logo

పల్లె ఖాతా నిండుకుంది!

 నిధుల కొరతతో పంచాయతీలు ఈసురోమంటున్నాయి. పారిశుద్ధ్య నిర్వహణలో భాగంగా గ్రామాల్లో మురుగు కాల్వలు, తాగునీటి ట్యాంకులు, కొళాయిల చుట్టూ శుభ్రం చేసి తరచూ బ్లీచింగ్‌ పౌడరు చల్లాలి.

Published : 27 Jun 2022 06:01 IST

బ్లీచింగ్‌ కొనుగోలుకూ నిధులు కరవే
పడకేస్తున్న పారిశుద్ధ్యం

రేపల్లె అర్బన్‌, బాపట్ల అర్బన్‌, న్యూస్‌టుడే: నిధుల కొరతతో పంచాయతీలు ఈసురోమంటున్నాయి. పారిశుద్ధ్య నిర్వహణలో భాగంగా గ్రామాల్లో మురుగు కాల్వలు, తాగునీటి ట్యాంకులు, కొళాయిల చుట్టూ శుభ్రం చేసి తరచూ బ్లీచింగ్‌ పౌడరు చల్లాలి. వర్షాకాలం నేపథ్యంలో దోమల నివారణకు ముందస్తు చర్యల్లో భాగంగా ఫాగింగ్‌ చేయాలి. ప్రభుత్వ నిబంధనల మేరకు 15 రోజులకోసారి టాం్యకులు శుభ్రం చేయాలి. బ్లాక్‌ బోర్డు ఏర్పాటు చేసి శుభ్రం చేసిన తేదీ నమోదు చేయాలి. ఈ ప్రక్రియ సజావుగా సాగాలంటే పంచాయతీల ఖాతాల్లో నిధులుండాలి. కానీ ఖాతాలు ఖాళీగా ఉండటంతో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి.

బిల్లులు మంజూరుకాక లబోదిబో..

పంచాయతీల్లో నూతన పాలకవర్గాలు ఏర్పడి ఏడాది దాటినా ఇంతవరకు పంచాయతీల ఖాతాలకు ఏ రూపంలోనూ నిధులు జమ కాలేదు. కేంద్రం మంజూరు చేసిన 14, 15వ ఆర్థిక సంఘాల నిధులను రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. ఫలితంగా సాధారణ నిధులు మినహా గ్రామ పంచాయతీలకు ఆదాయ వనరులు లేవు. సాధారణ నిధుల కింద ఇంటి, నీటి కొళాయి పన్ను, చెరువుల వేలంపాట ద్వారా వచ్చే సొమ్ము మాత్రమే ఖాతాల్లో జమవుతోంది. అవి కూడా బిల్లులు సక్రమంగా పాస్‌కాక సర్పంచులు అల్లాడుతున్నారు. ఈ క్రమంలో బ్లీచింగ్‌ పౌడరు కొనలేని పరిస్థితి నెలకొందని వాపోతున్నారు. గ్రామాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు పర్యటించేటప్పుడు మాత్రమే వీధుల్లో చెత్తను తొలగించి అప్పోసొప్పో చేసి తూతూమంత్రంగా బ్లీచింగ్‌ చల్లిస్తున్నారు.

పొంచి ఉన్న వ్యాధుల ముప్పు

సాధారణంగా జూన్‌, జులైలో వానలు కురిసి వాతావరణంలో మార్పుతో అంటువ్యాధులు విజృంభిస్తుంటాయి. ప్రత్యేక పారిశుద్ధ్య చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. అయితే, నిధుల లేమితో ఇబ్బంది ఎదురవుతోంది. మురుగు కాల్వల్లో రోజులతరబడి మురుగు తిష్ఠ వేయడంతో దోమల ఉత్పత్తికి నిలయంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో పారిశుద్ధ్య సమస్య ఉత్పన్నమవుతోంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే వర్షాకాలంలో సమస్యలు ఎదుర్కోక తప్పదని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.


ప్రత్యేక దృష్టి పెట్టాం

- తాతా శివశంకరరావు, డీఎల్పీవో

పంచాయతీల్లో నిధుల కొరత ఉన్న మాట వాస్తవమే. పారిశుద్ధ్య సమస్య ఉత్పన్నం కాకుండా ప్రత్యేక దృష్టి సారించాం. సాధారణ నిధులు వెచ్చించి సమస్య అధిగమిస్తున్నాం. పలుచోట్ల కొందరు సర్పంచులు, కార్యదర్శులు సొంత సొమ్ముతో పనులు చేయిస్తున్నారు. వ్యాధులు ప్రబలకుండా మురుగు కాల్వల్లో పూడిక తీయించి, చెత్తాచెదారం పేరుకోకుండా పటిష్ఠ చర్యలు తీసుకుంటున్నాం.


ఆదాయం మూరెడు.. ఖర్చు బారెడు

పంచాయతీల పరిస్థితి ఆదాయం మూరెడు.. ఖర్చు బారెడు అన్న చందాన ఉంది. అయిదు వేలకుపైగా జనాభా కలిగిన మేజరు పంచాయతీల్లో పారిశుద్ధ్యానికి, క్లాప్‌మిత్ర, క్లాప్‌షెడ్‌ మిత్ర (గ్రీన్‌ అంబాసిడర్లు) వేతనాలకు నెలకు సగటున రూ.1.50 లక్షలు, రెండు వేల జనాభా కంటే తక్కువ ఉన్న మైనరు పంచాయతీల్లో రూ.40 వేల మేరకు ఖర్చవుతోంది. ఇంటి, నీటి కొళాయి పన్ను కింద మేజరు పంచాయతీకి జనాభా ప్రాతిపదికన రూ.8 లక్షల నుంచి రూ.12 లక్షలు, వెయ్యి నుంచి ఐదు వేల జనాభా ఉన్న మైనరు పంచాయతీకి రూ.80 వేల నుంచి రూ.4 లక్షల ఆదాయం సమకూరుతుంది. సాధారణ నిధులను పూర్తిగా పారిశుద్ధ్య నిర్వహణకే వినియోగించినా సరిపోని పరిస్థితి నెలకొంది. ఇంటింటికీ చెత్తపన్ను వసూలు చేస్తున్నా రూ.20 వేల నుంచి రూ.50 వేలు మించి రావడం లేదని సిబ్బంది చెబుతున్నారు. చాలా పంచాయతీల్లో సర్పంచులు గౌరవం కాపాడుకోవడానికి అప్పులు చేసి బ్లీచింగ్‌ పౌడరు కొంటున్నారు. మరికొందరు సొంత సొమ్ముతో తాగునీటి పైపుల మరమ్మతులు తదితర పనులు చేయించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కసారి బ్లీచింగ్‌ కొనాలంటూ రూ.వేలు వెచ్చించాల్సి వస్తోందని వాపోతున్నారు. గతేడాది నవంబరు నుంచి పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు రావడం లేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని