logo

వాలంటీరు హత్య కేసులో నిందితుడి ఆత్మహత్య

వేమూరు మండలం చావలిలో మహిళా వాలంటీరు శారదను దారుణంగా హత్య చేసిన కేసులో నిందితుడైన పద్మారావు(37) గురువారం నిడుబ్రోలు రైల్వేస్టేషన్‌ శివారులో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల కథనం ప్రకారం.. భర్త, ముగ్గురు

Published : 20 May 2022 04:15 IST

పొన్నూరు, వేమూరు, న్యూస్‌టుడే

వేమూరు మండలం చావలిలో మహిళా వాలంటీరు శారదను దారుణంగా హత్య చేసిన కేసులో నిందితుడైన పద్మారావు(37) గురువారం నిడుబ్రోలు రైల్వేస్టేషన్‌ శివారులో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల కథనం ప్రకారం.. భర్త, ముగ్గురు పిల్లలున్న శారదతో పద్మారావు వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఆమెపై అనుమానంతో ఈ నెల 15న కత్తితో  పొడిచి చంపాడు. పరారీలో ఉన్న అతడి కోసం వేమూరు పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. దీంతో భయపడ్డ అతడు రైలు కిందపడి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు.


స్నేహితునికి చివరి ఫోన్‌కాల్‌..
పద్మారావు చివరి సారిగా వేమూరులోని తన స్నేహితునికి ఫోన్‌ చేశాడు. అయితే, అతని సెల్‌ఫోన్‌ నుంచి కాకుండా స్థానిక రైల్వేస్టేషన్‌ వాహన పార్కింగ్‌ నిర్వాహకుని ఫోన్‌ తీసుకుని మాట్లాడాడు. తన వద్ద ఉన్న ద్విచక్రవాహనం పాస్టర్‌దని.. ఆ వాహనాన్ని అతడికి అప్పగించాలని స్నేహితునికి సూచించినట్లు తెలిసిందని చుండూరు సీఐ కల్యాణ్‌రాజ్‌ తెలిపాడు. దీంతో పద్మారావు ఆత్మహత్య చేసుకున్న విషయం వెంటనే తెలిసింది.


రెండు కుటుంబాలు చిన్నాభిన్నం..
వివాహేతర సంబంధం ఇద్దరి ప్రాణాలను బలితీసుకోగా, రెండు కుటుంబాలను ఛిన్నాభిన్నం చేసింది. పద్మారావు దంపతులకు ఇద్దరు కుమారులుకాగా, ఒకరు చిన్నతనంలోనే అనారోగ్యంతో మృతిచెందారు. బ్యాండ్‌ మేస్త్రీగా పనిచేస్తున్న పద్మారావు వ్యసనాలకు బానిసయ్యాడు. భార్యను వేధింపులకు గురిచేస్తుండటంతో తట్టుకోలేక రెండేళ్ల క్రితం ఆమె ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయంపై అప్పట్లో అతడిపై తెనాలి పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. రిమాండ్‌కు కూడా వెళ్లి వచ్చాడు. అయినా ప్రవర్తనలో మార్పు రాలేదు. శారదతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. అనుమానంతో ఆమెను హత్య చేశాడు. దీంతో శారద ముగ్గురు పిల్లలకు తల్లి ఆసరా లేకుండా పోయింది. పరారీలో ఉన్న పద్మారావు కూడా ఆత్మహత్యకు పాల్పడటంతో అతడి 12 సంవత్సరాల కుమారుడు తల్లిదండ్రులిద్దర్నీ కోల్పోయి అనాథగా మిగిలాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని