logo

ఓటింగ్‌ శాతం పెరిగితేనే మంచి పాలకులొస్తారు

ప్రజాస్వామ్య దేశంలో మంచి పాలకులను ఎన్నుకోవాలంటే ప్రలోబాలకు లొంగకుండా ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లాపరిషత్తు చైర్‌పర్సన్‌ హెనీ క్రిస్టీనా అన్నారు. 12వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్‌లోని ఎస్‌.ఆర్‌.శంకరన్‌ హాలులో సభ జరిగింది.

Published : 26 Jan 2022 02:05 IST


ప్రతిజ్ఞ చేస్తున్న జడ్పీ ఛైర్‌పర్సన్‌ క్రిస్టీనా, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, జేసీ దినేష్‌కుమార్‌,

ఎస్పీ ఆరీఫ్‌ హాఫీజ్‌, అసిస్టెంట్‌ కలెక్టర్‌ శుభం బన్సాల్‌, ఆర్డీవో భాస్కర్‌రెడ్డి, డీఆర్‌వో కొండయ్య,

కలెక్టరేట్‌(గుంటూరు), న్యూస్‌టుడే: ప్రజాస్వామ్య దేశంలో మంచి పాలకులను ఎన్నుకోవాలంటే ప్రలోబాలకు లొంగకుండా ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లాపరిషత్తు చైర్‌పర్సన్‌ హెనీ క్రిస్టీనా అన్నారు. 12వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్‌లోని ఎస్‌.ఆర్‌.శంకరన్‌ హాలులో సభ జరిగింది. ఈ సందర్భంగా హెనీ క్రిస్టీనా మాట్లాడుతూ ఓటు హక్కు ప్రాధాన్యంపై ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. యువ ఓటర్లకు ఓటు హక్కు విలువను తెలియజెప్పాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులపై ఉందన్నారు. జేసీ ఏఎస్‌ దినేష్‌కుమార్‌ మాట్లాడుతూ భవిష్యత్తు తరాలకు మంచి పరిపాలనను అందించాలంటే ఓటర్లు అందరూ నిష్పక్షపాతంగా ఓటు హక్కు వినియోగించుకుని మంచి నాయకులను ఎన్నుకోవాలన్నారు. ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ మంచి వ్యక్తులు పాలకులుగా ఉండాలంటే ఎన్నికల్లో ఓటింగ్‌ శాతం పెరగాలన్నారు. ఎన్నికల్లో ఓటుకు విలువ కట్టే సంప్రదాయాన్ని అరికట్టాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. అనంతరం కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌ సుశీల్‌ చంద్ర 12వ జాతీయ ఓటర్ల దినోత్సవ వీడియో సందేశాన్ని సభలో ప్రదర్శించారు. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన వ్యాసరచన, వక్తృత్వం, చిత్రలేఖనం పోటీల్లో విజేతలకు బహుమతులు అందించారు. ఉత్తమ బూత్‌ లెవల్‌ అధికారులకు ప్రశంసాపత్రాలు అందించారు. కార్యక్రమంలో అర్బన్‌ ఎస్పీ ఆరిఫ్‌ హాఫీజ్‌, అసిస్టెంట్‌ కలెక్టర్‌ శుభం బన్సాల్‌, మద్య విమోచన ప్రచార కమిటీ ఛైర్మన్‌ వి.లక్ష్మణరెడ్డి, విభిన్న ప్రతిబావంతుల కార్పొరేషన్‌ ఛైర్మన్‌ ముంతాజ్‌పఠాన్‌, నగరపాలక సంస్థ అదనపు కమిషనర్‌ నిరంజన్‌రెడ్డి, డీఆర్‌వో పి.కొండయ్య, ఆర్డీవో భాస్కర్‌రెడ్డి, కలెక్టరేట్‌ ఏవో తాతా మోహనరావు, డిప్యూటీ మేయర్‌ సజీలా, సీనియర్‌ సిటిజన్‌ ఓటర్లు, యువ ఓటర్లు విద్యార్థులు పాల్గొన్నారు.

వందేళ్ల వయసులో మళ్లీ ఓటు

అన్నపూర్ణమ్మను సత్కరిస్తున్న తహసీల్దార్‌ జీవీ రామ్‌ప్రసాద్‌ తదితరులు

మంగళగిరి, న్యూస్‌టుడే: ఓటు హక్కు ఎంతో విలువైందని నూరు వసంతాలు పూర్తిచేసుకున్న చావలి అన్నపూర్ణమ్మ చాటి చెప్పారు. నగరం పరిధిలోని కాజలో నివాసం ఉంటున్న అన్నపూర్ణమ్మకు మొన్ననే వందేళ్లు నిండాయి. తన పేరు ఓటరు జాబితాలో గల్లంతైనట్లు తెలుసుకొని తహసీల్దారు జీవీ రామ్‌ప్రసాద్‌ దృష్టికి తెచ్చారు. స్పందించిన ఆయన మంగళవారం జాతీయ ఓటరు దినోత్సవం రోజున సహాయ ఎన్నికల అధికారి ద్వారా అన్నపూర్ణమ్మ పేరును ఓటరు జాబితాలో చేర్పించి ఓటు హక్కు కల్పించారు. అనంతరం ఆమెను తహసీల్దార్‌ ఘనంగా సన్మానించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని