logo

పంచాయతీ నిధులు మింగేశారు..!

కొరవడిన అధికారుల పర్యవేక్షణ, సిబ్బంది చేతివాటం ఆ పంచాయతీని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టింది. కొల్లిపర మండలంలోని మున్నంగి మేజరు పంచాయతీ. ఆర్థిక పరిపుష్టికి లోటు లేదు. విలాసవంతమైన భవనాలు, ఆర్థిక వనరులు ఇక్కడ మెండు.

Published : 23 May 2022 05:06 IST

ఆడిట్‌ సిబ్బంది నుంచి ప్రత్యేక అధికారికి నోటీసులు

కొల్లిపర, న్యూస్‌టుడే

కొరవడిన అధికారుల పర్యవేక్షణ, సిబ్బంది చేతివాటం ఆ పంచాయతీని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టింది. కొల్లిపర మండలంలోని మున్నంగి మేజరు పంచాయతీ. ఆర్థిక పరిపుష్టికి లోటు లేదు. విలాసవంతమైన భవనాలు, ఆర్థిక వనరులు ఇక్కడ మెండు. 2019-20 ఆర్థిక సంవత్సరంలో రూ.11.30 లక్షలు, 2020-21లో రూ.12 లక్షల మేర ఇంటిపన్నుల రూపంలో గ్రామస్థుల నుంచి వసూలు చేశారు. నూరుశాతం ఇంటిపన్ను వసూలు చేసిన పంచాయతీ కార్యదర్శి, సిబ్బంది సంబంధిత నిధులను ప్రభుత్వ ఖాతాల్లో జమచేయలేదు.

రూ.లక్షల నిధులకు లెక్కలు చూపలేదాయె..: పంచాయతీకి ప్రజలు చెల్లించిన సొమ్ము, ప్రభుత్వ కేటాయింపుల వివరాలు తెలిపే పంచాయతీ క్యాష్‌బుక్‌, రికార్డుల జాడ లేకుండాపోయాయి. కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న ఉద్యోగి గత సంవత్సరం నవంబరులో సెలవు పెట్టుకున్నారు. మరో మాసం గడువు అనంతరం సిబ్బంది జీతభత్యాలను గుట్టుగా చెల్లించేందుకు సంతకాలు పెట్టాడన్న విమర్శలున్నాయి. 2022 జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్‌ మాసాల్లో సెలవులోనే ఉన్నారు. మండల స్థాయి అధికారులు మార్చి, ఏప్రిల్‌ మాసాల్లో కార్యదర్శిని విధులకు హాజరు కావాలంటూ నోటీసులు జారీచేసినా స్పందన లేకపోయింది. ఫిబ్రవరి 24న సంబంధిత పంచాయతీ నిర్వహణ నిమిత్తం మరో కార్యదర్శికి తాత్కాలిక బాధ్యతలను మండల స్థాయి అధికారులు అప్పగించారు. బాధ్యతలు తీసుకున్న కార్యదర్శికి గతంలో విధులు నిర్వహించిన కార్యదర్శి రికార్డులు, క్యాష్‌ పుస్తకాలు, ఇతర ఆర్థిక వివరాలను అప్పగించలేదు.

తాఖీదుల అందజేత

పంచాయతీకి ప్రత్యేక అధికారిగా బాధ్యతలు నిర్వహించిన మండల విద్యాశాఖాధికారికి ఆడిట్‌ అధికారుల నుంచి తాఖీదులు అందాయి. నిధుల వినియోగంపై సమగ్ర విచారణ జరపాలంటూ నోటీసులు అందచేశారు. వివరాలు తెలిపే పుస్తకాలు, విధులు నిర్వహించే కార్యదర్శి అందుబాటులో లేకపోవడంతో ప్రత్యేక అధికారిగా బాధ్యతులు నిర్వహించిన మండల విద్యాశాఖాధికారి విషయాన్ని ఉన్నతాధికారులకు మొరపెట్టుకోవాల్సి వచ్చింది.

కార్యదర్శి, సిబ్బంది చేతివాటం

రికార్డులను అప్పగించకుండా కార్యదర్శి సెలవుపై వెళ్లడంతో సిబ్బంది చేతివాటానికి అవకాశం దొరికింది. లక్షల్లో దోచుకున్నది పంచాయతీ కార్యదర్శా? సిబ్బందా అనే విషయం తేలాల్సి ఉంది. ఆడిట్‌ సమస్యలు తలత్తెడం, గుత్తేదారులు, పారిశుద్ధ్య సిబ్బందికి చెల్లింపులు నిలిచిపోవడంతో సమస్య వెలుగులోకి వచ్చింది. సుమారు 15 నుంచి 16 లక్షల రూపాయల నిధులు స్వాహా చేశారన్న విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో పంచాయతీలో పనిచేస్తున్న సదరు ఉద్యోగి రూ.5.15 లక్షల నిధులు ఏకమొత్తంలో ట్రెజరీలో చెల్లింపులు చేయడం విమర్శలకు బలాన్ని చేకూర్చుతున్నాయి. 2019-20, 2020-21 ఆర్థిక సంవత్సరాల లెక్కలు తాలూకు సుమారు రూ.9 లక్షలు నిధులు ఇప్పటికీ జమకాలేదు.

గుట్టువిప్పిన ఆడిట్‌

గ్రామ పంచాయతీ నిధుల పరిశీలనకు వచ్చిన ఆడిట్‌ సిబ్బందికి చేదు అనుభవం ఎదురైంది. 14, 15వ ఆర్థిక సంఘాల నిధులు, పంచాయతీ నిధుల వినియోగం లెక్కలను తనిఖీలు చేసేందుకు రికార్డులు అందుబాటులో లేవు. ఆడిట్‌ బృందం తీవ్ర అసహనానికి గరైంది. అందుబాటులో ఉన్న కొద్దిపాటి రికార్డులను పరిశీలించింది. ప్రత్యేక అధికారుల పాలనలో చేపట్టిన అభివృద్ధి పనులకూ లెక్కలు చూపలేదు. 2020-21 ఆర్థిక సంవత్సరం నిధుల వినియోగంపై పంచాయతీ కార్యదర్శి, ప్రత్యేక అధికారులకు నోటీసులు అందజేశారు. ఆడిట్‌ అభ్యంతరాల నోటీసులు అందుకునేందుకు సంబంధిత కార్యదర్శి అందుబాటులో లేకపోవడంతో నోటీసులను సదరు ఉద్యోగి నివాసముంటున్న చిరునామాకు తపాలా ద్వారా పంపించారు. ప్రత్యేక అధికారుల పాలనలో రూ.4 లక్షల నిధులకు లెక్కలు చూపలదని ఆడిట్‌ నివేదికలో పేర్కొన్నారు.

వివరాలు ఇవ్వలేదు

ప్రత్యేక అధికారుల పాలన ముగిసింది. పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. నూతన కార్యవర్గం ఏర్పడింది. ఇప్పటికీ పంచాయతీ నిధుల వివరాలను అందుబాటులో ఉంచలేదు. నిన్న మొన్నటివరకు ఇన్‌ఛార్జి కార్యదర్శి బాధ్యతల్లో ఉన్నారు. సెలవులో ఉన్న కార్యదర్శి బాధ్యతలు చేపట్టి రోజులు గడుస్తున్న లెక్కలు చూపలేదు.

- వేమూరి దీనమ్మ, మున్నంగి సర్పంచి

ఫిర్యాదులు అందినమాట వాస్తవమే

నిధుల్ని దుర్వినియోగం చేశారన్న ఆరోపణలు వచ్చిన మాట వాస్తవం. విచారణ చేపట్టాల్సి ఉంది. కార్యదర్శిగా విధులు నిర్వహించిన ఉద్యోగి బాధ్యతలను చేపట్టారు. పంచాయతీ రికార్డులు అందుబాటులోకి వచ్చాయి. సోమవారం పంచాయతీ రికార్డులను పరిశీలిస్తాం.

- ఎం.వి.వి.లక్ష్మణరావు. డీఎల్‌పీవో

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని