logo

వైకాపా ప్రభుత్వంలో దళితులకు రక్షణ కరవు

వైకాపా ప్రభుత్వంలో దళితులకు రక్షణ లేకుండా పోయిందని తెదేపా జిల్లా అధ్యక్షుడు తెనాలి శ్రావణ్‌కుమార్‌ విమర్శించారు. దళితుడైన సుబ్రహ్మణ్యంను

Published : 24 May 2022 04:45 IST

 కాగడాల ప్రదర్శనను అడ్డుకున్న పోలీసులు

 తెదేపా నేతల అరెస్టు

ప్రదర్శనలో పాల్గొన్న తెనాలి శ్రావణ్‌కుమార్‌, డేగల ప్రభాకర్‌, కోవెలమూడి రవీంద్ర, మహమ్మద్‌ నసీర్‌

పట్టాభిపురం(గుంటూరు), న్యూస్‌టుడే: వైకాపా ప్రభుత్వంలో దళితులకు రక్షణ లేకుండా పోయిందని తెదేపా జిల్లా అధ్యక్షుడు తెనాలి శ్రావణ్‌కుమార్‌ విమర్శించారు. దళితుడైన సుబ్రహ్మణ్యంను హత్య చేయించిన వైకాపా ఎమ్మెల్సీ అనంత ఉదయ్‌భాస్కర్‌ అలియాస్‌ అనంతబాబుపై కఠిన చర్యలు తీసుకోవాలని, సుబ్రహ్మణ్యం కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో లాడ్జి సెంటర్‌లోని అంబేడ్కర్‌ విగ్రహం వద్ద కాగడాలు, కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించాలని తలపెట్టారు. జిల్లా పార్టీ కార్యాలయం వద్ద ప్రారంభమైన నిరసన ప్రదర్శనను పోలీసులు మార్గం మధ్యలో అడ్డుకున్నారు. దీంతో తెదేపా నాయకులు, పోలీసుల మధ్య తోపులాట, వాగ్వాదం చోటుచేసుకుంది. తెనాలి శ్రావణ్‌కుమార్‌, నగర పార్టీ అధ్యక్షుడు డేగల ప్రభాకర్‌, మహమ్మద్‌ నసీర్‌, మానుకొండ శివప్రసాద్‌, నక్కల అగస్టీన్‌, పోతినేని శ్రీనివాసరావు, రావిపాటి సాయికృష్ణ, వేములకొండ శ్రీనివాసరావు, షేక్‌ చినబాజి, షేక్‌ ఫిరోజ్‌, గుడిమెట్ల దయారత్నం తదితరుల్ని పోలీసులు అరెస్టు చేసి అరండల్‌పేట ఠాణాకు తరలించారు. అంబేడ్కర్‌ విగ్రహం వద్ద నిరసనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని పైనుంచి పోలీసులకు ఆదేశాలు రావడంతో అక్కడ చేయవద్దని తెదేపా నాయకులతో పోలీసులు ముందు నుంచి మంతనాలు జరిపారు. మధ్యాహ్నం నుంచే కొందరు పార్టీ నాయకుల ఇళ్ల వద్దకు పోలీసులు వెళ్లారు. అయినప్పటికీ పార్టీ నాయకులు గ్రూపులుగా విడిపోయి కనపర్తి శ్రీనివాసరావు, మద్దిరాల మ్యాని, ఎల్లావుల అశోక్‌, అహమ్మద్‌తుల్లా తదితరులు అంబేడ్కర్‌ విగ్రహం వద్దకు చేరుకుని నిరసన తెలిపారు. పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని వారిని కూడా అరెస్టు చేసి అంరడల్‌పేట ఠాణాకు తరలించారు. శ్రావణ్‌కుమార్‌ మాట్లాడుతూ ‘దళితుల ఓట్లతో అధికారంలోకి వచ్చిన జగన్‌ పాలనలో నిత్యం ఏదో ఒక ప్రాంతంలో దళితులపై దాడులు, అవమానాలు జరుగుతూనే ఉన్నాయి. సుబ్రహ్మణ్యంను ఎమ్మెల్సీ అనంతబాబు దారుణంగా హత్య చేస్తే.. చేయలేదని మంత్రులు సిగ్గు లేకుండా వెనకేసుకువచ్చారు. ఈ కేసులో ఎమ్మెల్సీని పోలీసులు అరెస్టు చేశారు. ఇప్పుడేమి సమాధానం చెబుతారు. ప్రభుత్వం తక్షణమే అనంతబాబును ఎమ్మెల్సీ పదవి నుంచి తప్పించాలి. సుబ్రహ్మణ్యం కుటుంబానికి పరిహారం అందజేసి ఆదుకోవాలి’.. అని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో బొల్లెద్దు సుశీలరావు, ముత్తినేని రాజేష్‌, కంచర్ల శివరామయ్య, కల్లూరి శ్రీనివాసరావు, గోళ్ల ప్రభాకర్‌, దామచర్ల శ్రీనివాసరావు, నాయుడు ఓంకార్‌, పేరం అనిత, మల్లె విజయ, దాసరి జ్యోతి, గుడిపల్లి వాణి, పోతురాజు సమత, లంకా మాధవి తదితరులు పాల్గొన్నారు.

అడ్డుకుంటున్న పోలీసులు
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని