logo
Published : 23 May 2022 05:11 IST

దుర్వాసన భరించలేకపోతున్నాం

సత్తెనపల్లి ఆసుపత్రి నిర్వహణ తీరుపై రోగుల ఫిర్యాదు

సిబ్బందిపై పల్నాడు కలెక్టర్‌ ఆగ్రహం


గర్భిణితో మాట్లాడుతున్న పల్నాడు కలెక్టర్‌ శివశంకర్‌

సత్తెనపల్లి, న్యూస్‌టుడే: ‘ప్రసూతి సేవల వార్డులో మరుగుదొడ్లు కంపు కొడుతున్నాయి.. దుర్వాసన భరించలేకపోతున్నామని’ రోగులు కలెక్టర్‌ లోతేటి శివశంకర్‌కు ఫిర్యాదు చేశారు. ఆయన స్వయంగా వాటిని పరిశీలించి నిర్వహణలో లోపాలను గుర్తించారు. స్థానిక ప్రభుత్వ ప్రాంతీయ వైద్యశాలను ఆదివారం కలెక్టర్‌ ఆకస్మికంగా తనిఖీ చేయడంతో అనేక లోపాలు బయటపడ్డాయి. ఆయన ఆసుపత్రికి వచ్చే సమయానికి వైద్యురాలు కల్యాణి ఒక్కరే ఉన్నారు. సూపరింటెండెంట్‌కు ఆమె ఫోన్‌ చేయడంతో హుటాహుటిన వచ్చారు. నర్సింగ్‌ స్టేషన్‌ పక్కన వార్డులో ఖాళీ పడకలు చూసి ఎందుకిలా ఉన్నాయని ప్రశ్నించారు. ప్రసవానంతరం పక్కనే ఉన్న వార్డులోకి బాలింతలను తరలిస్తున్నట్లు సూపరింటెండ్‌ చెప్పగా అక్కడికి వెళ్లి చూశారు. చాలా వార్డుల్లో పడకలు ఖాళీగా ఉండటాన్ని గమనించారు. ఆసుపత్రిలో సక్రమంగా సేవలందుతున్నాయా? అని అద్దంకికి చెందిన గర్భిణి సుస్మితను ప్రశ్నించారు. పరీక్షలు ప్రైవేటుగా చేయించుకుంటున్నానని, ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చూపించుకుంటున్నట్లు ఆమె చెప్పడంతో ఆ ఆసుపత్రిలో తనిఖీలు నిర్వహించాలని ఆర్డీవో బీఎల్‌ఎన్‌ రాజకుమారికి కలెక్టర్‌ ఆదేశించారు. కేసు షీట్లలో వివరాలన్నీ ఎందుకు నమోదు చేయడం లేదని డాక్టర్‌ కల్యాణిని ప్రశ్నించారు. ఎంతమంది వైద్యులు స్థానికంగా నివాసం ఉండటం లేదని ఆరా తీశారు. గైనకాలజిస్టు సుష్మ హెడ్‌క్వార్టర్స్‌లో ఉండకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయని సూపరింటెండెంట్‌ చెప్పారు. వైద్యులు, సిబ్బంది ఖాళీల వివరాలు తెలుసుకున్నారు. ఆసుపత్రిలో పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా జరగకపోవడం, ముఖ్య సమస్యలపై ఏపీవీపీ కమిషనర్‌తో మాట్లాడతానని కలెక్టర్‌ తెలిపారు.

Read latest Guntur News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని