logo

శిక్షణ ఇస్తూ..భవితకు భరోసా పెంచుతూ..

సాంకేతిక రంగంలో అవకాశాలు ఇబ్బడిముబ్బడిగా వస్తున్నాయి. కొవిడ్‌ అన్ని రంగాలను దెబ్బతీసినా సాఫ్ట్‌వేర్‌ రంగం మాత్రం యువతకు ఉద్యోగాలు కల్పించడంతో పాటు తమకు కావాల్సిన విధంగా విద్యార్థులను తీర్చిదిద్దేందుకు ఆయా సంస్థలు కృషి చేస్తున్నాయి.

Published : 27 Jan 2022 02:27 IST

మైక్రోసాప్ట్‌లో యువతకు ఇంటర్న్‌షిప్‌లు 


ప్రయోగశాలలో ప్రాజెక్టు చేస్తున్న యశ్వంత్‌రెడ్డి

న్యూస్‌టుడే, నరసరావుపేట అర్బన్, యడ్లపాడు సాంకేతిక రంగంలో అవకాశాలు ఇబ్బడిముబ్బడిగా వస్తున్నాయి. కొవిడ్‌ అన్ని రంగాలను దెబ్బతీసినా సాఫ్ట్‌వేర్‌ రంగం మాత్రం యువతకు ఉద్యోగాలు కల్పించడంతో పాటు తమకు కావాల్సిన విధంగా విద్యార్థులను తీర్చిదిద్దేందుకు ఆయా సంస్థలు కృషి చేస్తున్నాయి. అదే కోవలో మైక్రోసాప్ట్‌ సాంకేతిక రంగ విద్యార్థులకు మైక్రోసాప్ట్‌ వర్చువల్‌ ఇంటర్న్‌షిప్‌ ప్రోగాం-ఫ్యూచర్‌ రెడీ ట్యాలెంట్‌ కార్యక్రమాన్ని తీసుకుంది. ఇందులో రిజిస్టర్‌ చేసుకున్న విద్యార్థులకు శిక్షణతో పాటు ప్రాజెక్టులు చేసేందుకు అవకాశాలు కల్పిస్తోంది. ఈ ఏడాది లక్ష మంది విద్యార్థులు పేర్లు నమోదు చేసుకుంటే వారిలో వెయ్యి మంది విజయవంతంగా ప్రాజెక్టులను పూర్తి చేశారు. వారికి భవిష్యత్తులో మైక్రోసాప్ట్‌ లేదా అనుబంధ సంస్థల్లో ఉద్యోగాల్లో ప్రాధాన్యం ఉండనుంది. 

ఆరునెలలు ఆన్‌లైన్‌ శిక్షణ 
మైక్రోసాఫ్ట్‌ చేపట్టిన కార్యక్రమంలో రిజిస్టర్‌ అయిన విద్యార్థులకు ఆరు నెలల పాటు ఆన్‌లైన్‌ ద్వారా శిక్షణ ఇస్తారు. యజుర్‌ డాట్‌నెట్‌కు అవసరమైన నైపుణ్యాలను యువతకు అందించడమే లక్ష్యంగా కోర్సులు ఉంటాయి. క్లౌడ్‌ కంప్యూటింగ్‌కు సంబంధించి బ్యాకింగ్, ఆటోమొబైల్, విద్య హెల్త్‌కేర్‌ తదితర రంగాల్లో నాణ్యమైన సేవలందించేందుకు నిపుణులను తయారు చేసేలా శిక్షణ తరగతులు ఉంటాయి, వీటితో పాటు మరో ఎనిమిది సెల్ఫ్‌లెర్నింగ్‌ మాడ్యూల్స్‌ అందుబాటులో ఉంటాయి. వీటిని పూర్తి చేసిన విద్యార్థులకు మైక్రోసాఫ్ట్‌ ప్రణాళికలకు అనుగుణంగా ప్రాజెక్టులు చేసేందుకు అవకాశం ఇస్తారు. నిర్ణీత గడువు, బడ్జెట్‌ లోపు పూర్తి చేయాల్సి ఉంటుంది. దేశవ్యాప్తంగా లక్ష మంది విద్యార్థులు రిజిస్టర్‌ అయితే వారిలో కేవలం వెయ్యిమంది మాత్రమే పూర్తి చేశారు. ఇందులో నరసరావుపేట ఇంజినీరింగ్‌ కళాశాలకు చెందిన కిక్కురు పృథ్వీ యశ్వంత్‌రెడ్డి విజయం సాధించాడు, మైక్రోసాప్ట్‌ సంస్థ అతనికి ధ్రువపత్రం జారీ చేసింది.


విద్యార్థిని అభినందిస్తున్న కళాశాల ప్రతినిధులు 

రైతుకు ఉపయుక్తంగా ప్రాజెక్టు 
ఫిరంగిపురానికి చెందిన యశ్వంత్‌ రెడ్డి ఎన్‌ఈసీలో మెకానికల్‌ విభాగంలో తృతీయ సంవత్సరం చదువుతున్నాడు. తండ్రి బాలశౌరిరెడ్డి ధాన్యం వ్యాపారి, మైక్రోసాఫ్ట్‌ వర్చువల్‌ ఇంటర్న్‌షిప్‌ ప్రోగ్రాంలో పేర్లు నమోదు చేసుకుని ఆన్‌లైన్‌ తరగతులకు హాజరయ్యాడు. తర్వాత సంస్థ 100 డాలర్ల విలువైన ప్రాజెక్టును విద్యార్థికి ఇచ్చింది. సంస్థ ఇచ్చిన కిట్‌ ఆధారంగా వ్యవసాయం, విద్య, జీవనశైలి, హెల్త్‌కేర్‌ రంగాల్లో నచ్చిన అంశంపై ప్రాజెక్టు చేయాలని సూచించింది. విద్యార్థి వ్యవసాయరంగాన్ని ఎంచుకుని మైక్రోసాఫ్ట్‌ యజుర్‌లోని కృత్రిమ మేధస్సు, మిషన్‌లెర్నింగ్‌ తదితర సాఫ్ట్‌వేర్‌లను ఉపయోగించి ప్రాజెక్టు 80 డాలర్ల బడ్జెట్‌తో పూర్తి చేశాడు. విత్తనం మెలకెత్తిన నాటి నుంచి పంట రైతు చేతికి వచ్చే వరకూ అన్ని సమస్యలను ముందుగానే గుర్తించి పరిష్కారం సూచించేందుకు దోహదపడేలా ప్రాజెక్టు చేశాడు. దీంతో సంస్థ గుర్తించిన నిపుణుల్లో ఒకరుగా మారారు. భవిష్యత్తు డేవాబ్స్‌ ఇంజినీర్‌గా ఎదగాలన్న లక్ష్యాన్ని విధించుకున్నట్లు యశ్వంత్‌రెడ్డి తెలిపాడు.   

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని