logo

నేతల సిఫార్సు బదిలీలు!

ఒకవైపు ప్రభుత్వ ఉద్యోగులకు సాధారణ బదిలీలు జరుగుతున్నాయి. అవి నెలాఖరుతో ముగియనున్నాయి. ఆ వెంటనే ఉపాధ్యాయులకు కౌన్సెలింగ్‌ బదిలీలు నిర్వహిస్తారని ఉపాధ్యాయవర్గం ఎంతో ఆశగా ఉంది.

Updated : 27 Jun 2022 06:37 IST
ఉపాధ్యాయుల్లో ఆందోళ
కౌన్సెలింగ్‌కు ముందే తూట్లు
మండిపడుతున్న సంఘాలు

ఈనాడు, అమరావతి: ఒకవైపు ప్రభుత్వ ఉద్యోగులకు సాధారణ బదిలీలు జరుగుతున్నాయి. అవి నెలాఖరుతో ముగియనున్నాయి. ఆ వెంటనే ఉపాధ్యాయులకు కౌన్సెలింగ్‌ బదిలీలు నిర్వహిస్తారని ఉపాధ్యాయవర్గం ఎంతో ఆశగా ఉంది. వారి ఆశలపై నీళ్లు చల్లేలా ప్రభుత్వం అంతకన్నా ముందు సిఫార్సు బదిలీలకు తెరలేపింది. దీనిపై ఉపాధ్యాయ వర్గం మండిపడుతోంది. సిఫార్సులు లేని సాధారణ ఉపాధ్యాయులు, ఒకే పాఠశాలలో 8 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకుని ఈసారి బదిలీల్లో కేటగిరి 1, 2(దగ్గర స్కూళ్లు) ప్రదేశాలకు చేరుకుంటామని ఆశపడ్డ ఉపాధ్యాయులు అందరూ ప్రస్తుతం జరుగుతున్న సిఫార్సు బదిలీలు చూసి మరోసారి తమకు అన్యాయం జరిగిపోయినట్లేనని ఆందోళన చెందుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 205 మంది ఉపాధ్యాయుల బదిలీలకు సీఎంఓ ఆమోదం తెలపగా వాటిల్లో ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచి 19 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. గతంలో ఏ ప్రజాప్రతినిధి సిఫార్సు చేశారనేది తెలిసేది కాదు. ఈసారి ఫలానా టీచర్‌ బదిలీకి సిపార్సు చేసిన ప్రజాప్రతినిధి పేరుతో సహా జాబితాలు బయటకు వచ్చాయంటే ఎంతగా బరితెగించారో ఊహించుకోవచ్చు. కౌన్సెలింగ్‌ బదిలీల్లో అయితే కోరుకున్న పాఠశాల దక్కదని, ఎక్కడ ఖాళీలు ఉంటే అక్కడకు వెళ్లాల్సి ఉంటుందని కొందరు ఉపాధ్యాయులు పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టుకుని సిఫార్సు బదిలీలు తెచ్చుకుంటున్నారని సంఘాల నాయకులు తెలిపారు. కౌన్సెలింగ్‌తో సంబంధం లేకుండా ప్రభుత్వ అనుమతితో చేసే బదిలీలు అని వీటిని అంటారు. బదిలీల్లో దూర ప్రాంతాల్లోని పాఠశాలలకు వెళ్లకుండా తప్పించుకోవటానికి ఇదో రాచమార్గమని అంటున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ ఎంపీపీలు సైతం జిల్లాలోని కొందరు టీచర్ల బదిలీలకు సిఫార్సు చేసిన వారిలో ఉన్నారు. ప్రస్తుతం ఈ సిఫార్సు బదిలీలు ఉపాధ్యాయవర్గంలో చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఇప్పటి దాకా 19 మంది ఉపాధ్యాయులకు సంబంధించిన దరఖాస్తులపై రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ రిమార్క్స్‌ కోరిందని, ఇంకా మరికొందరి జాబితా సీఎంఓలో ఉందని చెబుతున్నారు. ఇప్పటికే గుంటూరు, పల్నాడు జిల్లాల విద్యాశాఖ అధికారులు రిమార్క్స్‌ రాసి పంపారు. ఒకేచోట ఎనిమిదేళ్ల నుంచి పనిచేస్తున్న ఉపాధ్యాయులు త్వరలో జరిగే కౌన్సెలింగ్‌ బదిలీల్లో తప్పనిసరిగా కదలాల్సి ఉంటుంది. అప్పుడు ఎక్కడో సుదూరాన ఉండే పాఠశాలకు వెళ్లాల్సి ఉంటుందని ముందుగానే ప్రభుత్వ అనుమతితో కోరుకున్న స్కూల్‌కు ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలతో ప్రయత్నాలు చేసుకుంటున్నారు. వీటిని ముఖ్యమంత్రి కార్యాలయం ఆమోదించడం విమర్శలకు దారితీస్తోంది.
కౌన్సెలింగ్‌ విధానానికి తూట్లు పొడవటమే
ఉపాధ్యాయుల బదిలీలకు పారదర్శకమైన కౌన్సెలింగ్‌ విధానాన్ని ఉపాధ్యాయులు, సంఘాలు, విద్యారంగం నిపుణులు ఎన్నో ఏళ్లుగా ఉద్యమాలు చేసి సాధించుకున్నాం. దానికి తూట్లు పొడిచేలా మధ్యలో ప్రభుత్వం సిఫార్సు బదిలీలకు పూనుకోవటం అత్యంత దుర్మార్గం. దీనివల్ల బదిలీలకు అర్హులైన ఉపాధ్యాయులకు అన్యాయం జరుగుతుంది. ఇప్పటికే అనేక ఏళ్లుగా దూర ప్రాంతాల్లో పనిచేస్తున్న వారు కౌన్సెలింగ్‌ బదిలీలు నిర్వహిస్తే వారు దగ్గరి ప్రాంతాలకు రావటానికి ఆస్కారం ఉంటుంది. ఆలోపే సిఫార్సు బదిలీలతో దగ్గరి స్కూళ్లల్లోని ఖాళీలను భర్తీ చేస్తే మరోసారి దూర ప్రాంతాల్లో ఉంటున్న వారికి అన్యాయం జరిగినట్లే. ఈ విధానం సరైంది కాదు. వెంటనే సిఫార్సు బదిలీలు రద్దు చేయాలి. - కేఎస్‌ లక్ష్మణరావు, విద్యారంగం నిపుణులు, ఎమ్మెల్సీ
ఇలాగైతే ఖాళీలు ఇంకెక్కడ ఉంటాయి?
ఒకవైపు సిఫార్సు బదిలీలు, మరోవైపు జీవో నంబరు 117 ప్రకారం పాఠశాలల కుదింపు, పోస్టుల హేతుబద్ధీకరణ వంటి వాటితో ఇప్పటికే పాఠశాలల్లో ఖాళీ పోస్టులు అనేవి తగ్గిపోయాయి. మరోవైపు డీఎస్సీ-98 వాళ్లకు పోస్టింగ్‌లు ఇవ్వనుండటంతో అసలు ఖాళీలు అనేవి లేకుండా పోతాయి. సిఫార్సు బదిలీలు చేయటం వల్ల అంతిమంగా సాధారణ ఉపాధ్యాయులు నష్టపోతారు. ఇప్పటికే వీరంతా ఆందోళనలో ఉన్నారు. ఆ ప్రభావం బోధనపై పడుతుంది. గతంలో ఎప్పుడూ ఏ ప్రజాప్రతినిధి సిఫార్సు చేశారో తెలిసేది కాదు. ఈసారి సిఫార్సు చేసిన ప్రజాప్రతినిధి పేరుతో సహా జాబితాలు బయటకు వచ్చాయి. ఏం చేస్తారో చేసుకోండి అన్నట్లు ప్రజాప్రతినిధుల తీరు ఉంది. ఇలా సిఫార్సు చేయటం అంటే అవినీతిని ప్రోత్సహించడమే. ఈ బదిలీలను చూస్తూ ఊరుకోం. మిగిలిన సంఘాలను కలుపుకుని ఉద్యమిస్తాం. - కె.బసవలింగారావు, అధ్యక్షుడు, ఏపీటీఎఫ్‌ ఉపాధ్యాయ సంఘం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని