logo

నేరాలు నియంత్రించేలా.. ప్రమాదాలు నివారించేలా..

పల్నాడు జిల్లాలో శాంతిభద్రతల పర్యవేక్షణను పోలీసు శాఖ సవాలుగా తీసుకుంది. నేరాలు, రోడ్డు ప్రమాదాలు అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ఆయా ఘటనల్లో నేరస్థులను పట్టుకునేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటున్నారు.

Published : 27 Jun 2022 06:01 IST
జిల్లా కేంద్రంలో సీసీ కెమెరాలతో నిఘా
అన్ని పట్టణాల్లో ఏర్పాటుకు సన్నాహాలు
న్యూస్‌టుడే, నరసరావుపేట టౌన్‌

పల్నాడు జిల్లాలో శాంతిభద్రతల పర్యవేక్షణను పోలీసు శాఖ సవాలుగా తీసుకుంది. నేరాలు, రోడ్డు ప్రమాదాలు అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ఆయా ఘటనల్లో నేరస్థులను పట్టుకునేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటున్నారు. జిల్లా కేంద్రమైన నరసరావుపేట పట్టణ ప్రాంతాన్ని పూర్తిగా మూడోనేత్రాల (సీసీకెమెరా) పరిధిలోకి తెచ్చారు. పట్టణంలోని ప్రతి ప్రదేశంలో ప్రతిక్షణం పోలీసు శాఖ పర్యవేక్షణ ఉంటోంది. ఈ నెల 14న ఎస్పీ రవిశంకర్‌రెడ్డి పట్టణంలో నిఘా కోసం సీసీ కెమెరాలను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ప్రజల రక్షణ, భద్రతలో మూడో నేత్రం ఇక కీలకంగా వ్యవహరించనుంది.

జిల్లా కేంద్రమైన నరసరావుపేటలో క్షణానికో వాహనం పరుగులు తీస్తుంది. ఇతర ప్రాంతాల నుంచి ప్రజల రాకపోకల రద్దీ పెరిగింది. పరిపాలన వ్యవహారాల నిమిత్తం జిల్లా వాసులతో పాటు అధికారులు, ప్రజాప్రతినిధుల తాకిడి అధికమైంది. అదే సమయంలో గతం కంటే ఇప్పుడు నేరాలు, దొంగతనాలు, ప్రమాదాలు అధికంగా చోటుచేసుకుంటున్నాయి. సిబ్బంది సంఖ్య తక్కువగా ఉండడంతో పాటు ఉన్న వారిని ఉన్నతాధికారుల సేవలకు వినియోగిస్తున్నారు. గతి తప్పుతున్న నిఘాను పటిష్ఠ పరిచేందుకు చర్య చేపట్టారు. చిలకలూరిపేట, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, గురజాల, మాచర్ల, వినుకొండలో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఎస్పీ పోలీసు అధికారులను ఆదేశించారు.

ప్రతి కదలిక నిక్షిప్తం

జిల్లా కేంద్రమైన నరసరావుపేట పట్టణంలో రెండు పోలీసు స్టేషన్లు, శివారు ప్రాంతం గ్రామీణ పోలీసు స్టేషన్‌ పరిధిలో సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు. కోట సెంటర్‌, మల్లమ్మ సెంటర్‌, శివుడి బొమ్మ సెంటర్‌, గడియార స్తంభం, మయూరి సెంటర్‌, పురపాలక సంఘ కార్యాలయం, మార్కెట్‌, బ్యాంకులు, రైల్వే స్టేషన్‌, బస్టాండ్‌, బ్రాందీ షాపులు, బార్‌, రెస్టారెంట్లు వద్ద కెమెరాలను పెట్టించారు. చిలకలూరిపేట రోడ్డు, వినుకొండ రోడ్డు, సత్తెనపల్లి రోడ్డు, పిడుగురాళ్ల రోడ్డు, జొన్నలగడ్డ రోడ్డు, ఆర్కే జంక్షన్‌, యలమంద రోడ్డు ప్రవేశ మార్గంలో, కోటప్పకొండ పుణ్యక్షేత్రంలో వాహనాల రాకపోకలు, జనసంచారాన్ని పర్యవేక్షించేందుకు వీలుగా మొత్తం 130 కెమెరాలు ఏర్పాటు చేశారు. ఇందులో నిక్షిప్తమైన దృశ్యాలు ఏడాది కాలం పాటు నిల్వ చేసుకునేందుకు అవకాశముంది.

పోలీసు స్టేషన్‌లో పర్యవేక్షణ

నరసరావుపేట ఒకటో, రెండో పట్టణం, గ్రామీణ పోలీసు స్టేషన్‌లోని మానిటర్స్‌కు కెమెరాలను అనుసంధానం చేశారు. ఇందులోని దృశ్యాలను సిబ్బంది పర్యవేక్షిస్తున్నారు. రోడ్డు ప్రమాదాలు, నేరస్థుల కదలికలు, అనుమానాస్పద వ్యక్తుల సంచార దృశ్యాలను గుర్తించి సంబంధిత ప్రాంతాల్లోని పోలీసులకు సమాచారం చేరవేస్తున్నారు. దీంతో వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని నేర ప్రభావ తీవ్రతను అరికట్టడడం, రోడ్డు ప్రమాద బాధితులకు సాయం చేసేందుకు వీలుపడుతుంది. ప్రమాదాలకు కారణమైన వాహనాలు  పట్టుకోవడం, ట్రాఫిక్‌ రద్దీ మేరకు చర్యలు చేపడటం సులువవుతుంది. నేరస్థులు పారిపోకుండా పట్టుకునేందుకు ఇది  సహాయపడుతుందని రెండో పట్టణ సీఐ వెంకట్రావు ‘న్యూస్‌టుడే’కి తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని