Crime News: ఇళ్లు నిర్మిస్తామంటూ రూ.90 కోట్లకు కుచ్చుటోపీ!

నవ్యాంద్రప్రదేశ్‌ రాజధానిలో సొంతింటి కల సాకారం చేస్తామంటూ ప్రజలను రూ. కోట్లలో మోసం చేసిన సంస్థపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏళ్ల తరబడిగా పోలీసుల చుట్టూ తిరుగుతున్నా కనీసం ఎఫ్‌ఐఆర్‌ కూడా నమోదు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ

Updated : 24 May 2022 08:12 IST

 370 మంది బాధితులు
 ఎఫ్‌ఐఆర్‌ నమోదుకు ఎస్పీ ఆదేశం

ఎస్పీకి ఫిర్యాదు చేసిన బాధితులు

నెహ్రూనగర్‌(గుంటూరు), న్యూస్‌టుడే : నవ్యాంద్రప్రదేశ్‌ రాజధానిలో సొంతింటి కల సాకారం చేస్తామంటూ ప్రజలను రూ. కోట్లలో మోసం చేసిన సంస్థపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏళ్ల తరబడిగా పోలీసుల చుట్టూ తిరుగుతున్నా కనీసం ఎఫ్‌ఐఆర్‌ కూడా నమోదు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు బాధితులు సోమవారం గుంటూరు జిల్లా ఎస్పీ ఆరిఫ్‌ హఫీజ్‌కు ఫిర్యాదు చేశారు. స్పందించిన ఎస్పీ వెంటనే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయిస్తామని బాధితులకు భరోసా ఇచ్చారు. అనంతరం బాధితులు విలేకరులతో మాట్లాడారు. 2016లో గుంటూరు నందివెలుగు రోడ్డులో ఓ సంస్థ నాలుగెకరాల్లో వెంచర్‌ వేస్తున్నామని అందులో రెండు పడక గదుల ఇల్లు (డబుల్‌ బెడ్‌రూం ప్లాట్‌) రూ. 28 లక్షలు, మూడు పడక గదుల ఇల్లు రూ. 40 లక్షలకు నిర్మించి రిజిస్ట్రేషన్‌ చేసి ఇస్తామని, ఏడాదిలో పనులు పూర్తి చేస్తామని చెప్పారన్నారు. దీంతో తాము అప్పటి వరకు దాచుకున్న నగదుతోపాటు అప్పులు చేసి రూ. లక్షల్లో నగదును సదరు సంస్థకు చెల్లించామన్నారు. గోడలు నిర్మించి తర్వాత వదిలిపెట్టారని బాధితులు వివరించారు. దీనిపై సంస్థ వారిని ప్రశ్నిస్తే ఇసుక కొరత, కొవిడ్‌ లాక్‌డౌన్‌ తదితర కారణాలు చెపుతూ కాలం వెళ్లదీస్తున్నారన్నారు. తమ డబ్బులు తిరిగి ఇవ్వమంటే పట్టించుకోవడంలేదన్నారు. బాధితులంతా కలసి తిరుమల అపార్టుమెంట్‌ ప్లాట్‌ ఓనర్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌గా ఏర్పడి జీఎంసీ, రెరా, పోలీసులకు ఫిర్యాదులు చేశామన్నారు. 340 మంది వద్ద సుమారు రూ. 90 కోట్ల వరకు నగదు వసూలు చేసి మోసగించిన వారిపై కనీసం ఎఫ్‌ఐఆర్‌ కూడా నమోదు చేయడం లేదన్నారు. రాజకీయ పలుకుబడితో తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. దీనిపై ఎస్పీకి ఫిర్యాదు చేయగా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయిస్తామని హామీ ఇచ్చారన్నారు. ఎస్పీకి ఫిర్యాదు చేసిన వారిలో అసోసియేషన్‌ అధ్యక్షుడు హరేంద్ర, కార్యదర్శి మీరాకృష్ణ, సతీష్‌, రాజేష్‌, లలిత, శివకుమార్‌, తదితరులున్నారు.


రూ. 4 కోట్ల  భూమి తీసుకున్నారు 

మా అమ్మ రమాదేవికి చెందిన అరెకరం పొలం నాకు కట్నంగా ఇచ్చారు. ఆ 55 సెంట్ల భూమిని ఆ వెంచర్‌ వేసినవాళ్లు అభివృద్ది చేసి 20 ప్లాట్లు ఇస్తామన్నారు. స్థలం రూ. 4 కోట్లు పలుకుతుంది. చేతిలో చిల్లిగవ్వలేదు. మా పిల్లలకు కళాశాల ఫీజు చెల్లించేందుకు కనీసం రూ. లక్ష ఇవ్వమన్నా ఇబ్బందిపెడుతున్నారు.

               - సుజాత


రూ. 28.50 లక్షలు  చెల్లించాం

సొంతింటి కోసం ఏళ్ల తరబడి కష్టపడి దాచుకున్న డబ్బులు రూ. 28.50 లక్షలు చెల్లించాం. 2017 నుంచి ఇల్లు పూర్తిచేసి ఇవ్వాలని తిరుగుతున్నాం. అధికారుల చుట్టూ తిరుగుతున్నా మా ఆవేదన ఎవ్వరూ అర్థం చేసుకోవడంలేదు. ఇప్పటికైనా న్యాయం చేయాలని కోరుతున్నాం.

               - లలిత


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని