంలో ముందుండి నడిపించిన జస్వంత్‌ 23 ఏళ్లకే వీరమరణం పొందడంతో, యువ జవాను త్యాగానికి గుర్తుగా కేంద్రం ఈ పురస్కారాన్ని ప్రకటించి గౌరవించింది. బాపట్ల మండలం దరివాదకొత్తపాలేనికి చెందిన రైతు కూలీ దంపతులు మరుప్రోలు శ్రీనివాసరెడ్డి, వెంకటేశ్వరమ్మల పెద్ద కుమారుడు జశ్వంత్‌రెడ్డి పట్టణంలోని వివేకపాస్టర్‌ పాఠశాలలో పది వరకు, జెనిసిస్‌ కళాశాలలో ఇంటర్‌ చదివాడు. పాఠశాల దశ నుంచే దేశభక్తి ఎక్కువ. 2015 డిసెంబరులో తొలి ప్రయత్నంలోనే అన్ని పరీక్షల్లో విజయం సాధించి 18 ఏళ్లకే సైన్యానికి ఎంపికయ్యాడు. శిక్షణలో ప్రతిభ చూపి మద్రాసు రెజిమెంట్‌లోని ఇన్‌ఫాంట్రీ విభాగం ఘాతక్‌ దళ సభ్యుడిగా చేరాడు. తమ్ముళ్లు యశ్వంత్‌, విశ్వంత్‌ను చదివించాడు. అన్న స్ఫూర్తితో విశ్వంత్‌ సైన్యంలో చేరడానికి సిద్ధమయ్యాడు.

దళాన్ని ముందుండి నడిపించి..: జశ్వంత్‌రెడ్డి కశ్మీర్‌ మంచుకొండల్లో కఠిన పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కొన్నాడు. గత ఏడాది జులై 8న రాజౌరి జిల్లాలోని సుందర్‌బనీ సెక్టార్‌లో దాగి ఉన్న తీవ్రవాదులను మట్టుబెట్టడానికి సైన్యం చేపట్టిన ఆపరేషన్‌లో పాల్గొన్నాడు. ఉగ్రవాదులపై తూటాల వర్షం కురిపిస్తూ ఇద్దరిని అంతమొందించాడు. సైనిక దళాన్ని తీసుకుని ముందుకు వెళ్లే ప్రయత్నంలో ఉగ్రవాదుల తూటాలకు నేలకొరిగాడు. జులై పదిన సొంతూరిలో వీర జవాను అంతిమ యాత్రలో వేల మంది పాల్గొని ఘన నివాళి అర్పించారు. అమర సైనికుడి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.50 లక్షల సాయం అందజేసింది. గణతంత్ర వేడుకల సందర్భంగా జశ్వంత్‌రెడ్డికి శౌర్యచక్రను కేంద్రం ప్రకటించడంతో, దేశం కోసం తమ కుమారుడి చేసిన త్యాగాన్ని చూసి గర్విస్తున్నట్లు తల్లిదండ్రులు వెంకటేశ్వరమ్మ, శ్రీనివాసరెడ్డి అన్నారు. జస్వంత్‌కు లభించిన విశిష్ట పురస్కారంతో బాపట్ల గడ్డ పులకించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు