logo

మాగాణి సాగుపై అనాసక్తి

పుడమి తల్లిని నమ్ముకున్న అన్నదాతకు ఏటేటా నష్టాలు పెరుగుతున్నాయి. కర్షకునికి భూమికి వీడదీయరాని బంధం ఉన్నప్పటికీ పెరుగుతున్న పెట్టుబడులు, చుట్టుముడుతున్న చీడపీడలు, దక్కని మద్దతు ధరలు ఊపిరి సలపనీయడం లేదు.

Published : 27 Jun 2022 06:04 IST

ఖర్చులు పెరిగి గిట్టుబాటు కావడం లేదంటున్న అన్నదాతలు
న్యూస్‌టుడే, పిడుగురాళ్ల, రొంపిచర్ల

పుడమి తల్లిని నమ్ముకున్న అన్నదాతకు ఏటేటా నష్టాలు పెరుగుతున్నాయి. కర్షకునికి భూమికి వీడదీయరాని బంధం ఉన్నప్పటికీ పెరుగుతున్న పెట్టుబడులు, చుట్టుముడుతున్న చీడపీడలు, దక్కని మద్దతు ధరలు ఊపిరి సలపనీయడం లేదు. ఈ నేపథ్యంలో సాగుకు వెనకడుగు వేస్తున్నాడు. ఈ పరిస్థితి పల్నాడు ప్రాంతంలో ఎక్కువగా ఉంది. ఒకప్పుడు మాగాణి పొలాలకు మంచి డిమాండ్‌ ఉండేది. వరి పండించే ప్రాంతాలు అభివృద్ధి చెందినవిగా, మెట్ట పంటలు పండించేవి వెనకబడిన ప్రాంతాలుగా పరిగణించే వారు. రానురాను కాలం మారుతోంది. మాగాణిలో ఖర్చులు పెరిగి పెట్టుబడులు కూడా రాని పరిస్థితులు ఎదురవుతున్నాయి. వరిసాగులో నష్టాలు వస్తున్నాయని కౌలు రైతులు కూడా పొలాలను కౌలుకు తీసుకోకుండా కూలీ చేసుకుని కాలం వెళ్లదీస్తున్నారు.

బీళ్లుగా పొలాలు

జిల్లాలో కరవు కాటకాలు లేకున్నా వ్యవసాయంలో మిగులు కానరాని పరిస్థితి. ఎరువులు, పురుగు మందులు, డీజిల్‌, కూలి ఖర్చులు పెరిగిపోవడం వల్ల పెట్టుబడి వ్యయం రెట్టింపైంది. దీంతో వరి సేద్యానికి రైతులు వెనకడుగు వేస్తున్నారు. కొన్నిచోట్ల కౌలుకు కూడా పొలాలు తీసుకోవటం లేదు. ప్రస్తుతం చాలాచోట్ల 5 నుంచి 3 బస్తాలకు కౌలు పడిపోయింది. ఈ క్రమంలో కొందరు భూ యజమానులు సొంతంగా సాగు చేసుకోవాల్సిన పరిస్థితి. ఇలా చేసుకోలేని వారు భూములను బీళ్లుగా వదిలేస్తున్నారు.

పెరిగిన వ్యవసాయ ఖర్చులు

వరి సాగులో ఏటికేటికి ఖర్చులు పెరిగిపోతున్నాయి. దీంతో మిగులుదల ఉండడం లేదు. ఆరుగాలం శ్రమించినా పెట్టుబడులు కూడా రాని పరిస్థితి ఎదురవుతోంది. దీంతో మాగాణి సాగుకు వెనకడుగు వేస్తున్నారు. నాట్లు వేసే కూలీలకు గతంలో ఎకరాకు రూ.2500 ఉండగా, నిరుడు ఆ ఖర్చు రూ.3500కు చేరింది. డీజిల్‌ ధరలు పెరగటంతో ట్రాక్టర్‌తో గొర్రు తోలటం, దమ్ము చేయటం వంటి వాటికి ధరలు పెంచారు. వ్యవసాయ, ఎరువులు, పురుగు మందులు, కూలీల ఖర్చులు మొత్తం కలిపితే ఎకరానికి రూ.42 వేల వరకు ఖర్చవుతుందని రైతుల అంచనా. ఎకరానికి 30బస్తాల దిగుబడి వచ్చినా బస్తా ధర రూ.1200కు మించి పలకటం లేదు. ఈ లెక్కన 30 బస్తాల ధాన్యం అమ్మితే రూ. 36,000 వస్తున్నాయి. కౌలు పక్కన పెడితే పెట్టుబడి కూడా దక్కే పరిస్థితి లేదు. దీంతో వరి సాగు అంటేనే రైతు ఆలోచించాల్సి వస్తోంది.

వరి సాగు చేయని పొలం..

మొక్కజొన్న వైపు మొగ్గు

గత ఏడాది మొక్కజొన్న సాగు చేసిన రైతులకు దిగుబడులు ఆశాజనకంగా ఉండడం, మంచి ధర ఉండటంతో ఈ ఏడాది కూడా కర్షకులు మొక్కజొన్న సాగుకు మొగ్గు చూపుతున్నారు. మొక్కజొన్న సాగుకు కౌలు ధర కూడా హెచ్చుగానే ఉంది. పల్నాడు ప్రాంతంలోని పలు గ్రామాల్లో రూ.15వేలు చొప్పున ఎకరానికి చెల్లిస్తున్నారు.

అప్పుల పాలయ్యా.. - తమ్మినేడి ప్రకాశరావు, రైతు

20 ఏళ్లకు పైగా వ్యవసాయం చేశా. 15 ఎకరాలను కౌలుకు తీసుకొని వరిసాగు చేశా. కొన్నేళ్లుగా వ్యవసాయ ఖర్చులు, కూలీల రేట్లు, ఎరువుల ధరలు పెరిగాయి. ఏటా పండించిన పంటకు గిట్టుబాటు ధర లభించక నష్టాలు వచ్చి రూ.15 లక్షల వరకు అప్పులపాలయ్యా. సాగు చేసి వాటిని తీర్చలేని పరిస్థితుల్లో ఉన్న ఎకరన్నర భూమిని అమ్ముకున్నా. మాగాణి సాగుకు ఎవరూ ముందుకు రావటం లేదు. ఎకరానికి నాలుగైదు బస్తాల కౌలు ఇచ్చి సాగుచేసుకోమంటున్నా ధైర్యం చాలడం లేదు. వ్యవసాయం మానేసి ప్రస్తుతం కూలీ పనికి వెళుతున్నా.


కూలిచేసుకుంటూ జీవిస్తున్నాం - బండ్ల అప్పారావు, గుత్తికొండ

గతంలో ఏటా ఏడు ఎకరాలు కౌలుకు తీసుకొని సాగుచేశా. నాలుగు ఎకరాలు మాగాణి, మూడు ఎకరాలు పత్తి, మిరప పంటలు సాగు చేశా. నష్టాలు వచ్చి అప్పులు పాలయ్యాను. ఏటికేడు అప్పులు పెరిగి పోతున్నాయి తప్పితే తీరటం లేదు. దీంతో పొలాలు కౌలుకు తీసుకోవడం మానేశా. అప్పులు తీర్చడానికి కుటుంబ సభ్యులందరం కూలీకి వెళుతున్నాం. చాలావరకు అప్పులు తీర్చాం. మాగాణి భూములు తక్కువ కౌలుకు ఇస్తామంటున్నా పంట వేయడానికి ఆసక్తి ఉండడం లేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని