logo

ఒకటి, రెంటికి బిగపట్టుకోవాల్సిందేనా..!

దావోస్‌లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల గురించి గొప్పగా చెప్పుకొచ్చారు. ఇద్దరు వైద్యులను నియమించామని, గ్రామీణులకు చక్కని వైద్యం అందుతోందని,

Updated : 24 May 2022 06:40 IST

కాకుమానులోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం

దావోస్‌లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల గురించి గొప్పగా చెప్పుకొచ్చారు. ఇద్దరు వైద్యులను నియమించామని, గ్రామీణులకు చక్కని వైద్యం అందుతోందని, సౌకర్యాలు బాగా ఉన్నాయన్నారు. క్షేత్ర స్థాయిలో పరిస్థితి వేరుగా ఉంది. సీఎం నివసిస్తున్న గుంటూరు జిల్లాలోని కాకుమాను ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో దాదాపు రెండేళ్లుగా చుక్క వాడుక నీరు రావడం లేదు. తాగు నీరు అసలే లేదు. సీఎం చెప్పినట్లు ఇద్దరు వైద్యులను నియమించినా, ప్రధాన వైద్యుడు ఆయన ఇష్టం వచ్చినప్పుడు ఆసుపత్రికి వస్తారు. వాడుక నీరు లేకపోవడంతో మరుగుదొడ్డికి వెళ్లాలంటే మహిళా వైద్య సిబ్బంది నరకయాతన పడుతున్నారు. ఆస్పత్రిలో పని చేసే ఆయాతో వాడుక నీటిని దూరం నుంచి ఓ డబ్బాలో తెప్పించుకొని మలమూత్ర విసర్జనకు పొదుపు వాడుకోవాల్సిన దుస్థితి నెలకొంది. ఆసుపత్రిలో ఉంటున్న పది మంది మహిళా సిబ్బందితో పాటు ఏవైనా సమావేశాలు జరిగినప్పుడు దాదాపు 56 మంది వరకు వస్తుంటారు. ఆ రోజు వారంతా ఒకటికి, రెంటికి ఇబ్బందులు పడాల్సిందే. ఇక రోగుల పరిస్థితి చెప్పేది కాదు. వారు మరుగుదొడ్డికి వెళ్లే అవకాశం లేక బిగపట్టుకుని కూర్చోవాల్సిందే.

తాగు నీటికీ అవస్థలే..

ఇక తాగునీటి విషయమైతే సరేసరి. రక్త పరీక్షలు చేయాలన్నా, ప్రసవాలు జరపాలన్నా నీరు కావాలి. ఆరోగ్య కేంద్రానికి నీరు సరఫరా చేసే పైపులైను పాడైంది. ఆరోగ్య కేంద్రం ప్రధాన వైద్యుడు ఆ పనులు చేయించలేదు. ఆయన ఆసుపత్రికి వస్తే కదా సమస్యలు తెలిసేది. ఉన్నతాధికారులూ పట్టించుకోవడం లేదు. ప్రధాన వైద్యుడు నెల   రోజులకు పైగా ఆసుపత్రికి రాలేదు. న్యూస్‌టుడే ఈ విషయాన్ని ప్రస్తావించగా సెలవు లేఖ ఇవ్వలేదని చెప్పారు. తర్వాత కొన్ని రోజులకు దీర్ఘకాలిక సెలవు లేఖ ఇచ్చినట్లు డీఎంహెచ్‌వో శోభారాణి తెలిపారు. ప్రస్తుతమున్న ప్రసాద్‌ అనే వైద్యుడికి నిధులు డ్రా చేసే అధికారం ఇవ్వలేదు. పంచాయతీ వారికి సమస్య తెలిపినా పట్టించుకోలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని పక్కనున్న చిలకలూరిపేట నియోజకవర్గంలో ఉంటున్నారు. సీఎం, వైద్యారోగ్య శాఖ మంత్రి ఉన్న జిల్లాలోనే ఇలాంటి పరిస్థితి నెలకొనడం విచారకరం. మరో చిత్రమేమంటే కొన్ని నెలల క్రితం ఈ ఆసుపత్రిని నాడు-నేడు పథకం కింద రూ.18 లక్షలతో పలు పనులు ప్రారంభించి మధ్యలో నిలిపివేశారు.

- న్యూస్‌టుడే, కాకుమాను
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని