logo

నెఫ్రాలజీ విభాగంలో వైద్యులు ఎప్పుడొస్తున్నారు?

సర్వజనాసుపత్రిలో నిపుణులైన వైద్యులు అందుబాటులో ఉంటారనే నమ్మకంతో సుదూర ప్రాంతాల నుంచి రోగులు చికిత్స కోసం వస్తుంటారు. ఆ విధంగా వచ్చిన వారిలో కొందరికి తీవ్ర నిరాశే మిగులుతోంది. ఇటీవల ఒంగోలు నుంచి వాసు(12) అనే

Updated : 24 May 2022 05:10 IST

గుంటూరు వైద్యం, న్యూస్‌టుడే


నెఫ్రాలజీ విభాగం

సర్వజనాసుపత్రిలో నిపుణులైన వైద్యులు అందుబాటులో ఉంటారనే నమ్మకంతో సుదూర ప్రాంతాల నుంచి రోగులు చికిత్స కోసం వస్తుంటారు. ఆ విధంగా వచ్చిన వారిలో కొందరికి తీవ్ర నిరాశే మిగులుతోంది. ఇటీవల ఒంగోలు నుంచి వాసు(12) అనే బాలుడిని జీజీహెచ్‌కి తీసుకువచ్చారు. ఇక్కడ వైద్యులు పరీక్షించి నెఫ్రాలజిస్టుకి చూపించాలని సూచించారు. అదేవిధంగా పిడుగురాళ్ల నుంచి సుశీల(19) వచ్చింది. ఆమెను కూడా నెఫ్రాలజిస్టు వద్దకు తీసుకుని వెళ్లాల్సిందిగా తెలిపారు. గుంటూరులో నెఫ్రాలజిస్టు లేనందున వారిని విజయవాడ ప్రభుత్వాసుపత్రికి వెళ్లాల్సిందిగా వైద్యులు సిఫార్సు చేశారు. గతంలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ రాలేదని, తొలిసారి రోగులను విజయవాడ పంపించాల్సి వచ్చిందని వైద్యులు ఆవేదన వ్యక్తం చేస్తుండటం గమనార్హం.

నిపుణులను కేటాయించినా...

సర్వజనాసుపత్రికి ఉన్న ప్రాధాన్యం గుర్తించిన ఉన్నతాధికారులు గత మార్చి నెలలో జరిగిన సాధారణ బదిలీల్లో విశాఖపట్నం నుంచి రమేష్‌చంద్రను సహాచార్యులుగా గుంటూరుకు మార్చారు. ఆయన ఎప్పుడు వస్తున్నారో? వస్తే ఎన్ని రోజులు విధుల్లో ఉంటున్నారో? పొరుగు రోగుల విభాగానికి వెళ్తున్నారా?.. లేదా.. ఎవరికీ తెలియని పరిస్థితి నెలకొంది. అదేవిధంగా నూతనంగా ప్రతిభ ఆధారంగా సహాచార్యుల ఎంపికలో వరప్రసాద్‌ను గుంటూరుకు కేటాయించారు. ఆయన కూడా విధుల్లో చేరారు. అనంతరం వార్డుకు రావడంలేదని పలువురు తెలుపుతున్నారు. ఆయన ఇప్పటికే ప్రైవేటు వైద్య కళాశాలలో పని చేస్తున్నట్లు వైద్యులు తెలుపుతున్నారు. ఒకే వ్యక్తి రెండు కళాశాలల్లో పని చేసేందుకు ఎన్‌ఎంసీ నిబంధనలు అంగీకరించవని బోధనానిపుణులు గుర్తు చేస్తున్నారు. దీంతో ఆ విభాగంలో రోగులను పరీక్షించేందుకు అర్హులైన వైద్యులే కరవయ్యారు. మూత్రపిండాల పనితీరు, కిడ్నీ సమస్యలేవైనా తెలత్తుతున్నాయా? అనేవి తెలుసుకోవడానికి ఈ విభాగానికి నిత్యం అధిక సంఖ్యలో రోగులు వస్తుంటారు. కిడ్నీలు దెబ్బతింటుంటే ముందుగానే గుర్తించడం, అవసరమైన వారందరికీ తగిన చికిత్సలు అక్కడి వైద్యులు అందిస్తుంటారు. కిడ్నీ వైఫల్యం బారిన పడ్డవారిని నెఫ్రాలజిస్టు పర్యవేక్షణలో ఉంచి డయాలసిస్‌ ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. అత్యంత కీలకమైన ఈ విభాగంలో వైద్యులే లేకపోవడంతో రోగులు ఇక్కట్లకు గురవుతున్నారు.

ఉన్నతాధికారులకు తెలియజేశాం

దీనిపై గుంటూరు వైద్య కళాశాల ప్రిన్సిపల్‌ పద్మావతిదేవి మాట్లాడుతూ వరప్రసాద్‌ విధులకు గైర్హాజరవుతున్నట్లు ఉన్నతాధికారులకు తెలియజేశామన్నారు. రమేష్‌చంద్ర సక్రమంగా విధులకు ఎందుకు రావడంలేదో తెలుసుకుంటామన్నారు. తాజాగా సహాయ ఆచార్యులుగా అస్లాం విధుల్లో చేరినందున రోగులకు ఇబ్బంది లేకుండా చూస్తామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని