logo
Updated : 24 May 2022 10:57 IST

వరుడి ఇంటి ముందు వధువు బంధువుల ధర్నా

ధర్నా చేస్తున్న వారితో మాట్లాడుతున్న ఎస్సై సత్యనారాయణ

పాతరెడ్డిపాలెం(చేబ్రోలు), న్యూస్‌టుడే: ‘వరుడిపై కేసులు నమోదయ్యాయి. ఇప్పట్లో బయటకు వచ్చే అవకాశంలేదు. కుదుర్చుకున్న వివాహం రద్దు చేసుకుందాం. ముందుగా ఇచ్చిన కట్నం నగదు రూ.2.25 లక్షలు ఇవ్వాలంటూ’ వధువు బంధువులు వరుడి ఇంటి వద్ద రహదారిపై ధర్నాకు దిగారు. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం పాతరెడ్డిపాలెం గ్రామానికి చెందిన పవన్‌ కుమార్‌కు బాపట్ల జిల్లా చుండూరు మండలం ఆలపాడు గ్రామానికి చెందిన యువతితో పెళ్లి సంబంధం కుదుర్చుకుని సోమవారం ఉదయం వివాహ ముహూర్తం పెట్టుకున్నారు. పవన్‌ కుమార్‌ అప్పటికే అదే ప్రాంతానికి చెందిన మైనర్‌ బాలికతో ప్రేమ వ్యవహారం నడుపుతున్నారు. విషయం తెలుసుకున్న ప్రేమికురాలు పవన్‌ కుమార్‌ను నిలదీశారు. ఇంట్లో వారు తమ వివాహానికి ఒప్పుకోవడం లేదని, ఇద్దరు కలసి పెళ్లి చేసుకుందామని అనుకున్నారు. శనివారం గుంటూరు సమీపంలోని పెదపలకలూరు ఇంజినీరింగ్‌ కళాశాలలో తను ఇంటర్మీడియట్‌ పరీక్ష రాసే కేంద్రం వద్దకు రావాలని కబురు చేసింది. అతను ఎంతసేపటికీ రాకపోవడంతో భవనంపై నుంచి ఆత్యహత్యాయత్నానికి పాల్పడింది. దీంతో ఆదివారం నల్లపాడు పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. సోమవారం ఆలపాడు నుంచి వధువు వారి బంధు వర్గం పాతరెడ్డిపాలెం చేరుకున్నారు. పవన్‌ కుమార్‌ బంధువులు పెళ్లి సమయానికి తీసుకువస్తామని నచ్చజెబుతూ మధ్యాహ్నం వరకు కాలయాపన చేశారు. అతడిపై పలు సెక్షన్‌లతో కేసులు నమోదు అయ్యాయని తెలుసుకుని వివాహం రద్దు చేసుకుందామని వధువు బంధువర్గం కోరారు. ముందుగా ఇచ్చిన కట్నం నగదు తిరిగి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. పవన్‌ కుమార్‌ తల్లిదండ్రులు తమ వద్ద లేవని చెప్పడంతో ఆగ్రహించిన బంధువులు ముట్లూరు రోడ్డులో ధర్నాకు దిగారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఎస్సై సత్యనారాయణ ఇరువర్గాలకు నచ్చ చెప్పి ధర్నాను విరమింపజేశారు. అతడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

ప్రేమ పేరిట వంచన: నిందితుడిపై కేసు

గ్రామీణ గుంటూరు: ప్రేమ పేరిట యువతిని మోసం చేసిన యువకుడిపై నల్లపాడు పోలీసులు 376 సెక్షన్‌ కింద కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన మేరకు.. చేబ్రోలు మండలంలలోని పాతరెడ్డిపల్లి గ్రామానికి చెందిన పవన్‌ కుమార్‌ అదే మండలానికి చెందిన ఓ యువతిని కొన్నేళ్లుగా ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని నమ్మబలికాడు. చివరికి అతను తనను వంచనకు గురిచేశాడని తెలుసుకున్న బాధితురాలు మూడు రోజుల క్రితం గుంటూరు శివారులోని ఓ ప్రైవేటు కళాశాల భవనం పైనుంచి కిందికి దూకి ఆత్మహత్యకు యత్నించింది. ఆమె జీజీహెచ్‌లో చికిత్స పొందుతోంది. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
 

Read latest Guntur News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని