logo

సముద్ర జలాల నుంచి భూములను కాపాడాలి

వేసవిలో సముద్ర జలాలు మురుగు కాలువల ద్వారా ముందుకు చొచ్చుకొచ్చి వేల ఎకరాల పంట భూములు దెబ్బతిని రెండో పంట సరిగ్గా పండటం లేదని శాసనమండలి చీఫ్‌విప్‌ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. బాపట్ల కలెక్టరేట్లో

Updated : 20 May 2022 06:04 IST

చివరి ఆయకట్టుకు నీరందేలా చర్యలు

జిల్లా సాగునీటి సలహా మండలి తొలి సమావేశంలో ప్రజాప్రతినిధులు

మాట్లాడుతున్న శాసనమండలి చీఫ్‌ విప్‌ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, వేదికపై చీరాల ఎమ్మెల్యే

కరణం బలరామకృష్ణమూర్తి, ఎమ్మెల్సీ పోతుల సునీత, కలెక్టర్‌ విజయకృష్ణన్‌ తదితరులు

బాపట్ల, న్యూస్‌టుడే : వేసవిలో సముద్ర జలాలు మురుగు కాలువల ద్వారా ముందుకు చొచ్చుకొచ్చి వేల ఎకరాల పంట భూములు దెబ్బతిని రెండో పంట సరిగ్గా పండటం లేదని శాసనమండలి చీఫ్‌విప్‌ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. బాపట్ల కలెక్టరేట్లో జిల్లా సాగునీటి, వ్యవసాయ సలహామండలి తొలి సమావేశం గురువారం మధ్యాహ్నం నిర్వహించారు. ఉమ్మారెడ్డి మాట్లాడుతూ.. ఈ సమస్యతో భూగర్భ జలాలు ఉప్పగా మారి భూసారం దెబ్బతినడం వల్ల రెండో పంట కోల్పోయి రైతులు నష్టపోతున్నారని, సమస్యను తీవ్రంగా పరిగణించి పరిష్కారానికి అధికారులు శాస్త్రీయంగా కృషి చేయాలని సూచించారు. చెక్‌ డ్యాంల నిర్మాణం ద్వారా చాలావరకు సమస్య అరికట్టవచ్చన్నారు. హేచరీలు, రొయ్యల ప్రాసెసింగ్‌ ప్లాంట్ల నుంచి కలుషిత నీరు శుద్ధి చేయకుండా బయటకు వదలడం వల్ల పంటలు పండటం లేదని, నివారణకు చర్యలు చేపట్టాలన్నారు. చీరాల ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి మాట్లాడుతూ.. జూన్‌ పదో తేదీనే నీరు విడుదల చేస్తున్నందున సాగు, మురుగు నీటి కాలువల్లో మరమ్మతులు వేగంగా చేయాలని అధికారులను ఆదేశించారు. సంతరావూరు వద్ద సాగనీటి కాలువలో మురుగు నీరు ప్రవహిస్తూ పంటలు ముంపు బారినపడి దెబ్బతిని రైతులు నష్టపోతున్నారని, సమస్య తక్షణమే పరిష్కరించాలన్నారు. ఎమ్మెల్సీ పోతుల సునీత మాట్లాడుతూ కుందేరువాగులోకి రొయ్యల ప్రాసెసింగ్‌ ప్లాంట్లు నుంచి కలుషిత నీరు విడుదల చేయటం వల్ల చీరాల మండలంలోని తీర గ్రామాల్లో పంటలు పండటం లేదన్నారు. కావూరివారిపాలెం, పాపాయపాలెం గ్రామాలకు నీరందించాలని కోరారు. కలెక్టర్‌ విజయకృష్ణన్‌ ప్రసంగిస్తూ కృష్ణా పశ్చిమ డెల్టాకు జూన్‌ 10న, సాగర్‌ ఆయకట్టుకు జులై 15న సాగునీరు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. కాలువల మరమ్మతుల కోసం రూ.రెండు కోట్లు కేటాయించినట్లు చెప్పారు. రూ.5 లక్షల లోపు పనులు నామినేషన్‌ పద్ధతిన కేటాయిస్తున్నట్లు జిల్లా జలవనరుల శాఖాధికారి మురళీకృష్ణ తెలిపారు. వ్యవసాయ సలహామండలి ఛైర్మన్‌ మంతెన దశరథమహారాజు, జిల్లా వ్యవసాయాధికారి అబ్దుల్‌ సత్తార్‌, ఏపీఎంఐపీ పీడీ జెన్నమ్మ, ఆర్డీవోలు రవీందర్‌, సరోజని, మత్స్యశాఖ జేడీ సురేష్‌, జలవనరుల శాఖ ఈఈలు వెంకటరత్నం, కృష్ణమోహన్‌, డీఈలు ప్రసాద్‌, అప్పారావు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని