logo

అర్బన్‌ చెరువుల బాగుకు అడుగులు

లక్ష జనాభా పైబడిన నగరాలు, పట్టణాల్లోని చెరువులకు మంచి రోజులొచ్చాయి. వాటిని కాలుష్యానికి, ఆక్రమణలకు దూరంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వాలు సంకల్పించాయి. అలాంటి వాటిని ఎంపిక చేసి, అభివృద్ధి పనుల అంచనాలు తయారు చేసి

Published : 22 May 2022 04:47 IST

తెనాలి(కొత్తపేట), న్యూస్‌టుడే: లక్ష జనాభా పైబడిన నగరాలు, పట్టణాల్లోని చెరువులకు మంచి రోజులొచ్చాయి. వాటిని కాలుష్యానికి, ఆక్రమణలకు దూరంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వాలు సంకల్పించాయి. అలాంటి వాటిని ఎంపిక చేసి, అభివృద్ధి పనుల అంచనాలు తయారు చేసి పంపించాలని ఇటీవల ‘ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌’ నుంచి కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు ఆదేశాలు అందాయి. దాంతో ఇంజినీర్లు వాటిని గుర్తించి, అభివృద్ది పనుల అంచనాలను రూపొందించి పంపించేందుకు కసరత్తు చేస్తున్నారు. 

ఎన్‌జీటీ నుంచి  మార్గదర్శకాలు

జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్‌జీటీ) లక్ష కన్నా ఎక్కువ జనాభా ఉన్న నగర, పురపాలికల్లోని తటాకాల్లోకి మురుగునీరు చేరకుండా, అలాగే అవి ఆక్రమణలకు గురికాకుండా చేయాలని తలపోసింది. ఈ మేరకు మార్గదర్శకాలు ఇచ్చి అమలు చేయాలని పాలికలను ఆదేశించింది. అయితే వాటి అమలుకు కమిషనర్లు ఏదో సాకు చెబుతూ దాటవేస్తూ వస్తున్నారు. ఈసారి ఎన్‌జీటీ కచ్చితంగా అమలు చేయాల్సిందేనని స్పష్టం చేసింది. దాంతో అధికారులు పాలికల్లోని మురుగునీరు చేరని, ఆక్రమణలకు గురికాని చెరువులను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. 

వాటి   కట్టుదిట్టం ఇలా..

ప్రభుత్వం వాటిని అమృత్‌ పథకం రెండో విడత నిధులతో అభివృద్ధి చేయించేందుకు రంగం సిద్ధంచేస్తోంది. వాటికి చుట్టూ గోడలు నిర్మిస్తారు. వాటిని నీటితో నింపడానికి, నిండినపుడు   బయటకు పంపడానికి ప్రత్యేక మార్గాలను ఏర్పాటు చేస్తారు. చుట్టుపక్కలున్న ఆవాస గృహాల సెప్టిక్‌ ట్యాంకుల్లోని వ్యర్థ జలాలు చేరకుండా కట్టుదిట్టం చేస్తారు. చెత్తా చెదారం కలవకుండా ప్రత్యేక ఏర్పాట్లుంటాయి. ఇక వాటిపై నివాసాలు, చిల్లర దుకాణాలు, బడ్డీలు, టీబంకులు, మాంసం, చేపల విక్రయ స్టాళ్లు ఏర్పడకుండా ప్రత్యేక నిఘా ఉంచుతారు. నిర్ణీత సమయంలో ఆ తటాకాల్లోని నీటిని సంబంధిత  పరీక్ష కేంద్రాలకు పంపించి, నీరు కలుషితం అయిందో లేదో కూడా తెలుసుకుంటుంటారు. ప్రభుత్వం ఈ విధంగా నీటి వనరులను కాలుష్యానికి దూరంగా ఉంచేందుకు ఓ చక్కటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.

ఎంపిక  సవాలే

ఎన్‌జీటీ మార్గదర్శకాల అమలులో భాగంగా నగర, పురపాలికల కమిషనర్లు మురుగునీరు చేరని, ఆక్రమణలు లేని చెరువులను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. ఇప్పటికే ఉన్న చెరువుల్లో కొన్ని ఏదోవిధమైన ఆక్రమణకు గురైనవే. పైగా అనేక కొలనుల్లోకి మురుగు నీరు చేరుతోంది. అలా కాని వాటిని గుర్తించడం మున్సిపల్‌ అధికారులకు ఒక సవాల్‌గా మారింది. ఉదాహరణకు తెనాలి మున్సిపాలిటీలో చినరావూరు, రజకపేట చెరువులను ఉద్యానాలుగా తీర్చిదిద్దారు. అలాగే ఐతానగర్‌ చెరువు చుట్టూ ఆక్రమణలు వెలిశాయి. ఈ నేపథ్యంలో అధికారులు ఇప్పటికే కొంత మేర అభివృద్ధి పనులను చేయించిన పినపాడు చెరువును ఎన్‌జీటీ మార్గదర్శకాలకు అనుగుణంగా తీర్చిదిద్దాలని సంకల్పించారు. దాని అభివృద్ధికి అంచనాలు తయారు చేసి, పంపించే పనిలో ఉన్నారు. గుంటూరు, మంగళగిరి-తాడేపల్లి కార్పొరేషన్ల అధికారులు కూడా ఇదే పనిలో తలమునకలయ్యారు. 

ఇదో మంచి అవకాశం

ఎన్‌జీటీ మార్గదర్శకాల ప్రకారం చెరువులను అభివృద్ధి చేసే అవకాశం దక్కింది. దీన్ని చక్కగా వినియోగించుకొని, తటాకాలను అభివృద్ధి పరుచుకోవచ్చు. ఈ మేరకు ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలూ అందాయి. 

- కొడాలి నాగమల్లేశ్వరరావు, మున్సిపల్‌ ఇంజినీరు, తెనాలి పురపాలక సంఘం.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని