logo

మద్యానికి బానిసలు కావొద్దు

మద్యం తాగి ఆరోగ్యం పాడుచేసుకోవద్దని, కేసుల్లో ఇరుక్కొని సమాజానికి ఇబ్బందికరంగా మారవద్దని జిల్లా జడ్జి పార్థసారథి హితబోధ చేశారు. జాతీయ లోక్‌అదాలత్‌ సందర్భంగా ఆదివారం స్థానిక జిల్లా కోర్టు ప్రాగంణంలోని

Updated : 27 Jun 2022 06:38 IST

జిల్లా జడ్జి పార్థసారథి 

లోక్‌అదాలత్‌లో 5,315 కేసుల పరిష్కారం

గుంటూరు లీగల్‌, న్యూస్‌టుడే: మద్యం తాగి ఆరోగ్యం పాడుచేసుకోవద్దని, కేసుల్లో ఇరుక్కొని సమాజానికి ఇబ్బందికరంగా మారవద్దని జిల్లా జడ్జి పార్థసారథి హితబోధ చేశారు. జాతీయ లోక్‌అదాలత్‌ సందర్భంగా ఆదివారం స్థానిక జిల్లా కోర్టు ప్రాగంణంలోని మొబైల్‌ కోర్టు వద్ద ఎక్కువ మంది కక్షిదారులు ఉన్నారు. వారిని గమనించిన జడ్జి పోలీసులను ఆరా తీయగా వారంత మద్యం కేసుల్లో నిందితులుగా ఉన్నారని తెలిపారు. దీంతో ఆయన వారికి మద్యంపై అవగాహన కల్పించారు. మద్యపాన వ్యసనానికి గురైన వ్యక్తుల ప్రభావం వారి పిల్లలపై కూడా పడుతుందన్నారు. వారి ఉన్నతికి ఆటంకం ఏర్పడుతుందన్నారు. అంతకు ముందు న్యాయసేవాధికార సంస్థ కార్యాలయంలో జరిగిన మరో సమావేశంలో ఆయన మాట్లాడుతూ సమాజంలో మానవత్వం దిగజారిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. గంజాయి, మద్యం తదితర మత్తుపదార్థాల కారణంగా విచక్షణ కోల్పోయి, సొంత బిడ్డలపైనే అఘాయిత్యాలకు పాల్పడుతున్నారన్నారు. వ్యవస్థలో మార్పు తీసుకువచ్చేందుకు అందరూ ప్రయత్నించాలని ఆకాంక్షించారు.

రూ.30 కోట్ల కేసుకు సామరస్య పరిష్కారం : దశాబ్ధం కిందట గుంటూరు నగర శివారులోని శివారెడ్డిపాలెంలోని ఓ కుటుంబానికి చెందిన మూడెకరాల భూమి వివాదంలో చిక్కుకుంది. కుటుంబ సభ్యులు కేసులు దాఖలు చేసుకున్నారు. తర్వాత కేసు దాఖలు చేసిన వ్యక్తి మృతి చెందడంతో ఆయన వారసులు కేసులోకి వచ్చారు. 9 మంది కుటుంబ సభ్యులు పలు ప్రాంతాల్లో స్థిరపడ్డారు. వారి మధ్య పదేళ్లుగా సత్ససంబధాలు లేవు. ఆదివారం జరిగిన లోక్‌అదాలత్‌లో ఈ సమస్యకు సామరస్య పరిష్కారం జరిగి, కుటుంబసభ్యుల మధ్య శాంతి నెలకొంది. జడ్జి ఏడుకొండలు ప్రత్యేక చొరవ తీసుకొని వారితో మాట్లాడి సమస్యను పరిష్కరించారు. దీని విలువ ప్రస్తుతం రూ.30 కోట్లు ఉంటుందని అంచనా కాగా, తమ సమస్య లోక్‌అదాలత్‌ ద్వారా పరిష్కారం కావటం ఆనందంగా ఉందని వారు సంతోషం వ్యక్తం చేశారు.

రూ.3కోట్లకు వాహన ప్రమాదాల పరిహారం : వాహన ప్రమాదాల్లో కుటుంబసభ్యులను కోల్పోయి, అంగవైకల్యం కలిగిన వ్యక్తులకు ఆదివారం జరిగిన మెగా లోక్‌అదాలత్‌లో ఉపశమనం కలిగింది. ఒకటో అదనపు జిల్లా జడ్జి వి. గోపాలకృష్ణారావు ఆధ్వర్యంలో వివిధ బీమా సంస్థలకు చెందిన వంద వాహన ప్రమాద కేసులను పరిష్కరించారు. బాధితులకు సుమారు రూ.3 కోట్ల నష్టపరిహారం మంజూరు చేశారు. కార్యక్రమంలో అదనపు జిల్లా జడ్జిలు అర్చన, రాంగోపాల్‌ తదితరులు పాల్గొన్నారు.

* ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆదివారం జరిగిన మెగా జాతీయ లోక్‌అదాలత్‌లో 5315 కేసులు పరిష్కరించారు. 4429 క్రిమినల్‌ కేసులు, 275 సివిల్‌ కేసులు పరిష్కరించివాటిలో ఉన్నాయి. జాతీయ లోక్‌అదాలత్‌ కోసం నెలరోజుల ముందు నుంచే ప్రత్యేక చర్యలు చేపట్టారు. పోలీసు, రెవెన్యూ, బీమా ఇతర అధికారులతో జిల్లా జడ్జి పార్థసారథి ప్రత్యేక సమావేశాలు నిర్వహించి అధిక కేసులు పరిష్కరించేందుకు పలు సూచనలు చేశారు. ఉదయం నుంచి ఆయన నగరంలోని కోర్టులన్నింటిల్లో జరుగుతున్న కేసులను పరిశీలించి న్యాయమూర్తులకు, కక్షిదారులకు పలు సూచనలు చేశారు. ఆయనతో పాటు లోక్‌అదాలత్‌ కార్యదర్శి రత్నకుమార్‌ పాల్గొన్నారు. లోక్‌అదాలత్‌కు సహకరించిన కక్షిదారులకు న్యాయవాదులకు, సిబ్బందికి న్యాయమూర్తులు కృతజ్ఞతలు తెలిపారు.

రాజీకోసం అమెరికా నుంచి వచ్చా.. : ఆదివారం గుంటూరులో జరిగిన జాతీయ లోక్‌అదాలత్‌లో హాజరైందుకు అమెరికా నుంచి ఓ ఎన్‌ఆర్‌ఐ వచ్చారు. నరసరావుపేటకు చెందిన బొక్కిసం నాగమల్లేశ్వరరావు అనే అతను 2005లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం కోసం అమెరికా వెళ్లి అక్కడ స్థిరపడ్డారు. ఆయనకు తన కుటుంబసభ్యులతో ఆస్తివివాదం నెలకొంది. దీనిని పరిష్కరించుకునేందుకు కుటుంబ సభ్యులు కూడా ముందుకు రావడంతో ఆయన అమెరికా నుంచి వచ్చారు. ఆదివారం జరిగిన లోకఅదాలత్‌కు ఆయన రాగా కుటుంబసభ్యులు హాజరు కాలేదని న్యాయమూర్తుల దృష్టికి తీసుకెళ్లారు. వారి కోసం ప్రయత్నించమని న్యాయమూర్తులు సిబ్బందికి సూచించారు. వారి నుంచి ఎలాంటి సమాచారం రాకపోవడంతో కేసును మంగళవారానికి వాయిదా వేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని