logo

‘బీసీలకు ముఖ్యమంత్రి పదవే లక్ష్యం’

పదవుల పంపకాల్లో రాజీపడేది లేదని, ముఖ్యమంత్రి పీఠమే లక్ష్యంగా బీసీలు పనిచేయాలని, సీఎం పదవి మీరు ఇస్తే సరే...లేదంటే త్వరలోనే పార్టీని నెలకొల్పుతామని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకరరావు తెలిపారు.

Published : 27 Jun 2022 06:06 IST

ఐక్యత చాటుతున్న కేసన శంకరరావు, కృష్ణయ్య, శ్రీనివాస్‌గౌడ్‌ తదితరులు

నగరంపాలెం(గుంటూరు), న్యూస్‌టుడే: పదవుల పంపకాల్లో రాజీపడేది లేదని, ముఖ్యమంత్రి పీఠమే లక్ష్యంగా బీసీలు పనిచేయాలని, సీఎం పదవి మీరు ఇస్తే సరే...లేదంటే త్వరలోనే పార్టీని నెలకొల్పుతామని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకరరావు తెలిపారు. ఆదివారం గుంటూరులో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశం జరిగింది. శంకరరావు మాట్లాడుతూ రాష్ట్రంలోని పార్టీలు బీసీలకు చిన్నచితక పదవులు ఇచ్చి వారిని లోబరచుకుంటున్నారన్నారు. 2024లో మరోసారి వారు అధికారంలోకి రావాలని ఉవ్విళ్లూరుతున్నారన్నారు. బీసీలు మంత్రి పదవులు, రాజ్యసభ సీట్లకు రాజీ పడరని, బీసీని ముఖ్యమంత్రి పీఠంపై ఎక్కించడమే తన లక్ష్యమన్నారు. ఆరు నెలల్లో వైకాపా, తెదేపా, భాజపా, జనసేన పార్టీలు ముఖ్యమంత్రి సీటు బీసీకి ఇస్తున్నట్లు ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. లేని పక్షంలో బీసీలు ఏకమై ప్రత్యేక రాజకీయ పార్టీని నెలకొల్పుతామన్నారు. ఏపీలో 60 శాతం జనాభా ఉండి, 130కి పైగా కులాలు ఉన్న బీసీలకు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం రాలేదన్నారు. త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా రథయాత్ర చేపట్టనున్నట్లు, తిరుపతిలో బీసీ ప్లీనరీ నిర్వహించి పార్టీ ప్రకటిస్తామని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్‌ మాట్లాడుతూ తెలంగాణ, ఏపీలో  అధికారం ఉన్న పదవులు అగ్రవర్ణాలు అనుభవిస్తూ, అధికారం లేని పదవులు బీసీలకు ఇచ్చి, సామాజిక న్యాయం చేశామని ప్రచారం చేసుకుంటున్నారని మండిపడ్డారు. వైకాపా, తెరాస పార్టీలు ముఖ్యమంత్రి, పార్టీ పగ్గాలను బీసీలకు ఇవ్వగలరా అని ప్రశ్నించారు. విశ్రాంత ఐఏఎస్‌ అధికారి కృష్ణయ్య మాట్లాడుతూ బీసీలు రాజ్యాధికారం దిశగా పయనించాలనంటే అన్ని వర్గాల వారిని సమన్వయం చేసుకొని ముందుకు సాగాలన్నారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అన్నవరపు నాగమల్లేశ్వరరావు, యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు కుమ్మర క్రాంతికుమార్‌, నాయకులు కన్నా మాస్టార్‌, పావూలూరి హనుమంతరావు, బ్రహ్మానందశర్మ, తన్నీరు అంజనేయులు, జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని