logo

పునాదికే పుట్టెడు కష్టాలు

జగనన్న కాలనీల్లో కనీస మౌలిక వసతులు కల్పించకపోవడంతో లబ్ధిదారులు పడరాని పాట్లు పడుతున్నారు. ఆర్థిక ఇబ్బందులతో కాలనీల్లో పేదల గృహ నిర్మాణం నత్తనడకన సాగుతోంది. ఇళ్ల నిర్మాణంపై జిల్లా పాలనాధికారి వారానికి రెండుసార్లు

Published : 27 Jun 2022 06:01 IST
జగనన్న కాలనీల్లో లోతట్టున ఇంటి స్థలాలు
గృహ నిర్మాణానికి అప్పుల పాలవుతున్న పేదలు
బాపట్ల, రేపల్లె అర్బన్‌, న్యూస్‌టుడే
మెరక చేయని ఇంటి స్థలంలో స్తంభాల నిర్మాణానికి ఇనుప చువ్వలు పెట్టి వదిలేసిన దృశ్యం

* బాపట్ల పట్టణ పరిధిలోని జగనన్న కాలనీ మూడు లేఅవుట్లలో 3,298 గృహాలు మంజూరు చేశారు. మూలపాలెం లేఅవుట్లో మాత్రమే కొంతమేర మెరకలు వేశారు. ప్యాడిసన్‌పేట, బేతనీకాలనీ లేఅవుట్లలో మెరకలు వేయలేదు. మెరకలు చేయడానికి రూ.5 కోట్లతో ప్రతిపాదనలు పంపినా నిధులు మంజూరు కాలేదు. లోతట్టు ప్రాంతంలో ఇంటి స్థలం ఇవ్వడంతో మెరక వేసి పునాది నిర్మాణానికే రూ.రెండు లక్షలు ఖర్చవుతోంది. దీంతో చాలామంది శంకుస్థాపన చేసి వదిలేశారు.


* రేపల్లె జగనన్న కాలనీల్లో మౌలిక వసతులు లేవు. నీటి కోసం పైప్‌లైన్లు వేసే పనులు కొనసాగుతున్నాయి. బాపట్ల ప్యాడిసన్‌పేట లేఅవుట్లో  లబ్ధిదారులు రూ.5 వేల నుంచి రూ.6 వేలు ఖర్చు చేసి బోరు వేసుకుంటున్నారు. భూగర్భ జలం ఉప్పగా ఉండటంతో బయట నుంచి ట్యాంకర్ల ద్వారా నీరు తెచ్చుకోవాల్సి వస్తోంది. ఉప్పగా ఉన్న నీటినే ఇంటి నిర్మాణానికి వాడుతున్నారు. పురపాలక సంఘం ద్వారా కొంతమేర ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేస్తున్నా సరిపోవడం లేదు.


జగనన్న కాలనీల్లో కనీస మౌలిక వసతులు కల్పించకపోవడంతో లబ్ధిదారులు పడరాని పాట్లు పడుతున్నారు. ఆర్థిక ఇబ్బందులతో కాలనీల్లో పేదల గృహ నిర్మాణం నత్తనడకన సాగుతోంది. ఇళ్ల నిర్మాణంపై జిల్లా పాలనాధికారి వారానికి రెండుసార్లు సమీక్ష నిర్వహిస్తూ పురోగతి తక్కువగా ఉందని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ఇంటి పనులు ప్రారంభించాలని లబ్ధిదారులపై అధికారులు తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు. నిర్మాణం ప్రారంభించకపోతే ఇంటి స్థలం వెనక్కి తీసుకుంటామని అధికారులు హెచ్చరిస్తుండటంతో చేసేది లేక పేదలు బంగారం తాకట్టు పెట్టి, అధిక వడ్డీలకు అప్పులు చేసి తెచ్చిన నగదుతో పునాది నిర్మిస్తున్నారు.

తీర ప్రాంతంలోని పేదల ఇళ్ల నిర్మాణానికి కేటాయించిన కాలనీలు లోతట్టులో ఉన్నాయి. మెరకలు తోలిస్తామని అధికారులు చెబుతున్నారే తప్ప, ఆచరణలో ముందడుగు వేయడం లేదు. మరోవైపు ఇంటి నిర్మాణం ప్రారంభించాలని అధికారులు మాత్రం ఒత్తిడి చేస్తున్నారు. పోనీ లబ్ధిదారులు స్వయంగా మెరకలు చేసుకోవడానికి బుసక, మట్టి దొరకడం లేదు. టిప్పర్‌ బుసక కోసం రూ.12 వేలు చెల్లించాల్సి వస్తోంది. అంత స్థోమత లేని పేదలు ఆందోళన చెందుతున్నారు. తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో పేదలు నిర్మాణ పనులు ప్రారంభించకపోవడంతో ఇళ్ల స్థలాల్లో పిచ్చిమొక్కలు, గడ్డి పెరిగి చిట్టడవిని తలపిస్తున్నాయి. చీరాలలోనూ జగనన్న కాలనీల్లో మౌలిక వసతుల కొరతతో ఇళ్ల నిర్మాణానికి పేదలు నానా అవస్థలు పడుతున్నారు. బాపట్లలో ప్రధాన రోడ్డు వరకు మాత్రమే కరెంటు స్తంభాలు వేశారు. అంతర్గత రహదారుల్లో ఇటీవలే కొన్నిచోట్ల వేసినా తీగలు లాగలేదు. ప్రధాన రహదారిపై ఉన్న స్తంభం నుంచి కరెంటు సర్వీస్‌ వైరును వంద మీటర్ల దూరంలోని ఇంటి నిర్మాణ జరిగే స్థలం వరకు కొనుగోలు చేయటానికి రూ.నాలుగు వేలు ఖర్చు అవుతోంది. అద్దంకి, భట్టిప్రోలు మండలం వెల్లటూరులో జగనన్న కాలనీల్లో విద్యుత్తు సౌకర్యం కల్పించకపోవడంతో నిర్మాణ సామగ్రి చోరీకి గురవుతున్నాయి.

ఆర్థిక ఇబ్బందులతో బాపట్లలో అసంపూర్తిగా  నిలిచిన ఇంటి నిర్మాణం

అందని నిర్మాణ సామగ్రి

ఇంటి నిర్మాణం ప్రారంభించడానికి గృహనిర్మాణ శాఖ అధికారులు ఇనుము, సిమెంటు, ఇసుక అందజేస్తారు. బాపట్లలోని ఈ శాఖ గోదాములో సిమెంటు, ఇనుము నిల్వలు లేవు. గృహ నిర్మాణ పనులు ప్రారంభించాలని ఒత్తిడి తెస్తున్న అధికారులు సిమెంటు, స్టీలు ఇవ్వడం లేదు. పేదలు బయట అప్పు చేసి కొనుగోలు చేసి తెచ్చి నిర్మాణ పనులు ప్రారంభిస్తున్నారు. సిమెంటు బస్తాకు రూ.400 పైన చెల్లించాల్సి వస్తోంది. ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం రూ.1.80 లక్షలు ఇస్తుండగా, ఈ సొమ్ము ఏ మాత్రం సరిపోవడం లేదు. పేదల గృహ నిర్మాణానికి రూ.ఐదు లక్షలపైన ఖర్చు అవుతోంది. బహిరంగ మార్కెల్లో నిర్మాణ సామగ్రి ధరలు భారీగా పెరిగాయి. ప్రభుత్వం ఇచ్చే ఇసుక సరిపోవడం లేదు. నాణ్యత లేదని లబ్ధిదారులు బయట ట్రాక్టర్‌ ట్రక్కు ఇసుకకు రూ.5 వేలు చెల్లించి కొనుగోలు చేస్తున్నారు. పునాది నిర్మాణ పనులు చేపట్టిన తర్వాత ప్రభుత్వం మొదటి బిల్లు కింద రూ.60 వేలు ఇస్తుండగా లబ్ధిదారుడికి రూ.రెండు లక్షల ఖర్చు అవుతోంది. చేతిలో చిల్లి గవ్వ లేక పనులు అసంపూర్తిగా నిలిచిపోతున్నాయి.


త్వరలోనే సిమెంట్‌, ఇనుము అందిస్తాం

- ప్రసాద్‌, గృహ నిర్మాణ శాఖ పీడీ

జగనన్న కాలనీల్లో రహదారులు, పైప్‌లైన్ల నిర్మాణం, కరెంటు లైన్లు వేసే పనులు జరుగుతున్నాయి. మౌలిక వసతులు కల్పిస్తున్నాం. ప్రస్తుతం సిమెంటు, ఇనుము అందుబాటులో లేదు. సాధ్యమైనంత త్వరగా తెప్పించి లబ్ధిదారులకు అందజేస్తాం. ఇళ్ల నిర్మాణంలో తలెత్తుతున్న సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడతాం. ఇళ్ల స్థలాలు పొందిన వారంతా వెంటనే నిర్మాణ పనులు చేపట్టాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని