logo
Published : 25 Jun 2022 05:35 IST

డీఈవో గైర్హాజరుపై అసంతృప్తి

ఉపాధ్యాయుల డిప్యుటేషన్ల రద్దుకు ఎమ్మెల్సీ లక్ష్మణరావు డిమాండ్‌

సమావేశంలో పాల్గొన్న జడ్పీ ఛైర్‌పర్సన్‌ కత్తెర హెనీ

క్రిస్టినా, ఎమ్మెల్సీ లక్ష్మణరావు, జడ్పీటీసీ సభ్యులు

జిల్లాపరిషత్తు(గుంటూరు), న్యూస్‌టుడే: జిల్లాపరిషత్తు స్థాయీ సంఘ సమావేశానికి గుంటూరు జిల్లా విద్యాశాఖ అధికారి శైలజ గైర్హాజరుపై జడ్పీ సీఈవో శ్రీనివాసరెడ్డి అసహనం వ్యక్తం చేశారు. జడ్పీ ఛైర్‌పర్సన్‌ కత్తెర హెనీ క్రిస్టినా అధ్యక్షతన 1, 2, 4, 7వ స్థాయీ సంఘాల సమావేశాలు శుక్రవారం జరిగాయి. 4వ కమిటీలో వైద్యారోగ్య, విద్యా శాఖలు ఉండటంతో ఆ శాఖల అధికారులను పరిచయం చేసుకోవాలని క్రిస్టినా సూచించారు. జడ్పీ సీఈవో శ్రీనివాసరెడ్డి జోక్యం చేసుకుని గుంటూరు డీఈవో ఎందుకు రాలేదని ప్రశ్నించారు. విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ఏర్పాటు చేసిన సమావేశానికి డీఈవో వెళ్లారని.. ఆమె ప్రతినిధి గోపాల్‌ తెలిపారు. కనీసం ఛైర్‌పర్సన్‌ వద్ద అనుమతి తీసుకోవాలి కదా? జడ్పీ పాఠశాలలు పూర్తిగా జడ్పీ ఆస్తులు. అక్కడ జరిగే అభివృద్ధి పనులు ఛైర్‌పర్సన్‌కి చెప్పాలి కదా? ఒకవేళ డీఈవో ఛైర్‌పర్సన్‌ని కలిసే సమయం లేకుంటే.. డీఈవో కార్యాలయానికి ఛైర్‌పర్సన్‌ వస్తారు? అని తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ కె.ఎస్‌.లక్ష్మణరావు కలుగజేసుకుని మనబడి నాడు- నేడు పనులతో పాటు ఇటీవల ప్రకటించిన పదో తరగతి వార్షిక పరీక్షల్లో విద్యార్థుల ఉత్తీర్ణత వివరాలను చెప్పాల్సిన బాధ్యత డీఈవోపై ఉందన్నారు. సమగ్ర శిక్ష జిల్లా అదనపు సమన్వయకర్త కూడా సమావేశానికి రాకపోవడంపై ఎమ్మెల్సీతో పాటు సీఈవో అసంతృప్తి వ్యక్తం చేశారు. బోయపాలెంలోని డైట్‌లో 14 మందికి గాను 26 మంది ఉపాధ్యాయులు డిప్యుటేషన్‌పై పని చేయడాన్ని లక్ష్మణరావు ప్రశ్నించారు. ఉమ్మడి జిల్లాలో డిప్యుటేషన్‌పై ఆయా కార్యాలయాల్లో కొనసాగుతున్న ఉపాధ్యాయులు, పీఈటీలు, హెచ్‌ఎంలను వారు పనిచేసే పాఠశాలలకు వెనక్కి పంపాలన్నారు. దసరా సెలవులకు ముందే పదో తరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్‌ని అందజేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఛైర్‌పర్సన్‌ తెలిపారు.

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులుగా చేరిన వారు వెంటనే పీజీ విద్య కోసం వెళ్లటంతో రోగులకు వైద్యం చేసేవారు లేకుండా పోతున్నారన్నారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని డీఎంహెచ్‌వోలకు లక్ష్మణరావు సూచించారు.

కాకుమానులోని బీఆర్‌ అంబేడ్కర్‌ గురుకుల బాలికల పాఠశాలలో 400 మంది విద్యార్థినులు చదువుతున్నా వారికి తాగునీటి వసతి లేక ఇబ్బందులు పడుతున్నారని జడ్పీటీసీ సభ్యురాలు గుల్జార్‌ బేగం అన్నారు. ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈని పంపి నివేదిక తెప్పించుకుంటామని సీఈవో చెప్పారు. వడ్లమూడి క్వారీ వద్ద జడ్పీకి చెందిన 45 ఎకరాల భూమిని గత ప్రభుత్వ హయాంలో మట్టిని తవ్వడంతో గుంతలు ఏర్పడినందున వాటిని సరి చేసి వడ్లమూడి- సంగం జాగర్లమూడి గ్రామాల ప్రజలకు తాగునీరు అందించేలా.. సాగునీటి కాలువలు నిర్మించేలా ప్రణాళికలు తయారు చేయాలని ఎమ్మెల్యే కిలారి వెంకటరోశయ్య జల వనరుల శాఖ అధికారులను కోరారు.

భట్టిప్రోలులోని జగనన్న ఇళ్ల కాలనీల్లో 1600 మందికి గృహాలు మంజూరు చేసినా స్థలాలు 5 అడుగుల పల్లంలో ఉండటంతో లబ్ధిదారులు ఇళ్లు నిర్మించుకోవడానికి ముందుకు రావడం లేదని జడ్పీటీసీ సభ్యురాలు తిరువీధుల ఉదయభాస్కరి అన్నారు. మెరక చేయాలని విజ్ఞప్తి చేశారు. లేఔట్‌ని సందర్శించి నివేదిక ఇవ్వాలని గృహనిర్మాణసంస్థ ఏఈకి సీఈవో చెప్పారు.

నూతన జడ్పీ భవనానికి రూ.15 కోట్లు

జిల్లాపరిషత్తు కార్యాలయ భవనం 1954లో నిర్మించడంతో శిథిలావస్థకు చేరడంతో నూతన భవనం నిర్మించేందుకు సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అనుమతి ఇచ్చారని ఛైర్‌పర్సన్‌ క్రిస్టినా చెప్పారు. తాను రూ.10 కోట్లతో అంచనా ప్రతిపాదనలు సీఎంకు అందజేయగా రూ.15 కోట్లు కేటాయించారన్నారు. త్వరలోనే ఉత్తర్వులు జారీ అవుతాయన్నారు. 3, 6వ కమిటీలు జడ్పీ ఉపాధ్యక్షులు శొంఠిరెడ్డి నర్సిరెడ్డి, బత్తుల అనురాధ, 5వ కమిటీ తెనాలి జడ్పీటీసీ సభ్యురాలు పిల్లి ఉమా ప్రణతి అధ్యక్షతన జరిగాయి. ఆయా కమిటీలకు మూడు జిల్లాల అధికారులు హాజరయ్యారు.

Read latest Guntur News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts