logo

జాగ్రత్త లే రక్ష

కొవిడ్‌ రెండో దశలోని చేదు జ్ఞాపకాలను మరవకముందే మూడో దశలో మహమ్మారి మరోసారి తరుముకొస్తోంది. ఇప్పటికే కేసుల సంఖ్య పెరగడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రస్తుతం రెట్టింపు సంఖ్యలో కేసులు నమోదవుతుండటంతో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు

Published : 26 Jan 2022 06:24 IST

తీరప్రాంతంలో పెరుగుతున్న కరోనా కేసులు

తెనాలి డివిజన్‌లో వారం రోజుల్లో నమోదైన కొవిడ్‌ కేసులు 500


జ్వరాల సర్వేలో వివరాలు నమోదు చేస్తున్న ఆరోగ్య సిబ్బంది

కొవిడ్‌ రెండో దశలోని చేదు జ్ఞాపకాలను మరవకముందే మూడో దశలో మహమ్మారి మరోసారి తరుముకొస్తోంది. ఇప్పటికే కేసుల సంఖ్య పెరగడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రస్తుతం రెట్టింపు సంఖ్యలో కేసులు నమోదవుతుండటంతో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. నిర్లక్ష్యం చేస్తే తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరిస్తున్నారు. పరిమితికి మించి ఆటోలు, ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించొద్దని సూచిస్తున్నారు. సంబంధిత శాఖల అధికారులు స్పందించి నిబంధనలు పాటించని డ్రైవర్లపై చర్యలు తీసుకోవాలంటున్నారు.

రేపల్లె అర్బన్‌, న్యూస్‌టుడే గ్రామాలు, పట్టణాల్లో దగ్గు, జలుబు, జ్వరం, ఒళ్లు నొప్పులతో బాధపడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. సంక్రాంతి పండగ నేపథ్యంలో నిర్వహించిన కోడి పందేలు చూసేందుకు జనాలు పెద్దసంఖ్యలో గుమికూడారు. ఈ తరుణంలోనే కరోనా కేసులు విపరీతంగా పెరగడం కలవర పెడుతోంది. రేపల్లె, బాపట్ల నియోజకవర్గాల్లో ఈ నెల రెండో వారం వరకు రెండు శాతం ఉన్న పాజిటివిటీ రేటు 25 నాటికి 10కి చేరువైంది. ఒకవైపు వాతావరణ మార్పులతో విష జ్వరాలు, మరోవైపు కరోనా లక్షణాలతో ఆందోళన చెందుతున్నారు. దగ్గు, జలుబు ఇతర అనారోగ్య సమస్యలు దేనివల్ల వస్తున్నాయో తెలియడం లేదంటున్నారు. దాదాపు ప్రతి ఇంట్లో ఈ లక్షణాలతో బాధపడుతున్న వారున్నారని వైద్యాధికారులు పేర్కొంటున్నారు. అత్యధికులు ఔషధ దుకాణాలపై ఆధారపడి మందులు వినియోగిస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చిన వెళ్లిన మూడ్రోజులకు సరిపడా మందులిచ్చి జ్వరం తగ్గకుంటే మళ్లీ సంప్రదించాలని చెబుతున్నారు.

ఇంటి ఐసోలేషన్‌కే ప్రాధాన్యం..: తీరప్రాంతంలో సంక్రాంతి కోడి పందేల్లో పాల్గొన్న వారిలో కొందరు అస్వస్థతకు గురికావడంతో ప్రైవేటు ఆసుపత్రుల్లో కొవిడ్‌ పరీక్షలు చేయించుకున్నారు. వ్యాధి నిర్ధారణ అయ్యాక ఇంటి ఐసోలేషన్‌లో ఉంటూ గుట్టుగా మందులు వాడుతున్నారు. వారితోపాటు ఇతర దేశాలు, రాష్ట్రాల నుంచి వచ్చిన వారు సైతం స్వీయ నిర్బంధంలో గడిపారు. జ్వరం, దగ్గు, జలుబుతో బాధ పడుతున్న వారు కొవిడ్‌ పరీక్షలు చేయించుకుండా ఔషధాలు వినియోగిస్తున్నారు. దీన్ని అవకాశంగా తీసుకుని కొందరు ఔషధ దుకాణాల నిర్వాహకులు, ప్రైవేటు వైద్యులు అందిన కాడికి దోచుకొంటున్నారు.

ప్రారంభమైన జ్వరాల సర్వే

ఈ నెల 24 నుంచి ఆరోగ్య సిబ్బంది గ్రామాల్లో జ్వరాల సర్వే నిర్వహిస్తున్నారు. జ్వరం, దగ్గు, జలుబు లక్షణాలుంటే వాటికి సంబంధించిన మందులు అందజేస్తున్నారు. బాధితులను గుర్తించి వివరాలు నమోదు చేస్తున్నారు. లక్షణాలు తీవ్రంగా ఉంటే నిర్దేశించిన సమయంలో కరోనా పరీక్షలు చేయిస్తున్నారు. ఇంట్లో ఉన్నా తప్పనిసరిగా మాస్క్‌ ధరించి భౌతిక దూరం పాటించాలని, అప్పుడే వైరస్‌ ఇతరులకు వ్యాపించదని సూచిస్తున్నారు.

ఆందోళన చెందొద్దు

కొవిడ్‌ ఉద్ధృతి పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి. మాస్క్‌ ధరించి, భౌతిక దూరం పాటించాలి. అనవసరంగా బయట తిరగడం మానుకోవాలి. నియోజకవర్గానికో కొవిడ్‌ సంరక్షణ కేంద్రం ఏర్పాటు చేసే పనిలో రెవెన్యూ అధికారులు నిమగ్నమయ్యారు. ఇప్పటి వరకు ఎక్కువమంది హోం ఐసోలేషన్‌లో ఉండేందుకు ఆసక్తి చూపుతున్నారు. వాతావరణంలో చోటుచేసుకున్న మార్పులతో జ్వరం, దగ్గు, బలుబు లక్షణాలు కనిపిస్తున్నాయి. సర్వే చేస్తున్న సిబ్బంది బాధితులకు నివారణ మందులు అందజేస్తున్నారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. - రవిబాబు అదనపు జిల్లా వైద్యాధికారి, గుంటూరు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని