logo

ఆనంద క్షణాన.. అంతులేని విషాదం

కుమారున్ని ఉన్నత చదువులు చదివించేందుకు విమానం ఎక్కించి పంపుతున్నామన్న ఆనందం.. కొద్ది గంటలు కూడా నిలవలేదు. కష్టపడి.. కుమారులను ప్రయోజకులను చేశాననుకున్న ఆ తండ్రి ఆనందంలో ఉండగానే.. విధి వక్రీకరించి.. అతనితో పాటు పెద్ద కుమారున్ని

Updated : 28 Jan 2022 09:20 IST

ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం.. పేట వాసుల మృతి 
 భర్త, పెద్ద కుమారుని మృతితో భార్య దిగ్భ్రాంతి 


సోదా వెంకట్రావు (పాతచిత్రం) ప్రసన్నకుమార్‌ (పాతచిత్రం) 

చిలకలూరిపేట గ్రామీణ, న్యూస్‌టుడే : కుమారున్ని ఉన్నత చదువులు చదివించేందుకు విమానం ఎక్కించి పంపుతున్నామన్న ఆనందం.. కొద్ది గంటలు కూడా నిలవలేదు. కష్టపడి.. కుమారులను ప్రయోజకులను చేశాననుకున్న ఆ తండ్రి ఆనందంలో ఉండగానే.. విధి వక్రీకరించి.. అతనితో పాటు పెద్ద కుమారున్ని ఈ లోకానికి దూరం చేసింది. చిలకలూరిపేట పట్టణం పండరీపురం నీళ్ల ట్యాంకుల సమీపంలో నివాసం ఉంటున్న కుటుంబం ఈ విషాదం బారిన పడింది. కుటుంబ సభ్యులు, బంధువుల వివరాల మేరకు.. ప్రకాశం జిల్లా సంతనూతలపాడు మండలం రుద్రగ్రామం నుంచి చాలా ఏళ్ల క్రితం మూడు కుటుంబాలు చిలకలూరిపేట పట్టణానికి వచ్చాయి. వారిలో మూడోవాడైన సోదా వెంకట్రావు పండరీపురం నీళ్ల ట్యాంకుల ఎదురుగా ఇల్లు కట్టుకుని అక్కడే ఉంటూ ఇంటి ముందు చిల్లర దుకాణం పెట్టుకున్నాడు. వెంకట్రావుకు భార్య కళావతి, కుమారుడు ప్రసన్నకుమార్, భాస్కర్‌ ఉన్నారు. ఇద్దరు పిల్లలను కష్టపడి చదివించాడు. పెద్ద కుమారుడు ప్రసన్నకుమార్‌ బి.టెక్‌ పూర్తిచేసి సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా బెంగళూరులో పనిచేస్తున్నాడు. ప్రస్తుతం ఇంటి నుంచి విధులు నిర్వహిస్తున్నాడు. 
చిన్న కుమారున్ని ఉన్నత చదువులకు పంపాలని.. 
రెండు దశాబ్దాలుగా చిల్లర దుకాణం నిర్వహిస్తున్న వెంకట్రావు జీవితంలో కాస్తంత స్థిరపడటంతో పాటు పెద్ద కుమారునికి ఉద్యోగం కూడా రావడంతో చిన్న కుమారుడు భాస్కర్‌ను ఉన్నత చదువులు చదివించాలని నిర్ణయించుకున్నాడు. దానికి సంబంధించి అమెరికాలోని న్యూయార్క్‌కు పంపేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. హైదరాబాద్‌లో ఉన్న భాస్కర్‌ నేరుగా చెన్నై చేరుకున్నాడు. చిలకలూరిపేట నుంచి వెంకట్రావు, భార్య కళావతి, పెద్దకుమారుడు ప్రసన్నకుమార్‌ ప్రైవేటు ట్రావెల్స్‌ కారు మాట్లాడుకుని బుధవారం ఉదయం 11 గంటలకు బయలుదేరి చెన్నై వెళ్లారు. రాత్రికి కుమారున్ని ఆనందంగా విమానం ఎక్కించి వీడ్కోలు పలికారు. అనంతరం కారులో తిరిగి చిలకలూరిపేటకు బయలుదేరారు. గురువారం తెల్లవారుజామున చెన్నై- కోల్‌కతా జాతీయ రహదారిలో ప్రకాశం జిల్లా జె.పంగులూరు మండలం రేణంగివరం సమీపంలోని వంతెనపై కట్టెల ట్రాక్టర్‌ను వీరి వాహనం ఢీకొనడంతో వెంకట్రావు (55), ప్రసన్నకుమార్‌ (26) అక్కడికక్కడే దుర్మరణం చెందారు. కళ్లముందే భర్త, పెద్ద కుమారుడు మృతితో కళావతి అపస్మారకస్థితిలోకి వెళ్లింది. డ్రైవర్‌ ప్రాణాలతో బయటపడ్డాడు. డ్రైవర్‌ నిద్రమత్తే ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు. 
వెనుదిరిగిన కుమారుడు...
భాస్కర్‌ ఎక్కిన విమానం అబుదబి చేరగానే ప్రమాద వివరాలు తెలియడంతో దుఃఖసాగరంలో మునిగిపోయాడు. ప్రయాణం నుంచి వెనుదిరిగాడు. ఉన్నత విద్య పూర్తిచేసి మంచి ఉద్యోగం సాధించి తండ్రి ముందు గర్వంగా నిలబడాలని భావించిన భాస్కర్‌కు అక్కడకు వెళ్లకుండానే తండ్రి, అన్నకు తలకొరివి పెట్టాల్సి రావడంతో కుటుంబ సభ్యులు, బంధువులు కంటతడి పెడుతున్నారు.


చిలకలూరిపేటలోని ఇంటి వద్ద విషాదంలో కుటుంబ సభ్యులు... 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు