logo

దారి దోపిడీలు

గంటల వ్యవధిలో చోటుచేసుకున్న రెండు దారి దోపిడీ ఘటనలు పల్నాడు జిల్లాలో కలకలం రేపాయి. తిరుమల నుంచి వస్తున్న భక్తులతో పాటు దంపతులపై

Updated : 24 May 2022 06:40 IST

గంటల వ్యవధిలో సత్తెనపల్లి, నకరికల్లులో ఘటనలు

సత్తెనపల్లి ఆసుపత్రిలో బాధితులు శ్రీనివాసరావు, గోవిందయ్య

సత్తెనపల్లి, నకరికల్లు, న్యూస్‌టుడే: గంటల వ్యవధిలో చోటుచేసుకున్న రెండు దారి దోపిడీ ఘటనలు పల్నాడు జిల్లాలో కలకలం రేపాయి. తిరుమల నుంచి వస్తున్న భక్తులతో పాటు దంపతులపై దుండగులు దాడి చేసి దొరికిన కాడికి దోచుకున్నారు. నూనుగు మీసాల వయసున్న కుర్రాళ్లు తమపై దాడి చేశారని రెండు ఘటనల్లో బాధితులు చెప్పడంతో ఒకే ముఠా వీటికి పాల్పడిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బాధితులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు రాజుపాలెంకు చెందిన మర్రిబోయిన శ్రీనివాసరావు, చేపర్తి గోవిందయ్య, కర్ర గంగయ్య, దుడుకు యల్లమంద, మర్రిబోయిన ఏడుకొండలు, చేపర్తి తిరుపతిరావు రెండ్రోజుల క్రితం తిరుమల వెళ్లారు. దైవదర్శనం అనంతరం నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్‌లో బయలుదేరి సోమవారం తెల్లవారుజామున 1.15 గంటలకు సత్తెనపల్లి రైల్వేస్టేషన్‌లో దిగారు. నడుచుకుంటూ వస్తున్న వారిని వావిలాల పార్కు మలుపు వద్ద రెండు ద్విచక్ర వాహనాలపై వచ్చిన ఆరుగురు యువకులు వారి చుట్టూ వాహనాలు తిప్పారు. సరదాగా బైకులు నడుపుతున్నారని భక్తులు భావించి ముందుకు వెళ్లారు. కొంచెం దూరం వెళ్లిన తరువాత పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు వద్ద ఆ యువకులు వారిని అటకాయించారు. భయంతో నలుగురు పారిపోయారు. శ్రీనివాసరావు, గోవిందయ్యలను పక్కనే ఉన్న వీధిలోకి తీసుకెళ్లి కర్రలతో దాడి చేశారు. శ్రీనివాసరావు వద్ద రూ.5వేల నగదు, చేతి గడియారం తీసుకెళ్లారు. ఈ విషయమై పట్టణ ఎస్సై అమీనుద్దీన్‌ మాట్లాడుతూ తిరుమల నుంచి వస్తున్న ఆరుగురికి, యువకుల మధ్య బైకుల స్టంట్‌ విషయంలో గొడవ జరిగిందని, ఈ క్రమంలో యువకులు వారిపై దాడి చేసినట్లు తెలిపారు.


ప్రత్యేక బృందాల గాలింపు

సత్తెనపల్లిలో ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్న ఎస్సై అమీనుద్దీన్‌

దారి దోపిడీకి పాల్పడిన దుండగులను పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. తిరుమల వెళ్లి వస్తున్న భక్తులపై సత్తెనపల్లిలో దాడికి పాల్పడిన వారే దంపతులపై కూడా దుశ్చర్యకు పాల్పడ్డారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. సీసీఎస్‌ విభాగం, సివిల్‌ పోలీసులు రంగంలోకి దిగారు. నకరికల్లు ఘటనలో బాధితుడి వద్ద దుండగులు సెల్‌ఫోన్‌ పట్టుకెళ్లారు. ఆ ఫోన్‌ సిగ్నళ్లు, నరసరావుపేట, సత్తెనపల్లి, నకరికల్లు మార్గంలోని కీలక ప్రదేశాల్లో సీసీ పుటేజీలు పరిశీలిస్తున్నారు.


దంపతులపై దాడి చేసి..

నరసరావుపేట ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న భారతి

సత్తెనపల్లిలో ఘటన జరిగిన రెండు గంటల వ్యవధిలో పల్నాడు జిల్లా ఓడరేవు-పిడుగురాళ్ల జాతీయ రహదారిపై నకరికల్లు మండలం శాంతినగర్‌ సమీపంలో ద్విచక్ర వాహనంపై వస్తున్న దంపతులపై దుండగలు దారి దోపిడీకి పాల్పడ్డారు. తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు గ్రామంలోని సిమెంట్‌ కంపెనీలో మిల్లర్‌గా పని చేస్తున్న గొల్ల రామకృష్ణ, భారతి దంపతులు నంద్యాల జిల్లా వెలిగోడు మండలం రేగడిగూడురులో పెళ్లికి హాజరయ్యారు. అక్కడి నుంచి రైలులో బయలుదేరి నరసరావుపేట రైల్వేస్టేషన్‌లో సోమవారం తెల్లవారుజామున 3.30కు దిగారు. ద్విచక్ర వాహనంపై స్వగ్రామానికి బయల్దేరారు. నకరికల్లు మండలం శాంతినగర్‌ సమీపంలోకి రాగానే రెండు బైకులపై ఉన్న ఆరుగురు యువకులు వారిని వెంటాడారు. అసభ్య పదజలంతో వాగ్వాదానికి దిగి బైకును అడ్డుగా ఉంచి దంపతులపై దాడి చేశారు. రాయితో భారతి తలపై మోదారు. ఆమె మెడలోని 35 గ్రాముల బంగారు నానుతాడు, రామకృష్ణ వద్ద సెల్‌ఫోన్‌ కాజేసి పరారయ్యారు. దంపతులు నకరికల్లు పోలీసులకు ఫిర్యాదు చేయగా వారిని నరసరావుపేట వైద్యశాలకు తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సురేష్‌ తెలిపారు.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని