logo
Updated : 25 Jun 2022 11:09 IST

ఎంఐజీ ప్లాట్లకు ఈ-లాటరీ

నవులూరు లేఅవుట్‌లో అర్హులకు కేటాయించనున్న సీఆర్‌డీఏ

ఈనాడు - అమరావతి

జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్‌ పథకం కింద మధ్యతరగతి ప్రజల కోసం సీఆర్‌డీఏ ఎంఐజీ లేఅవుట్లను అభివృద్ధి చేస్తోంది. ఇందులో భాగంగా గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలోని నవులూరులో అమరావతి టౌన్‌షిప్‌లోని ప్లాట్లను సిద్ధం చేశారు. వీటిని ఈ ఏడాది జనవరిలో ఆన్‌లైన్‌ ద్వారా అమ్మకానికి ఉంచారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించారు. దరఖాస్తుదారుల్లో అర్హులకు కేటాయించేందుకు శనివారం లాటరీ తీయనున్నారు. మొత్తం 80.46 ఎకరాల విస్తీర్ణంలో 386 ప్లాట్లు వేశారు. వీటిలో 240 చ.గజాలు, 200 చ.గ విస్తీర్ణంలో రెండు రకాల ప్లాట్లు ఉన్నాయి.

104 మంది అర్హులు

కొనుగోలు కోసం ఆన్‌లైన్‌లో 147 మంది దరఖాస్తు చేశారు. నిబంధనల ప్రకారం.. కుటుంబ సభ్యుల అందరి ఆదాయం సంవత్సరానికి రూ. 18 లక్షల లోపు ఉండి, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారే కొనుగోలు చేసేందుకు అర్హులని స్పష్టం చేశారు. ఆదాయాన్ని ధ్రువీకరించే ఐటీ రిటర్న్స్‌ లేదా ఫారం 16 లేదా తహశీల్దార్‌ జారీ చేసిన పత్రాన్ని సమర్పించాలి. వీటికి లోబడి ఉన్న దరఖాస్తుల నుంచి 104 మందిని అర్హులుగా గుర్తించారు. ఒక్కో చదరపు గజం రూ. 17,499 చొప్పున 200 చ.గజాల లేఅవుట్‌ ఖరీదు రూ. 34.99 లక్షలు. 240 చ.గ లేఅవుట్‌ విలువ రూ. 41.99 లక్షలుగా నిర్ణయించారు. ఇందులో 10 శాతం విలువను దరఖాస్తు సమయంలోనే చెల్లించారు. కేటాయించిన నెలలోపు ఒప్పందం ఉంటుంది. ఇది జరిగిన నెలలోపు 30 శాతం, ఆరు నెలలకు మరో 30 శాతం, ఏడాదికి కానీ రిజిస్ట్రేషన్‌ సమయంలో కాని మిగిలిన 30 శాతం మొత్తాన్ని చెల్లించాల్సి ఉంది.

240 చ.గజాల ప్లాట్‌కే మొగ్గు

200 చ.గ విభాగంలో 122, 240 చ.గ విభాగంలో 264 ప్లాట్లను సీఆర్‌డీఏ ఆన్‌లైన్‌లో దరఖాస్తుకు ఉంచింది. వీటిలో 240 చ.గ ప్లాట్లకే ఎక్కువ మంది మొగ్గు చూపారు. వచ్చిన దరఖాస్తుల్లో ఈ విభాగంలో 54 మంది అర్హులుగా గుర్తించారు. 200 చ.గ ప్లాట్లకు 50 మందిని అర్హులుగా తేల్చారు. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం రాయితీలు ప్రకటించడంతో ఐదుగురు దరఖాస్తు చేశారు. వీరికి మొత్తం ప్లాట్లలో 10 శాతం రిజర్వేషన్‌, విలువలో 20 శాతం రిబేట్‌ ఉంది. పెన్షనర్లకు ఐదు శాతం రిజర్వేషన్‌ ఉండడంతో ఈ విభాగం కింద ఒక దరఖాస్తు వచ్చింది. ఈ లేఅవుట్‌లో మౌలిక వసతులను అభివృద్ధి చేయనున్నారు. 80, 60 అడుగుల అనుసంధాన రోడ్లను వేస్తారు. అంతర్గతంగా 40 అడుగులతో సీసీ రోడ్లను నిర్మిస్తారు. కాలిబాటలు, ఎస్టీపీలు, వర్షపు నీటి డ్రెయిన్లు, పార్కులు, పచ్చదనం అభివృద్ధి, వీధి దీపాలు, తదితర సౌకర్యాలను సీఆర్‌డీఏ అభివృద్ధి చేయనుంది. దీనికి సంబంధించి పనులను ప్రజారోగ్య ఇంజినీరింగ్‌ విభాగం పర్యవేక్షించనుంది.

Read latest Guntur News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని