logo

రిక్తహస్తం

పాడిరైతుకు జీవనాధారమైన పశువులు మరణిస్తే నష్ట పోయిన రైతుకు తక్షణమే ప్రభుత్వం వైఎస్‌ఆర్‌ పశు నష్ట పరిహార పథకం ద్వారా ఆర్థిక సాయం అందించాలి. మేలుజాతి, దేశవాళీ పశువులకు రూ.30వేలు, నాటు పశువులకైతే రూ.15వేలు వంతున పశుసంవర్థక

Published : 25 Jun 2022 05:35 IST

అన్నదాతకు అందని పశునష్ట పరిహారం

జిల్లాలో 325కి పైగా దస్త్రాలు పెండింగ్‌

పాడిరైతుకు జీవనాధారమైన పశువులు మరణిస్తే నష్ట పోయిన రైతుకు తక్షణమే ప్రభుత్వం వైఎస్‌ఆర్‌ పశు నష్ట పరిహార పథకం ద్వారా ఆర్థిక సాయం అందించాలి. మేలుజాతి, దేశవాళీ పశువులకు రూ.30వేలు, నాటు పశువులకైతే రూ.15వేలు వంతున పశుసంవర్థక శాఖ సహాయాన్ని అందించి పాడి రైతును ఆదుకోవాలి.

న్యూస్‌టుడే, తుళ్లూరు

2019లో రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఏ ఉద్దేశంతోనైతే రాష్ట్ర ప్రభుత్వం పథకాన్ని తీసుకొచ్చిందో అదిప్పుడు నెరవేరడం లేదు. గడిచిన ఏడాదిన్నర నుంచి నష్టపోయిన పశు యజమానులకు పరిహారం అందడం లేదు. ప్రకృతి వైపరీత్యాలు, అనుకోనిరీతిలో పాడిపశువు మరణించినప్పుడు రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు. జీవనాధారం ప్రశ్నార్థకమవుతోంది. 2020లో గుంటూరు జిల్లాలో 415 పశువులు వివిధ కారణాలతో మృతి చెందాయి. ప్రభుత్వం లబ్ధిదారులకు రూ.1.17కోట్లను ఆర్థిక సాయంగా అందించింది. 2021, 2022 సంవత్సరాలకు సంబంధించి ఉమ్మడి గుంటూరు జిల్లాలో 325 పశువులను పాడి రైతులు నష్టపోయారు. వారికి సంవత్సరంన్నర గడిచినా సాయం అందలేదు. తరచూ పశుసంవర్థక శాఖ కార్యాలయాలకు వెళ్లినా అదుగో ఇదుగో అంటున్నారే కానీ ఆర్థిక సాయం అందలేదంటూ లబ్ధిదారులు వాపోతున్నారు.

పథకం లబ్ధి ఇలా...

అన్నదాతలకు ఆసరాగా ఉండే పాడిపశువులు ఎంతో ప్రయోజనాన్ని కల్పిస్తున్నాయి. పంటల సాగుతో పాటు, పాడిపశువుల పెంపంకం ప్రధాన్యతను సంతరించుకొంది.2-10 సంవత్సరాల వయస్సు కలిగిన ఆవులు, 3-12 సంవత్సరాల వయస్సు కలిగిన గేదెలకు వైఎస్‌ఆర్‌ పథకం కింద పరిహారం పొందడానికి అర్హత ఉంటుంది. చెవి పోగు వేయించుకొని వాటి వివరాలను నమోదు చేసుకొన్న పశువులు మాత్రమే ఈ పథకం కిందకు వస్తాయి. ఎటువంటి రుసుం లేకుండా నష్ట పరిహారాన్ని ఆయా రైతుల ఖాతాల్లో జమ చేస్తారు. ఏడాదిలో గరిష్ఠంగా ఒక్కో రైతు కుటుంబానికి ఐదు పశువులకు మాత్రమే నష్ట పరిహారాన్ని అందిస్తారు.

ఏడాదిన్నరగా ఎదురుచూస్తున్నాం

పాడిపశువులే మాకు జీవనాధారం. గతేడాది రూ.లక్ష విలువైన పశువు అనుకోని రీతిలో మృతి చెందింది. ఈ విషయం స్థానిక పశువైద్యాధికారికి వివరించి మృతి చెందిన పాడిపశువు వివరాలను నమోదు చేయించా.పరిహారం కోసం ఎదురుచూస్తూనే ఉన్నా. ఏడాదిన్నర గడుస్తున్నా లబ్ధి చేకూరలేదు.ప్రభుత్వం పాడిరైతులకు అండగా ఉండేందుకే ఈ పథకాన్ని పెట్టామని గొప్పలు చెబుతోంది. పరిహారం అమలు చేయడంలో అధికారులు పట్టనట్లుగా ఉంటున్నారు. - జమ్ముల ఏడుకొండలు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని