logo
Published : 24 May 2022 04:45 IST

నీటి నాణ్యతలో లోపాలు..!

ప్రాంతీయ ప్రయోగశాల అధికారుల పరిశీలనలో వెల్లడి

ఈనాడు, అమరావతి

శీతలపానీయాల సీసాలో నీళ్లు పట్టుకురాగా పరీక్ష చేయబోమని తిరస్కరిస్తున్న సిబ్బంది

నగర, పురపాలికల్లో వార్డు ఎమినిటీస్‌ కార్యదర్శులు నిత్యం సేకరిస్తున్న తాగునీటి నమూనాలను విశ్లేషిస్తే కొన్నిచోట్ల క్లోరిన్‌ శాతాలు తగ్గుముఖం పట్టడం వంటి లోపాలు బయటపడుతున్నాయి. కానీ ప్రజలు మాత్రం తమకు సరఫరా అవుతున్న నీరు బురదగా వస్తున్నాయని, నీళ్లు రుచిగా ఉండటం లేదని, నలకలు ఉంటున్నాయని ఇలా అనేక కారణాలు చెబుతున్నారు. దీంతో గుంటూరులోని ప్రాంతీయ నీటి ప్రయోగశాల (రీజనల్‌ టెస్టింగ్‌ ల్యాబ్‌) అధికారులు నమూనాలు సేకరించి నాణ్యతను పరిశీలిస్తే మరికొన్ని నాణ్యత లోపాలు వెలుగులోకి వచ్చాయి.

పైపుల లీకేజీతో సరఫరా అయిన పచ్చని నీటి నమూనాలు పరీక్షలకు సిద్ధంగా...

* గుంటూరు నగరపాలకలో బీఆర్‌ స్టేడియం, కోర్టు రోడ్‌లో మెడికల్‌ కాలేజీ వద్ద, లక్ష్మీపురం రిజర్వాయర్ల ప్రాంతాల్లో పైపులకు లీకులు ఏర్పడి నీళ్లు బురదగా వస్తున్నాయని గుర్తించి నగరపాలక ఇంజినీరింగ్‌ విభాగాన్ని అప్రమత్తం చేశారు. స్పందించిన నగరపాలక అధికారులు ఇటీవల రెండు రోజులు నగరం అంతటా నీటి సరఫరా నిలుపుదల చేసి ఆ లీకులకు మరమ్మతులు నిర్వహించి లోపాలను సరిదిద్దుకున్నారు. ఒక్క గుంటూరులోనే కాదు.. పొన్నూరు పురపాలికలో సమ్మర్‌ స్టోరేజీ ట్యాంకులో నీళ్లు మొత్తం పచ్చగా మారిపోయాయి. వాటినే సరఫరా చేస్తున్నారు. అక్కడి నుంచి నమూనాలు పట్టుకొచ్చి పరీక్షించారు. పాచి ఎక్కువగా పేరుకుపోవడంతో రంగు మారిపోతోందని, ఆ నీళ్లు తాగితే వ్యాధులు వస్తాయని హెచ్చరించడంతో ఆ ట్యాంకును ఇటీవల కాఫర్‌ సల్ఫేట్‌తో శుభ్రపరిచారు. సమస్య పరిష్కారమైంది.

ఉమ్మడి గుంటూరు జిల్లాలో గుంటూరు, మంగళగిరి-తాడేపల్లి నగరపాలక సహా తెనాలి, పొన్నూరు, నరసరావుపేట పట్టణాల్లో ఇప్పటి వరకు నమూనాలు సేకరించామని ప్రాంతీయ ప్రయోగశాల విశ్లేషకులు తెలిపారు. ఇంకా రేపల్లె, బాపట్ల, సత్తెనపల్లి, చిలకలూరిపేట, నరసరావుపేట, పిడుగురాళ్ల, వినుకొండ, మాచర్ల పురపాలికల నుంచి నమూనాలు సేకరించి పరీక్షలు నిర్వహించాల్సి ఉందన్నారు.  వర్షాలు పడి నేరుగా కృష్ణా నది, సాగర్‌, పులిచింతల నుంచి పంపింగ్‌ అయి నీళ్లు వచ్చే వరకు ఇంజినీరింగ్‌ విభాగం నిత్యం జాగ్రత్తలు తీసుకోవాల్సిందేనని సూచించారు. అధికారులు, ప్రజలు ఎవరైనా నీటి నమూనాలను స్టెరిలైజ్‌ చేసిన నీటి క్యాన్లలో కనీసం లీటర్‌కు తగ్గకుండా తీసుకురావాలి. కొందరు శీతల పానీయాల సీసాలు, కెమికల్స్‌ బాటిళ్లలో నింపి తీసుకొస్తున్నారు. వాటిల్లో తెస్తే కచ్చితమైన ఫలితాలు రావని అధికారులు పేర్కొన్నారు.

క్లోరిన్‌ తగ్గకూడదు

గుంటూరు, మంగళగిరి-తాడేపల్లి నగరపాలికల్లో కొన్ని శివారు కాలనీల్లో క్లోరిన్‌ శాతం బాగా తగ్గుతోందని ఎమినిటీస్‌ సెక్రటరీల పరిశీలనలో తేలింది. సాధారణంగా చివరి వినియోగదారుడి (యండ్‌ యూజర్‌) ఇంటి వద్దకు వెళ్లే సరికి క్లోరిన్‌ అనేది 0.2 నుంచి 0.5 మధ్య ఉండాలి. అంతకన్నా తగ్గితే ఆ నీటిలో నాణ్యత లోపాలు చోటుచేసుకుంటాయి. బ్యాక్టీరియా వంటి క్రిములు నీళ్లల్లో కలిసి ప్రవహిస్తాయి. ఇది ప్రమాదకరమని అధికారులు చెబుతున్నారు. ‘ప్రస్తుతం ప్రతి వార్డు ఎమినిటీస్‌ సెక్రటరీ వద్ద క్లోరిన్‌ శాతాలు వెంటనే తెలుసుకోవటానికి మీటర్లు ఉన్నాయి. ఎక్కడైనా క్లోరిన్‌ శాతాలు తగ్గితే వెంటనే సమస్యను అధిగమించటానికి ఎమినిటీస్‌ సెక్రటరీలు ప్రతి రోజూ నివేదిక ఇస్తున్నారు. గుంటూరు నగరపాలకలో నిత్యం సగటున 800 నుంచి 1000 నమూనాలు సేకరిస్తున్నాం. క్లోరిన్‌, ఆమ్లం వంటివి లోపించినట్లు చాలా తక్కువ నమూనాల్లోనే వస్తున్నాయని’ ఇంజినీరింగ్‌ వర్గాలు తెలిపాయి.

ఇన్నర్‌ రింగ్‌రోడ్‌లో ఫ్లోరైడ్‌...

గుంటూరు మహాత్మాగాంధీ ఇన్నర్‌ రింగ్‌రోడ్‌, గోరంట్ల, రెడ్డిపాలెం ప్రాంతాల్లో ఫ్లోరైడ్‌ శాతాలు వెలుగులోకి వచ్చాయి. ఇక్కడ ఎలాంటి నీటి వనరులు లేవు. భూగర్భ జలాలే దిక్కు. ఇటీవల ఆ ప్రాంతం నుంచి బోర్లు వేయించుకోవడానికి నమూనాలు తీసుకొచ్చి పరీక్షలు చేయిస్తే లీటర్‌ నీటిలో ఫ్లోరైడ్‌ శాతం 2.6 మిల్లీ గ్రాములు ఉంది. ఇది చాలా ప్రమాదకరమని, ఈ నీళ్లు కనీసం ఇంట్లో బియ్యం, పప్పులు వంటివి కడుక్కోవటానికి కూడా పనికిరావని హెచ్చరించారు. సాధారణంగా లీటర్‌ నీటిలో ఫ్లోరైడ్‌ కంటెంట్స్‌ గరిష్ఠంగా 1.5 మిల్లీ గ్రాములకు లోపు ఉండాలి. కానీ ఇన్నర్‌ రింగ్‌రోడ్‌లో ఈ శాతాలు ఏకంగా 2.5 మిల్లీ గ్రాములకు పైగా ఉన్నాయి.

Read latest Guntur News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని