logo
Published : 25 Jun 2022 05:35 IST

నల్లమడ..రైతుకు దడ

అటకెక్కిన వాగుఆధునికీకరణ పనులు

ముంపుతో ఏటా వేల ఎకరాల్లో పంట నష్టం

వాగు పరిధిలో నీట మునిగిన వరి పంట (పాతచిత్రం)

బాపట్ల, న్యూస్‌టుడే : నల్లమడ వాగు పల్నాడు, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో 168 కి.మీ. దూరం ప్రవహించి సూర్యలంక సమీపంలోని పొగురు వద్ద సముద్రంలో కలుస్తుంది. 2013 అక్టోబరులో వాగుకు భారీ వరద వచ్చింది. అంచనాలకు మించి 42 వేల క్యూసెక్కుల వరద నీరు ప్రవహించడంతో జలవనరుల శాఖ అధికారులు సైతం ఆందోళన చెందారు. వాగులో నీరు పొంగి పొర్లి కొమ్మమూరు కాలువ, ఇతర సాగునీటి కాలువల కట్టలు కొట్టుకుపోయాయి. వాగు కట్టలు తెగి వందల సంఖ్యలో గండ్లు పడ్డాయి. వేల ఎకరాల్లో పంట మునిగి రైతులకు తీరని నష్టం జరిగింది. అప్పటి నుంచి ఏటా ముప్పు పొంచి ఉన్నా, యంత్రాంగానికి మాత్రం కనువిప్పు కలగడం లేదు. రైతుల కష్టాలను పట్టించుకోవాల్సిన పాలకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.

జలవనరుల శాఖ అధికారులు ప్రైవేటు కన్సల్టెన్సీ ద్వారా సర్వే చేయించి వాగును 350 సీ వాల్యూ నుంచి 500 సీ వాల్యూ వరకు విస్తరించడానికి 438 ఎకరాల భూమి కావాలని ప్రతిపాదనలు రూపొందించి అప్పటి ఉమ్మడి గుంటూరు జిల్లా కలెక్టర్‌కు అందజేశారు. 2019 మే 30న వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. నెల రోజుల్లోనే పనులు రద్దు చేసింది. నల్లమడ రైతు సంఘం ప్రతినిధులు మంత్రులు, ప్రజాప్రతినిధులను కలిసి వాగు ఆధునికీకరణ పనులు చేపట్టాలని వినతి పత్రాలు అందజేశారు. మూడేళ్లు గడిచినా పనుల ఊసే ఎత్తడం లేదు. 2020, 2021 నవంబరులో తుపాను, వాయుగుండాల ప్రభావంతో భారీవర్షాలు కురిశాయి. వాగు, మురుగు కాలువలు అధ్వానంగా ఉండటం వల్ల పొలాల్లో నుంచి వారం, పది రోజుల వరకు నీరు బయటకు వెళ్లలేదు. నీట మునిగి ధాన్యం రంగు మారడంతో రైతులు రూ.కోట్లలో నష్టపోయారు. బాపట్ల మండలం జిల్లెళ్లమూడి, తూర్పు, పడమర పిన్నిబోయినవారిపాలెం వద్ద వాగు కట్టలు చాలా బలహీనంగా ఉన్నాయి. పెదనందిపాడు, కాకుమాను మండలాల్లో మట్టి కోసం అక్రమ తవ్వకాలతో కట్టలకు తూట్లు పొడుస్తున్నారు. భారీ వరదలు మరోసారి వస్తే బలహీనంగా ఉన్న కట్టలు కొట్టుకుపోతాయి. పంట నష్టం భారీగా జరిగి రైతులకు కోలుకోలేని నష్టం జరుగుతుంది. ఆధునికీకరణ పనుల ఆవశ్యకతను ప్రభుత్వం గుర్తించి వెంటనే భూసేకరణ చేపట్టి వాగును విస్తరించి ముంపు సమస్యను పరిష్కరించాలని అన్నదాతలు కోరుతున్నారు.

వరద సమయంలో వాగులో నీటి పరవళ్లు

నల్లమడ వాగు పనులు రూ.360 కోట్ల వ్యయంతో చేపట్టేందుకు గత ప్రభుత్వ హయాంలో పాలనాపరమైన ఆమోదం లభించింది. భూసేకరణ దశలో ప్రభుత్వం మారి వైకాపా అధికారంలోకి వచ్చింది. 2019 జూన్‌లో ఆధునికీకరణ పనులను రద్దు చేసింది. మూడేళ్లుగా భూసేకరణ దస్త్రం మూలనపడింది. నిధులు కేటాయించలేదు. పనుల ఊసే ఎత్తడం లేదు. వరుసగా రెండేళ్ల పాటు నవంబరు నెలలో వచ్చిన తుపాన్ల ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు పొలాల నుంచి నీరు వారం రోజులు బయటకు పోలేదు. వేల ఎకరాల్లో వరి పైరు ముంపు బారినపడి కంకులకు మొలకలు వచ్చాయి. ధాన్యం రంగుమారి అన్నదాతలు తీవ్రంగా నష్టపోయారు. బాపట్ల శివారునున్న జిల్లెళ్లమూడి గ్రామం నాలుగు రోజులు జలదిగ్బంధనంలో చిక్కుకుంది. బాపట్ల పట్టణంలో 40 శాతం కాలనీలు ముంపు బారినపడ్డాయి. లక్షన్నర ఎకరాల్లో వరి, మిరప, పత్తి పంటలు తుడిచిపెట్టుకుపోయాయి. 2016లో మరోసారి వరదలు వచ్చి కట్టలు తెగి గండ్లు పడ్డాయి. 2017లో అప్పటి ప్రభుత్వం ఆధునికీకరణ పనులకు పచ్చజెండా ఊపి, భూసేకరణ నిమిత్తం తొలి విడతలో రూ.180 కోట్లు మంజూరు చేస్తూ పాలనాపరమైన ఆమోదం తెలిపింది.

నిధులు కేటాయించగానే పనులు

ప్రభుత్వం నిధులు కేటాయించగానే నల్లమడ వాగు ఆధునికీకరణ పనులు చేపడతాం. రెవెన్యూ శాఖ భూసేకరణ చేపట్టాల్సి ఉంది. ఈ ప్రక్రియ పూర్తయితే పనులు ప్రారంభించవచ్ఛు గతంలో రూపొందించిన అంచనా వ్యయం పెరిగే అవకాశం ఉంది. వాగు కట్టలు బలహీనంగా ఉన్న ప్రాంతాల్లో పటిష్ఠతకు చర్యలు చేపడతాం. - మురళీకృష్ణ, జిల్లా జలవనరుల శాఖాధికారి

నల్లమడ వాగు గరిష్ఠ వరద నీటి ప్రవాహ సామర్థ్యం : 24 వేల క్యూసెక్కులు

ఆధునికీకరణ పనులుపూర్తి చేస్తే గరిష్ఠ వరద నీటి ప్రవాహ సామర్థ్యం : 42 వేల క్యూసెక్కులు

భూసేకరణకు కావాల్సిన భూమి : 438 ఎకరాలు

మూడు జిల్లాల్లోవాగు ముంపుప్రభావిత ఆయకట్టు : లక్షన్నర ఎకరాలు

Read latest Guntur News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని