logo

పోటీ పరీక్షల కాలం.. ఒత్తిడి అధిగమిస్తేనే విజయం

జాతీయస్థాయిలో ఎన్‌టీఏ జేఈఈ మెయిన్స్‌, అడ్వాన్స్‌, నీట్‌(యూజీ) పీజీ పరీక్షలు నిర్వహించి ప్రతిష్టాత్మకమైన విద్యాసంస్థల్లో బీటెక్‌, ఎంబీబీఎస్‌లో ప్రవేశాలు కోరుకునే విద్యార్థులకు ఫలితాల ఆధారంగా ర్యాంకులు ఇస్తుంది.

Published : 27 Jun 2022 06:01 IST

* నరసరావుపేటకు చెందిన ఒక విద్యార్థి గతంలో జేఈఈ ప్రధాన పరీక్షల్లో నూరు శాతం మార్కులు సాధించాడు. తర్వాత అడ్వాన్స్‌ పరీక్షలో శక్తి మేర రాణించలేకపోయాడు. ప్రతిభావంతుడైన విద్యార్థి రెండేళ్లు ఒకే లక్ష్యంతో ఒకే దినచర్యను అమలు చేశాడు. అయినా ఫలితం ఆశాజనకంగా లేదు. ఒత్తిడిని నియంత్రించుకునే క్రమంలో విఫలమయ్యాడు.


* గుంటూరుకు చెందిన ఒక కార్పొరేట్‌ కళాశాలలో నలుగురు విద్యార్థినులు నీట్ పరీక్ష కోసం కృషి చేశారు. పరీక్ష దగ్గరకు వస్తున్న సమయంలో ఒకే గదిలో ఉంటూ అప్పటికి వరకూ బాగా రాణిస్తున్న విద్యార్థినులు ఒక్కసారిగా వెనకబడ్డారు. తప్పనిసరిగా నీట్‌లో మంచి ర్యాంకు సాధించే సామర్థ్యం వారికి ఉంది. అయితే ఒక్కరికి కూడా బీ క్యాటగిరీలో సైతం సీట్లు రాలేదు.


న్యూస్‌టుడే, నరసరావుపేట అర్బన్‌: జాతీయస్థాయిలో ఎన్‌టీఏ జేఈఈ మెయిన్స్‌, అడ్వాన్స్‌, నీట్‌(యూజీ) పీజీ పరీక్షలు నిర్వహించి ప్రతిష్టాత్మకమైన విద్యాసంస్థల్లో బీటెక్‌, ఎంబీబీఎస్‌లో ప్రవేశాలు కోరుకునే విద్యార్థులకు ఫలితాల ఆధారంగా ర్యాంకులు ఇస్తుంది. దీంతోనే ఐఐటీలు, ఎయిమ్స్‌, జిప్‌మర్‌ తదితర సంస్థల్లో ప్రవేశాలు దక్కుతాయి. ఏటా దేశవ్యాప్తంగా సుమారు 10 లక్షల మంది విద్యార్థులు ప్రవేశ పరీక్షలు రాస్తుంటారు. పరీక్ష ముందు వరకూ అత్యంత ప్రతిభ చూపిన విద్యార్థులు సైతం పోటీ పరీక్షల్లో శక్తి మేరకు రాణించలేక విఫలమవుతున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో బైపీసీ ఏటా 30వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరిలో దాదాపు 20వేల మంది వరకూ నీట్‌కు సన్నద్ధమవుతారు. వీరితో పాటు లాంగ్‌టర్మ్‌ శిక్షణ పొందే విద్యార్థులు మరో 2వేల వరకూ ఉంటారు. జేఈఈ పరీక్షకు కూడా అంతకుమించి విద్యార్థులు హాజరవుతారు. జేఈఈ ప్రధాన పరీక్షలు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. నీట్‌ పరీక్ష జులై 17న జరగనుంది. జేఈఈ అడ్వాన్స్‌ పరీక్షలు ఆ తర్వాత నెలలో ఉంటాయి.


భావోద్వేగాల  అదుపుతో..

విజేతలకు పరాజితులకు ఉన్న తేడా స్వల్పమే. తల్లిదండ్రుల అవగాహన లేమి, ఇతరులతో పోల్చుకునే లక్షణం, అధ్యాపకుల వ్యవహారశైలి ఇవన్నీ విద్యార్థులపై ఒత్తిడి పెంచుతాయి. దాన్ని ఆశావహ దృక్పథంతో అధిగమించి రాణించవచ్చని సైకాలజిస్టులు చెబుతున్నారు. బావోద్వేగాలను అదుపు చేసుకోవాలని సూచిస్తున్నారు. వారి సూచనలు..

* లక్ష్య సాధనకు పూర్తిస్థాయిలో మానసికంగా సిద్ధం కావాలి. విద్యార్థికి కమిట్‌మెంట్‌ ఉంటే ఒత్తిడి ఉండదు.

* విద్యార్థి వ్యక్తిగతంగా తయారు చేసుకున్న ప్రణాళికలను తప్పనిసరిగా పూర్తి చేయాలి.

* విషయపరంగా స్పష్టత ఉండాలి. తెలియని అంశాన్ని తెలుసుకునే ప్రయత్నం అవసరం. స్పష్టత లోపిస్తే తర్వాత అంశాల్లో  స్పష్టత ఉండదు. దీనివల్ల పరీక్షల్లో విఫలమవుతారు.

* ఎప్పుడూ ఆనందంగా ఉండాలి.

* నిత్యం అరగంట పాటు వ్యాయామం చేయాలి.

* తల్లిదండ్రులు, అధ్యాపకులు విద్యార్థులను ప్రోత్సహించి అభినందించాలి. తద్వారా విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.

* సైకాలజిస్టులు ఒత్తిడిని అధిగమించేందుకు ‘డోస్‌’ అనే శాస్త్రీయమైన విధానాన్ని అమలుకు ప్రతిపాదిస్తున్నారు. డోస్‌ అంటే విద్యార్థులను మానసికంగా ప్రేరేపించే నాలుగు రకాల హార్మోన్లుగా గురించారు.  ఇది విద్యార్థులను అభినందించడం, తల్లిదండ్రుల స్పర్శతో హార్మోన్లు విడుదల అవుతాయి. డి- డొఫోమైన్‌, ఓ-ఆక్సిటోసిన్‌, ఎస్‌- సెరిటోలిం, ఈ- ఎండోఫిన్‌ ఈ నాలుగు హార్మోన్లతో ఒత్తిడి నుంచి దూరమై విద్యార్థి  ఆశావహ దృక్పథంలోకి వస్తాడు.


సవాళ్లు అధిగమిస్తేనే..

-డాక్టర్‌ ప్రత్యూష సుబ్బారావు, సైకాలజిస్టు, గుంటూరు

ఉన్నతమైన లక్ష్యాలను ఎంచుకున్న వారికి సవాళ్లు ఎదురవుతాయి. వాటిని అధిగమిస్తేనే విజయం దక్కుతుంది. భావోద్వేగాలను అదుపు చేసుకుంటే మంచి ఫలితాలు సాధించేందుకు అవసరమైన శక్తి సమకూరుతుంది. పరీక్ష సమయంలో భయపడడం, ఆందోళనకు గురవడంతో ఉపయోగం ఉండదు. ప్రశాంత చిత్తంతో పరీక్ష రాస్తే ఎక్కువ మార్కులు సాధించగలుగుతారు. లేకుంటే తెలిసిన సమాధానాలే గుర్తించలేక నష్టపోతారు. ఏడాది పాటు చదివిన చదువు సరిపోతుంది. పరీక్ష ముందు తప్పులు చేయకుండా ఎలా రాయాలన్న అంశంపై దృష్టి ఉండాలి. అందుకు తగిన సాధన చేయాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని