logo
Published : 23 May 2022 05:11 IST

పీఎఫ్‌ క్లెయిమ్స్‌కు మోక్షమెప్పుడో!

వేలదరఖాస్తులు పెండింగులో

ఈనాడు, అమరావతి

తెనాలి పెదరావూరుకి చెందిన సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ ఒకరు తన భార్యకు హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో శస్త్రచికిత్స చేయించుకోవడానికి సిద్ధమయ్యారు. దీనికి ఈహెచ్‌ఎస్‌ వర్తించదని, ముందే చెల్లింపులు చేయాలని గుంటూరులో ప్రైవేటు ఆస్పత్రులు సూచించడంతో పీఎఫ్‌ రుణం పొంది హైదరాబాద్‌లో చేయించుకోవాలనుకున్నారు. ఇప్పటికీ క్లెయిమ్‌ మంజూరు కాలేదు. దీంతో శస్త్రచికిత్స వాయిదా వేసుకోవాల్సి వచ్చింది.

ఎన్నో అవసరాలతో దరఖాస్తు చేసుకున్న వేల మంది ఉద్యోగుల పరిస్థితి ఇదే...

ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉపాధ్యాయ, పంచాయతీరాజ్‌ ఉద్యోగుల ప్రావిడెంట్‌ ఫండ్‌(పీఎఫ్‌), ఉద్యోగ విరమణ ప్రయోజనాలకు సంబంధించిన క్లెయిమ్స్‌ పరిష్కారానికి నోచుకోక పెద్ద సంఖ్యలో పేరుకుపోయాయి. దీనికి నిధుల లేమి కారణమని తెలుస్తోంది. పిల్లల చదువులు, పెళ్లిళ్లు, గృహాల కొనుగోలు కోసం దాచుకున్న భవిష్య నిధి రుణాలు (పీఎఫ్‌) అవసరానికి అక్కరకు రాకుండా పోతున్నాయనే భావన ఉద్యోగుల్లో వ్యక్తమవుతోంది. ఈ రుణాలను ప్రభుత్వం లాగేసుకోవడం వల్లే ఈ పరిస్థితి అని, బాధ్యులైన అధికారులు మాత్రం సీఎఫ్‌ఎంఎస్‌లో బిల్లులు పెండింగ్‌ పడుతున్నాయని చెబుతున్నారు. వాటికి దరఖాస్తు చేసుకుని నెలల తరబడి ఎదురుచూసినా అవి బిల్లులకు నోచుకోవడం లేదని, అసలు ఎప్పుడొస్తాయో కూడా తెలియకుండా ఉన్నాయని ఉద్యోగులు వాపోతున్నారు. ప్రతి నెలా వందల సంఖ్యలో ఈ రుణాల కోసం ఉద్యోగులు దరఖాస్తు చేసుకుంటున్నారు. అవన్నీ నెలల తరబడి అపరిష్కృతంగా ఉండడంతో పరిష్కరించాల్సిన క్లెయిమ్స్‌ మొత్తాలు ఒక్క ఉమ్మడి గుంటూరులోనే సుమారు రూ.100 కోట్లు దాకా ఉండొచ్చని సమాచారం.

చివరిగాడిసెంబరులో...

చివరిగా గతేడాది డిసెంబరులో మాత్రమే ఒక చెక్కు పాసైందని, ఆ తర్వాత అనేక చెక్కులు రాసి పంపినా సీఎఫ్‌ఎంఎస్‌లో ఆమోదానికి నోచుకోక పెండింగ్‌ పడ్డాయని జడ్పీ ప్రావిడెంట్‌ ఫండ్‌ విభాగం ఉద్యోగులు తెలిపారు. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు సుమారు 1500 వరకు పీఎఫ్‌ పార్టు, ఫుల్‌ పేమెంట్లు కోరుతూ దరఖాస్తులు వచ్చాయి. వీటిల్లో మరికొన్ని డెత్‌ క్లెయిమ్స్‌ ఉన్నాయి. రుణాల కోసం దరఖాస్తు చేసుకుని ఎదురుచూస్తున్న మాట వాస్తవమేనని ధ్రువీకరించారు. జిల్లా, మండల పరిషత్‌ పాఠశాలల్లో పనిచేసే ఉపాద్యాయులు, నాన్‌ టీచింగ్‌ ఉద్యోగులు, పంచాయతీరాజ్‌ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులకు జడ్పీ ప్రావిడెంట్‌ విభాగం నుంచి పీఎఫ్‌ రుణాలు మంజూరవుతాయి. ఇప్పటికే రాసిన మూడు చెక్కుల్లో సుమారు 400-500 ఉద్యోగులకు చెందిన క్లెయిమ్స్‌ ఉంటాయి. అవి మంజూరు కాగానే మిగిలిన క్లెయిమ్స్‌కు చెక్కులు రాయాలనే యోచనలో జడ్పీ పావిడెంట్‌ ఫండ్‌ విభాగం ఉద్యోగులు ఉన్నారు. 20 ఏళ్ల సర్వీసు, 50 ఏళ్ల వయస్సు పైబడిన ఉద్యోగులు ఈ రుణాలను తీసుకుని తిరిగి చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఆ ఉద్దేశంతోనే పీఎఫ్‌ రుణాల కోసం ఎక్కువ మంది ఉద్యోగులు దరఖాస్తు చేస్తున్నారు.


దాచుకున్న రుణాలు ఇవ్వకపోవడం దుర్మార్గం

భవిష్యత్తు అసవరాలను దృష్టిలో పెట్టుకుని ఉపాధ్యాయులు తమ నెలవారీ జీతం నుంచి నిర్దేశిత మొత్తంలో పీఎఫ్‌ రుణం మినహాయించుకుని జీతాలు పొందుతున్నారు. ఈ దాచుకున్న రుణాలను అవసరానికి తీసుకోలేని పరిస్థితి రాష్ట్రంలో నెలకొనడం దురదృష్టకరం. గడిచిన రెండేళ్ల నుంచి అనేకసార్లు ఉన్నతాధికారులను కలిసి మా రుణాలు మాకివ్వడానికి నెలల తరబడి జాప్యం చేయటం ఏమిటని నిలదీసినా మార్పు రాలేదు. జడ్పీ ఖాతాలో నిధులు ఏ అవసరాలకు మళ్లించారో చెప్పడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పెండింగ్‌లో ఉన్న వేల దరఖాస్తులను పరిష్కరించకుంటే జడ్పీ పీఎఫ్‌ విభాగాన్ని ముట్టడిస్తాం.

- బసవలింగారావు, అధ్యక్షుడు, ఏపీటీఎఫ్‌, గుంటూరు


చాలా ఇబ్బంది పడుతున్నారు

కరోనా నేపథ్యంలో చేబదుళ్లు పుట్టడం లేదు. మార్కెట్‌లో అప్పులకు వెళితే నూటికి రూ.5 నుంచి రూ.10 వడ్డీ వసూలు చేస్తున్నారు. అంత వెచ్చించే పరిస్థితి ఉపాధ్యాయ, ఉద్యోగులకు ఉండదు. అందుకే ఏ అవసరం వచ్చినా పీఎఫ్‌ రుణం కోసమే ఎదురుచూస్తాం. ఇది ఇవ్వకుండా నెలల తరబడి తొక్కిపెట్టడం సరికాదు.

- పెదబాబు, అధ్యక్షుడు, ఎస్టీయూ, గుంటూరు

Read latest Guntur News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని