logo

‘మహిళలపై దాడులు అరికట్టడంలో ప్రభుత్వం విఫలం’

మహిళలు, బాలికలపై అత్యాచారాలు, దాడులు నివారించడంలో రాష్ట్ర ప్రభుత్వం  విఫలమైందని, గుంటూరులో బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితులను ఎన్‌కౌంటర్‌ చేయాలని పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ ఎమ్మెల్యే

Published : 20 May 2022 04:15 IST

జీజీహెచ్‌ వద్ద నిరసన తెలిపిన   మాజీ ఎమ్మెల్యే మస్తాన్‌వలి
తెలుగు మహిళ, జనసేన నాయకుల ధర్నా

ఆందోళన చేస్తున్న తెలుగుదేశం మహిళా నాయకులు

నగరంపాలెం, న్యూస్‌టుడే: మహిళలు, బాలికలపై అత్యాచారాలు, దాడులు నివారించడంలో రాష్ట్ర ప్రభుత్వం  విఫలమైందని, గుంటూరులో బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితులను ఎన్‌కౌంటర్‌ చేయాలని పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ ఎమ్మెల్యే మస్తాన్‌వలి డిమాండ్‌ చేశారు. అత్యాచారానికి గురై గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలికను పరామర్శించేందుకు మాజీ ఎమ్మెల్యేలు మస్తాన్‌వలి, లింగంశెట్టి ఈశ్వరరావు, కాంగ్రెస్‌ నాయకులు గురువారం జీజీహెచ్‌కు వచ్చారు. పోలీసులు అనుమతించకపోవడంతో గేటు వద్ద బైఠాయించి నిరసన ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా మస్తాన్‌వలి మాట్లాడుతూ అత్యాచారానికి గురైన బాలికను పరామర్శించేందుకు వస్తే పోలీసులు అనుమతించకపోవడం మానవత్వానికి మాయనిమచ్చన్నారు. బాధితురాలికి ప్రభుత్వం న్యాయం చేయాలన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ నాయకులను గుంటూరు తూర్పు డీఎస్పీ సీతారామయ్య, సిబ్బంది అరెస్ట్‌ చేసి పోలీసుస్టేషన్‌కు తరలించారు.

‘మహిళలకు రక్షణ కల్పించలేని సీఎం రాజీనామా చేయాలి’
రాష్ట్రంలో ప్రతిరోజూ మహిళలు, బాలికలపై అత్యాచారాలు జరుగుతున్నాయని, వాటిని నిలువరించలేని సీఎం జగన్‌, హోంమంత్రి వనితలు వెంటనే రాజీనామా చేయాలని తెలుగు మహిళా నాయకులు దాసరి జ్యోతి, వనజాక్షి డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మహిళలు, బాలికలపై అత్యాచారాలు అధికమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. గుంటూరు ఘటనలో నిందితులను కఠినంగా శిక్షించాలని, బాధితురాలికి ప్రభుత్వం రూ.25లక్షలు పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అనంతరం జీజీహెచ్‌ ప్రధాన రహదారిపై నిరసన ప్రదర్శన చేపట్టారు. కార్యక్రమంలో తెలుగు మహిళా నాయకులు వాణి, వందన, కార్యకర్తలు పాల్గొన్నారు. బాలికపై అత్యాచారం చేసిన నిందితులను అరెస్ట్‌ చేసి కఠినంగా శిక్షించాలని జనసేన పార్టీ మహిళా నాయకురాలు పార్వతీనాయుడు డిమాండ్‌ చేశారు. అత్యాచారానికి గురైన బాలికను పరామర్శించేందుకు జీజీహెచ్‌కు వచ్చిన జనసేన పార్టీ మహిళా నాయకులను పోలీసులు అనుమతించకపోవడంతో అసహనం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో నాయకులు బిట్రగుంట మల్లిక, హైమావతి, కార్పొరేటర్లు లక్ష్మీదుర్గ, పద్మావతి, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు, అధికార ప్రతినిధి ఆళ్లహరి తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని