logo

పురపాలికల్లో పనులకు.. గుత్తేదారుల రాంరాం..

పూర్తయిన పనులకు బిల్లులు చెల్లించడం లేదు.. చేపట్టాల్సిన పనులకు అవసరమైన మేరకు సిమెంటు ఇవ్వకుండా యంత్రాంగం గుత్తేదారులను ఇబ్బంది పెడుతోంది. రహదారుల నిర్మాణాలకు

Updated : 24 May 2022 06:33 IST

సిమెంటు ఇవ్వరు, బిల్లులు చెల్లించరని ఆవేదన

విజిలెన్స్‌ భయం!

ఈనాడు, అమరావతి

గుంటూరులోని రామనాథక్షేత్రం రహదారి పనులు అసంపూర్తిగా..

పూర్తయిన పనులకు బిల్లులు చెల్లించడం లేదు.. చేపట్టాల్సిన పనులకు అవసరమైన మేరకు సిమెంటు ఇవ్వకుండా యంత్రాంగం గుత్తేదారులను ఇబ్బంది పెడుతోంది. రహదారుల నిర్మాణాలకు ఏమాత్రం వినియోగించని రెండో రకం సిమెంట్‌ ఇచ్చి పనులు నిర్వహించాలని కోరడంపై గుత్తేదారుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇలాగైతే పనులు చేయలేమని చెప్పి ఏకంగా వారు పనుల జోలికి వెళ్లడం లేదు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో చాలా వరకు నగర, పురపాలికల్లో అభివృద్ది పనులు నిలిచిపోవటంతో ఇంజినీరింగ్‌ అధికారులకు ఏం చేయాలో పాలుపోవడం లేదు. అసలు రానున్నది వర్షాకాలం కావడంతో ఆ సీజన్‌లో పల్లపు ప్రాంతాలు ముంపునకు గురికాకుండా.. డ్రెయిన్లలో పూడికలు తీసే పనులకు ప్రస్తుతం టెండర్లు పిలిచారు. ఆ పనులను సైతం నిలుపుదల చేయడంతో వర్షాలు వచ్చే వేళ నగర, పట్టణాలపై ప్రభావం పడుతుందని ఇంజినీరింగ్‌ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి.

రహదారుల నిర్మాణ పనులకు ఓపీసీ 53 గ్రేడ్‌ సిమెంట్‌ వాడతారు. దానికి బదులు పీపీసీ సిమెంట్‌ సరఫరా చేస్తామంటున్నారు. దీంతో రహదారులు నిర్మిస్తే నాణ్యత లోపిస్తుంది. ఇది సాకుగా చూపి బిల్లులు ఆపేయటం, విజిలెన్స్‌ విచారణకు ఆదేశించటం వంటివి చేస్తారని ముందుగానే గుత్తేదారులు అప్రమత్తమయ్యారు. ఓపీసీ సిమెంటు సరఫరా చేయకపోతే పనులు చేయలేమని తమ అభిప్రాయాన్ని అధికారులకు తెలియజేశారు. పీపీసీ సిమెంటు అనేది డ్రెయిన్లు, బెడ్‌ కింద పనుల్లోనే వాడతారని చెబుతున్నారు. ‘ఈ నెల 17 నుంచి ఓపీపీ సిమెంటు ధరలు పెంచారు. అయినా తాము అంగీకరించి అదే సిమెంటు కోరుతూ డిమాండ్‌ డ్రాఫ్ట్‌లు తీసి పంపుతున్నాం. కానీ సరకు మాత్రం రావటం లేదు. ప్రత్యామ్నాయంగా పీపీసీ సిమెంటు తీసుకుని దాంతో నిర్మాణ పనులు చేయాలని అధికారులు కోరుతున్నారని’ గుత్తేదారవర్గాలు అంటున్నాయి.

గుంటూరులో మరీ విచిత్రం

* గుంటూరు నగరపాలకలో భూగర్భ డ్రైనేజీ పనులు(యూజీడీ) పూర్తికాక రోడ్లు ఎక్కడిక్కడ తవ్వి వదిలేశారు. దీంతో వర్షాలు పడితే నగరం అంతా బురదమయమవుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని వర్షాలు రాక మునుపే కనీసం కొన్ని రహదారులైనా నిర్మించి ప్రజలకు అసౌకర్యం లేకుండా చూడాలని, ప్రధాన డ్రెయిన్లలో పూడికతీత పనులు ఈ సీజన్‌లో చేపట్టాల్సి ఉంది. ఆ పనులు చేయటానికి గుత్తేదారులు ముందుకు రావడం లేదు. వీటికి సంబంధించి కొన్ని పనులకు రెండు, మూడుసార్లు టెండర్లు పిలిచినా గుత్తేదారులు పాల్గొనటం లేదు. దీంతో ఇంజినీరింగ్‌ వర్గాల్లో ఆందోళన నెలకొంది.

* పనులు నిర్వహించిన తర్వాత ఎంబుక్కు రికార్డు చేయాలి. తర్వాత మరోసారి ఆ పనుల నాణ్యతను పరిశీలించి బిల్లులు చెల్లించడానికి సిఫార్సు చేయాలి. సెక్టోరియల్‌ అధికారులతో (ఇంజినీరింగ్‌ యేతర) కమిటీ వేసి ఆ మేరకు బిల్లులు చెల్లించాలని కమిషనర్‌ నిర్ణయించారు. ఈ విధానంతో బిల్లుల చెల్లింపు బాగా ఆలస్యమవుతోంది. తమకు నాణ్యత గురించి ఏం తెలుస్తుందని, తామెలా సిఫార్సు చేస్తామంటూ సెక్టోరియల్‌ అధికారులు బిల్లులపై సంతకాలు చేయటం లేదు. ఈ కారణాలతో సుమారు రూ.6-7 కోట్ల బిల్లులు రావాల్సి ఉందని కాంట్రాక్టర్స్‌ అసోసియేషన్‌ వర్గాలు తెలిపాయి. ‘రహదారుల నిర్మాణానికి వినియోగించాల్సిన ఓపీసీ 53 గ్రేడ్‌కు బదులు పీపీసీ సిమెంటు ఇచ్చి పనులు చేయమంటున్నారు. వాటితో పనులు చేస్తే నాణ్యత లోపించి చివరకు గుత్తేదారులను బ్లాక్‌ లిస్టులో పెట్టి ఇబ్బందులకు గురిచేస్తారని’ జిల్లా వ్యాప్తంగా పురపాలికల్లో పనులు నిలిపివేశామని కాంట్రాక్టర్లు ధ్రువీకరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని