logo

బొల్లి మచ్చకు బెదరొద్దు!

 మచ్చలంటే మన సమాజానికి చిన్నచూపు. అందుకే మన పనితీరు మీదా.. మన వ్యక్తిత్వం మీదా.. చివరికి మన ఒంటి మీద కూడా ఎక్కడా మచ్చ పడకూడదని ప్రయత్నిస్తుంటాం. కొన్ని మచ్చలు మనకు చెప్పిరావు. మన చేతుల్లో ఉండవు. ముఖ్యంగా 

Published : 25 Jun 2022 05:35 IST

ఇది అంటువ్యాధి కాదు

సర్వజనాసుపత్రిలో మెరుగైన చికిత్స

చికిత్సకు ముందు బొల్లి మచ్చలు

గుంటూరు వైద్యం, న్యూస్‌టుడే : మచ్చలంటే మన సమాజానికి చిన్నచూపు. అందుకే మన పనితీరు మీదా.. మన వ్యక్తిత్వం మీదా.. చివరికి మన ఒంటి మీద కూడా ఎక్కడా మచ్చ పడకూడదని ప్రయత్నిస్తుంటాం. కొన్ని మచ్చలు మనకు చెప్పిరావు. మన చేతుల్లో ఉండవు. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది తెల్ల మచ్చలు. బొల్లి మచ్చలు. ఇవేమీ అంటువ్యాధులు కావు. బాధలు పెట్టేవి కావు. ఎవరికీ ఇబ్బందులు తెచ్చేవీ కావు. అయినా.. అనాదిగా మన సమాజం బొల్లి మచ్చలున్నవారి పట్ల చిన్నచూపే చూస్తోంది. నిజానికి బొల్లి మచ్చలు ఎందుకొస్తాయో.. ఎవరికొస్తాయో కచ్చితంగా తెలియదు. వీటిని ఎదుర్కోవడంలో మాత్రం ఆధునిక వైద్యరంగం చాలా పురోగమించింది. ఈ వ్యాధిపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఏటా జూన్‌ 25న ప్రపంచ బొల్లి మచ్చల దినంగా నిర్వహిస్తున్నారు. దీనిపై ‘న్యూస్‌టుడే’ అందిస్తున్న ప్రత్యేక కథనం

సర్వజనాసుపత్రిలో పరిశోధన : సర్వజనాసుపత్రిలోని చర్మ, సుఖ, కుష్ఠు వ్యాధుల చికిత్స విభాగంలో మూడేళ్లుగా ఈ వ్యాధిపై పరిశోధన కొనసాగింది. అధ్యయనం కోసం 1200 మంది రోగులను ఎంపిక చేసుకున్నారు. వీరిలో 60 శాతం మహిళలు, 20 శాతం పురుషులు, 20 శాతం పిల్లలున్నారు. ఈ పిల్లల్లో కూడా ఎక్కువగా బాలికలే ఉండటం గమనార్హం. ఈ వ్యాధితో చికిత్సకు వస్తున్న వారిలో థైరాయిడ్‌ సమస్య పెద్దల్లో 25 శాతం, పిల్లల్లో 16 శాతం ఉన్నట్లు గుర్తించారు. కొందరిలో మధుమేహం ఉన్నట్లు తెలుసుకున్నారు.

చికిత్స తర్వాత

ఎక్కడెక్కడ..? : బొల్లి మచ్చలు సాధారణంగా సూర్మరశ్మి సోకే శరీర భాగాల్లో ఎక్కువగా వస్తుంటాయి. ఎండ తగులుతుండే ముఖం, మెడ, చేతులు, మోచేతులు, మోకాళ్ల వంటి వాటి మీద ఎక్కువ. కొందరికి మర్మాంగాల దగ్గర, చనుమొనల చుట్టూ, చంకల్లో ఇలాంటి ఎండ తగలని మారుమూల ప్రాంతాల్లోనూ వస్తుంటాయి. మృదువైన పెదాల మీద, నోటి లోపల, కనురెప్పల మీదే కాదు, కొందరికి కంట్లోనూ, జుట్టు, కనుబొమ్మలు, గడ్డం వంటివీ తెల్లగా అయిపోతాయి. ఇవి ఒంటి మీద ఏ భాగంలోనైనా రావచ్ఛు

రకరకాలు : బొల్లి మచ్చలు కొందరికి శరీరంలో ఏదో ప్రాంతంలో, ఒక భాగంలోనే వస్తాయి. కొందరికి ఒంటి మీద చాలా భాగాల్లో రావచ్ఛు కొందరికి శరీరం యావత్తూ తెల్గగా అయిపోవచ్ఛు ఇంకొందరికి శరీరంలో ఒకవైపు, అంటే ఒక వైపు చెయ్యి లేదా ముఖంలో ఒకవైపు, ఛాతీ మీద ఒకవైపు, ఇలా రావచ్ఛు వచ్చిన మచ్చలు పెరుగుతుండొచ్ఛు కేవలం పెదాలు, వేళ్ల కొనలకు మాత్రమే వస్తుంది. ఇలా ఎవరికి ఎక్కడ వస్తుందో, ఎవరికి పెరుగుతుందో, ఎవరికి అలాగే ఉండిపోతుందో చెప్పటం కష్టం.

నిర్ధారణ : చాలాసార్లు వైద్యులు చూస్తూనే బొల్లి మచ్చలను ధ్రువీకరిస్తారు. ఒక్కోసారి పుట్టుమచ్చలు కూడా తెల్లగా ఉండొచ్ఛు కాబట్టి నిర్ధారణ కోసం అతినీలలోహత కిరణాల కింద చూస్తారు. దానిలో బొల్లి మచ్చలు మరింత తెల్లగా మెరుస్తూ కనిపిస్తాయి. ఇంకా అనుమానంగా ఉంటే చిన్న ముక్క తీసి పరీక్షకు పంపిస్తారు.

ఉచితంగా కాంతి ప్రసార చికిత్సలు : సర్వజనాసుపత్రిలో ఖరీదైన కాంతి ప్రసార చికిత్సలు ఉచితంగా చేస్తున్నారు.  నేరుగా మచ్చలను యూవీలైట్‌ కింద ఉంచుతారు. దీన్ని 3-4 సార్లు చొప్పున 3-6 నెలల పాటు ఇస్తారు. అక్కడక్కడ చిన్నచిన్న మచ్చలు మాత్రమే ఉన్న వారికి దీంతో మంచి ప్రయోజనం ఉంటుంది. పూవా థెరపీ శరీరమంతా ఎక్కువ భాగం మచ్చలుంటే ఉపయోగపడుతుంది. మాత్రలు వేసుకున్న తర్వాత యూవీ-ఏ లైట్‌ ప్రసరింపజేసే ఛాంబర్‌లోకి రోగిని పంపుతారు. దీనిలో కాంతి ఎంత తీక్షణంగా ఉండాలన్నది లెక్కించి వారానికి 2, 3 సార్లు చొప్పున పెంచుకుంటూ వెళతారు. ఇలా ఆర్నెళ్ల నుంచి ఏడాది వరకూ ఇవ్వచ్చు

పూవా థెరపీ పరికరం​​​​​​​

అపోహలే... అసలు సమస్య

బొల్లి అంటువ్యాధి కాదు. బొల్లి మచ్చలున్నవారి పట్ల సమాజం అపోహలు పెంచుకుంటే.. మచ్చలున్న వారు తమను వేరుగా ఎక్కడ చూస్తారోనన్న భయాలతో నలుగురిలోకి వెళ్లకుండా న్యూనతలోకి జారిపోతుంటారు. మానసికంగా ఎంతో వేదన అనుభవిస్తుంటారు. దీనివల్ల చికిత్సకు ఆలస్యంగా వస్తున్నారు. దీని గురించి ఎటువంటి అనుమానాలూ పెట్టుకోవాల్సిన పనిలేదు. జీజీహెచ్‌లో నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో మెరుగైన చికిత్స అందుతుంది. బాధితులకు ఊరట, స్వాంతన లభించేవిధంగా కౌన్సెలింగ్‌ ఇస్తున్నాం. దీన్ని ఎదుర్కొనేందుకు మార్గాలు ఇప్పుడు చాలానే ఉన్నాయి. కాబట్టి దీనిపై అవగాహన పెంచుకుని చికిత్స వెంటనే పొందితే ఎంతో ప్రయోజనకరం. - ఆచార్య మోహనరావు, డీవీఎల్‌ విభాగం అధిపతి, సర్వజనాసుపత్రి, గుంటూరు

డీవీఎల్‌ విభాగంలో చికిత్స పొందిన వారి వివరాలు : 2019-20లో 1123, 2020-21లో 943, 2021-22లో 847 (కొవిడ్‌ కాలంగా గత రెండేళ్లలో రోగుల సంఖ్య తక్కువగా ఉందని వైద్యులు తెలిపారు).

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని